Virat Kohli: కింగ్‌ వచ్చేశాడు.. త్వరలో ఐపీఎల్‌ సన్నాహాలు షురూ..!

కింగ్‌ కోహ్లీ భారత్‌కు చేరుకున్నాడు. త్వరలో ఆర్సీబీ జట్టుతో కలిసి మైదానంలో సాధన మొదలుపెట్టే అవకాశం ఉంది.

Updated : 17 Mar 2024 11:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘ విరామం తర్వాత కింగ్‌ కోహ్లీ (Virat Kohli) అభిమానులను అలరించేందుకు మైదానంలో దిగనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అతడు ఆర్సీబీ జట్టుతో కలిసేందుకు భారత్‌ వచ్చాడు. ఆదివారం ముంబయి విమానాశ్రయంలో అతడిని చూసి ఫ్యాన్స్‌ కేరింతలు కొట్టారు. ఐపీఎల్‌కు కోహ్లీ అందుబాటులో ఉండే విషయంపై ముసురుకొన్న సందేహాలకు దీంతో ముగింపు పలికినట్లైంది.

ఈ సీజన్‌ కోహ్లీ కెరీర్‌లో మరపురాని జ్ఞాపకంగా మారుతుందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. అతడు సుదీర్ఘ విరామం తీసుకోవడంతో మళ్లీ ఉత్సాహంగా బ్యాటింగ్‌ చేస్తాడన్నాడు. గత రెండేళ్లుగా విరాట్‌ అద్భుతమైన క్రికెట్‌ ఆడాడని.. ఆసియాకప్‌లో చేసిన శతకం ఇప్పటికీ తనకు గుర్తుందని పేర్కొన్నాడు.

ఈ సారి ఆర్సీబీ ప్రత్యర్థి జట్లకు కోహ్లీ రూపంలో భారీ ముప్పు పొంచి ఉందని మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ హెచ్చరించాడు. 2016లో కూడా చాలా కాలం విరామం తర్వాత కోహ్లీ మైదానంలో సంచలనాలు సృష్టించినట్లే.. ఈ సారి కూడా ఉండబోతోందన్నాడు. ఆ ఏడాది ఐపీఎల్‌లో ఏకంగా 973 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ‘‘కోహ్లీ చాలా ఫిట్‌గా ఉండే ఆటగాడు. విరామం తీసుకొని ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా మైదానంలోకి అడుగుపెట్టనుండటం ప్రత్యర్థులకు ఆందోళనకరమే. ఐపీఎల్‌ కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. అతడి కెరీర్‌లో రెండో అత్యుత్తమ సీజన్‌గా ఇది మిగలనుందని నేను నమ్ముతున్నాను’’ అని పఠాన్‌ పేర్కొన్నాడు. 

కప్పు.. ఎవరి కొప్పులో?

కోహ్లీ సతీమణి అనుష్కా మగబిడ్డకు జన్మనివ్వడంతో లండన్‌లో ఆ జంట విశ్రాంతి తీసుకొంది. ఆ బిడ్డకు అకాయ్‌ అనే పేరు పెట్టారు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. మరోవైపు అతడికి టీ20 ప్రపంచకప్‌లో స్థానం దక్కడం కష్టమని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఏడాదిన్నర నుంచి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తాజా ఐపీఎల్‌లో అతడు రాణిస్తే ప్రపంచకప్‌లో స్థానానికి ఇబ్బంది ఉండదని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని