IND vs ENG: అనుభవం లేని కుర్రాళ్లు అన్నారు.. వారి పట్టుదల ముందు అంతా దిగదుడుపే: రోహిత్ శర్మ

సెంచరీలు చేయడమే కాదు.. ప్రత్యర్థికి చెందిన 20 వికెట్లు పడగొట్టమూ ముఖ్యమని భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది.

Updated : 09 Mar 2024 17:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌ను యువ భారత్‌ కైవసం చేసుకుంది. దాదాపు 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడి.. 4-1తో సిరీస్‌ను గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఎక్కువగా కుర్రాళ్లే ఉన్న ఈ జట్టు బలమైన పర్యటక టీమ్‌పై ఆధిపత్యం సాధించడం విశేషం. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌, ధ్రువ్‌, గిల్ అదరగొట్టేశారు. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌ బ్యాటర్లు తడబడిన వేళ టీమ్‌ఇండియా ఆటగాళ్లు మాత్రం భారీగా పరుగులు రాబట్టారు. ఇదే విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌ అనంతరం వెల్లడించాడు. 

‘‘సిరీస్‌ను ఇంతటి స్థాయిలో సాధించడం సాధారణ విషయం కాదు. ఒక దశలో కొంతమంది మన జట్టుపై చేసిన వ్యాఖ్యలూ మాలో పట్టుదల పెంచాయి. అనుభవం పెద్దగా లేని కుర్రాళ్లతో బరిలోకి దిగాం. అయితే, వారు చూపించిన తెగువ అద్భుతం. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. జట్టు మొత్తం కలిసికట్టుగా ఇంగ్లాండ్‌ను ఓడించింది. అందరూ శతకాలు గురించి మాట్లాడుతుంటారు. కానీ, ప్రత్యర్థికి చెందిన 20 వికెట్లు తీయడమూ కీలకమే. మా బౌలర్లు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. కుల్‌దీప్‌ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ ప్రదర్శన సూపర్. గాయ పడిన తర్వాత జట్టులోకి వచ్చి బౌలింగ్‌ చేస్తున్న తీరు అభినందనీయం. యువ బ్యాటర్ జైస్వాల్ సత్తా అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురి చేసే టాలెంట్‌ అతడి సొంతం. సవాళ్లను ఎదుర్కోవడం అతడికి చాలా ఇష్టం. తప్పకుండా ఇది జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే సిరీస్‌ అవుతుంది’’ అని రోహిత్ తెలిపాడు. 

గట్టి జట్టుతోనే తలపడ్డామని భావిస్తున్నా: బెన్‌ స్టోక్స్

‘‘నాణ్యమైన ప్రత్యర్థితో మేం తలపడ్డాం. మేం ఇంకా ఆడాల్సిన క్రికెట్‌ చాలా ఉంది.  ఈ సిరీస్‌ ఓటమిని వదిలిపెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద సిరీస్‌లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వ్యక్తిగతంగా మా ఆటతీరు ఎలా ఉంటుందో తెలుసు. అయితే, తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై విశ్లేషించుకుంటాం. బౌలింగ్‌ పరంగా భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లోనూ కొత్త కుర్రాళ్లు బాగా ఆడారు. రిస్క్‌ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్ మంచి భాగస్వామ్యాలను నిర్మించారు. యువ బౌలర్లు బషీర్, హార్ట్‌లీ ఉత్తమ ప్రదర్శన చేశారు. మా స్టార్‌ పేసర్ జేమ్స్‌ అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. రూట్‌ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది’’ అని ఇంగ్లాండ్‌ కెప్టెన్ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని