Sunil Gavaskar: బీసీసీఐ స్కీమ్‌ సూపర్.. రంజీ ఫీజులను మూడింతలు చేస్తే బాగుంటుంది: గావస్కర్

దేశవాళీ క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోవాలని.. అందులో ముఖ్యమైంది ఫీజులను పెంచితే బాగుంటుందని క్రికెట్ దిగ్గజం సూచించాడు. 

Published : 16 Mar 2024 14:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌ వృద్ధి కోసం బీసీసీఐ (BCCI) ఇటీవల ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను ప్రకటించింది. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు అదనంగా ఫీజు చెల్లించడం వల్ల సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆడేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తారనేది బోర్డు భావన. ఇంగ్లాండ్‌పై భారత్ (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్నాక బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై క్రికెట్‌ వర్గాల నుంచి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కూడా అభినందించాడు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్‌లోనూ మరిన్ని మార్పులు తీసుకొస్తే బాగుంటుందని సూచించాడు. రంజీ ట్రోఫీలో ఆడిన క్రికెటర్లకు మరింత ఫీజు చెల్లిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. 

‘‘బీసీసీఐ రివార్డు స్కీమ్‌ చాలా బాగుంది. టెస్టు క్రికెట్ ఆడాలనుకునేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈసందర్భంగా నేను బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేస్తున్నా. రంజీ ట్రోఫీపైనా ఓసారి దృష్టి సారించాలి. రంజీ ట్రోఫీ ఫీజులను కనీసం రెండింతల నుంచి మూడింతలు చేయాలని కోరుతున్నా. అలా చేయడం వల్ల మరికొందరు దేశవాళీలో ఆడేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీ షెడ్యూల్‌ను కూడా మారిస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో నిర్వహించాలి. అప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీలు పెట్టాలి. అప్పుడు, ప్రతిఒక్కరూ అందుబాటులో ఉంటారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేవారు మినహా అంతా ఆడతారు. జనవరి నుంచి వన్డేలు ఆడితే ఐపీఎల్‌కు తగినంత ప్రాక్టీస్ కూడా లభించినట్లు అవుతుంది’’ అని గావస్కర్ తెలిపాడు.

ఇటీవలే ముంబయి క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచింది. 42వ సారి విజేతగా నిలిచింది. దీంతో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ తమ జట్టు సభ్యలకు డబుల్‌ బొనాంజాను ఆఫర్ చేసింది. ప్రస్తుతం రంజీ ప్రైజ్‌మనీకి అదనంగా రూ.5 కోట్లను ఎంసీఏ ప్రకటించింది. ఈక్రమంలో గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని