IPL 2024: రోహిత్‌కు 36 ఏళ్లు.. భవిష్యత్తు కోసమే ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పు: సన్నీ

ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) జట్టు కెప్టెన్‌ను మార్చడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. తాజాగా భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 14 Feb 2024 10:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీలో మార్పులు చేసి ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో హార్దిక్‌ పాండ్యను సారథిగా నియమించింది. ముంబయి కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వ్యాఖ్యలు, రోహిత్ శర్మ భార్య రితికా సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. హిట్‌మ్యాన్‌ అభిమానులు కూడా ఆ జట్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే, క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) మాత్రం ముంబయికి మద్దతుగా నిలిచాడు. కెప్టెన్‌ను మార్చడానికి గల కారణాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

‘‘ముంబయి జట్టు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. రోహిత్‌కు ఇప్పుడు 36 ఏళ్లు. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ సారథిగా ఉన్నాడు. అతడిపై ఉన్న భారాన్ని కొంత తగ్గించాలనే ఉద్దేశంతో.. యువకుడు హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా నియమించింది. దీంతో ముంబయి ఇండియన్స్‌తోపాటు రోహిత్‌కు ప్రయోజనం చేకూరనుంది. హిట్‌మ్యాన్‌ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంది. టాప్‌ ఆర్డర్‌లో అతడు మరిన్ని పరుగులు రాబడితే జట్టుకు కలిసొస్తుంది. హార్దిక్‌ పాండ్య మూడు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలడు. అప్పుడు ముంబయి ప్రతి మ్యాచ్‌లోనూ 200+ స్కోరు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి’’ అని గావస్కర్‌ తెలిపాడు. 

రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు ముంబయి ఇండియన్స్‌ ప్రకటించిన గంట వ్యవధిలోనే.. ఆ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4 లక్షల మంది అభిమానులు వీడారు.. గుజరాత్‌ కెప్టెన్‌గా ఉన్న పాండ్యను ముంబయికి రికార్డు స్థాయి ధర చెల్లించి మరీ తీసుకురావడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని