Smart phone Tips: వేసవిలో స్మార్ట్‌ ఫోన్లు వేడెక్కుతున్నాయా? ఈ జాగ్రత్తలు పాటించండి!

స్మార్ట్‌ఫోన్‌ పేలి ప్రమాదాలు జరిగే అవకాశం వేసవిలోనే అధికం. మరి ఈ కాలంలో యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం..

Updated : 11 May 2022 18:42 IST

‘ఛార్జింగ్‌ పెట్టిన మా వాళ్ల ఫోన్‌ బాగా వేడెక్కి పేలిపోయిందట, ఈ మధ్య నా ఫోన్‌ బాగా హీట్‌ అవుతోంది’.. ఈ మధ్య ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వేసవిలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొబైల్‌ యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?అలాగే బ్యాటరీ సేవింగ్స్‌ టిప్స్‌పై కూడా ఓ లుక్కేయండి మరి. 


సూర్యకాంతి పడకుండా (Direct Sunlight): మనం ఇంట్లో ఉన్నపుడు ఉష్ణోగ్రత ఒకలా.. బయటకు వెళ్లినపుడు మరోలా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎండ తగలకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఫోన్‌ విషయంలో అంతే జాగ్రత్తపడాలట. ఎండలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే అది ఇంకా వేడెక్కిపోతుంది. కాబట్టి సూర్యకాంతి మొబైల్‌పై నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


ఛార్జర్‌ విషయంలోనూ (Certified Chargers): వాడే ఛార్జర్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జర్‌ పాడైందని మార్కెట్లో ఏది పడితే అది కొనొద్దని చెబుతున్నారు. కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. ఒకవేళ కంపెనీ ఛార్జర్లు పాడైతే అదే కంపెనీకి చెందిన ఒరిజినల్‌ ఛార్జర్లను మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.


పగిలిన స్మార్ట్‌ఫోన్‌తో జాగ్రత్త (Damaged Phones): అనుకోకుండా ఫోన్‌ పగిలినా, చిన్న డ్యామేజ్‌ అయినా... రిపేర్‌ చేయించకుండా కొందరు అలానే వాడేస్తుంటారు. అది ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. డ్యామేజ్‌ అయిన స్మార్ట్‌ఫోన్లు వేగంగా వేడెక్కి, పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వీలైనంత త్వరగా రిపేర్‌ చేయించుకున్నాకే వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


 

అతిగా ఛార్జ్‌ చేస్తున్నారా? (overcharge): చాలా మంది నిద్రపోయే ముందు ఫోన్‌ ఛార్జింగ్‌ పెటడుతుంటారు. రాత్రంతా ఛార్జ్‌ పెట్టి, ఉదయాన్నే లేచాక తీసేస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గంటలు గంటలు ఫోన్‌ ఛార్జ్‌ పెడితే ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి బ్యాటరీ 90 నుంచి 100 లోపు ఛార్జ్‌ అయ్యాక తీసేయాలి. తాజాగా వచ్చే స్మార్ట్‌ఫోన్లలో ఆటోమేటిక్‌ పవర్‌ సప్లయ్‌ ఫీచర్‌ ఉంటుంది. దాన్ని టర్న్‌ ఆన్‌ చేసుకుంటే సరి. నిర్దేశించిన ఛార్జింగ్‌ తర్వాత ఆటోమేటిగ్గా ఛార్జింగ్‌ అగిపోతుంది.


టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి (Turn Off Location Services, Bluetooth): కొంతమంది బ్లూటూత్‌, లోకేషన్‌ సర్వీసెస్‌ వంటి ఫీచర్లు ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుతారు. స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ వాడకం పెరిగిపోవడంతో వీటిని టర్న్‌ ఆఫ్‌ చేయడమే మర్చిపోతున్నారు. అవసరం లేనపుడు ఈ ఆప్షన్లను టర్నాఫ్‌ చేయడమే మంచిదని చెబుతున్నారు. లేదంటే ఫోన్‌పై ఎక్కువ లోడ్‌ పడుతుందని.. బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.


స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ (Screen Brightness): స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ బ్రైట్‌నెస్ కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వీలైనంత వరకు దీన్ని తక్కువలో ఉంచడమే మంచిది. అయితే, ఇప్పుడు వచ్చే స్మార్ట్‌ఫోన్లలో ఆటోమేటిక్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ మోడ్‌ను ఇస్తున్నారు. దీన్ని యాక్టివేట్‌ చేసుకుంటే సరిపోతుంది.


అనవసరపు యాప్‌లు... (Unused Apps): పై టిప్స్‌తోపాటు మొబైల్‌లో వాడని యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆ యాప్స్‌ను ఉపయోగించకపోయినా బ్యాగ్రౌండ్‌లో రన్‌ అవుతూ ఉంటాయి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి వీటిని వెంటనే డిలీట్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌పై లోడ్ తగ్గడమే కాకుండా ఫోన్‌ స్పేస్ కూడా ఆదా అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని