MWC 2022: 9 నిమిషాల్లోనే మొబైల్‌ బ్యాటరీ ఫుల్.. స్నాప్‌డ్రాగన్‌తో ల్యాపీ.. ఇంకా..!

MWC-2022లో దిగ్గజ కంపెనీలు వాటి కొత్త ఉత్పత్తులను ప్రదర్శించాయి. వాటిలో టెక్‌ ప్రియులను అమితంగా ఆకర్షించిన గ్యాడ్జెట్లు ఏంటో ఓసారి చూద్దాం..

Updated : 05 Mar 2022 13:27 IST

9 నిమిషాల్లో మొబైల్‌ బ్యాటరీ ఫుల్‌.. ఒకే మోడల్‌ ఫోన్‌లో వైర్‌లెస్‌, వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ.. స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్.. ఇలా అత్యాధునిక సాంకేతిక, గ్యాడ్జెట్ల ప్రదర్శనతో మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC-2022) ముగిసింది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు ఈ సదస్సు జరిగింది. ఈ వేదికలో దిగ్గజ కంపెనీలు వాటి కొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టగా.. టెక్‌ ప్రియులను అమితంగా ఆకర్షించిన గ్యాడ్జెట్లు ఏంటో ఓ లుక్కేద్దాం..  

ఇది మరో సంచలనం..

స్మార్ట్‌ మొబైల్స్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీకి సంబంధించి ఇది మరో సంచలనం. 4,500mAh బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్‌ చేయగల 240W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఎండబ్ల్యూసీ-2022 సదస్సులో దిగ్గజ కంపెనీ ఒప్పొ (OPPO) ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి సరిపడా మొబైల్స్‌ ఏవీ మార్కెట్‌లో అందుబాటులో లేవు. అయితే, సేఫ్టీ స్టాండర్డ్స్‌ పరీక్షించిన తర్వాత భవిష్యత్‌ తరం మోడల్స్‌లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. 

మరోవైపు 150W సూపర్‌వూక్‌ (SuperVOOC) ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని కూడా ఒప్పొ ఈ వేడుకలో ప్రదర్శించింది. ఇది 4,500mAh బ్యాటరీని 5 నిమిషాల్లో 50 శాతం, 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్‌ చేయగలదు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో పొలిస్తే ఇది వేగవంతమైందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ హెల్త్‌ ఇంజిన్‌ పేరిట తీసుకొచ్చిన ఈ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ను ఒప్పొ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.


లెనోవా థింక్‌ప్యాడ్‌ X13s

ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికొస్తే లెనోవా (Lenovo) కంపెనీకి చెందిన కొత్త ‘థింక్‌ప్యాడ్‌ X13s’ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ARM చిప్‌లతో మునుపటి థింక్‌ప్యాడ్‌ల కంటే ఇది మరింత వేగవంతంగా పనిచేయగలదని కంపెనీ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌-3, 5జీ కనెక్టివిటీ, 28 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇది పనిచేస్తుంది. ధరను బట్టి వివిధ రకాల ర్యామ్‌ స్టోరేజీలతో ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.  

అలాగే మునుపటి తరానికి భిన్నంగా శాంసంగ్‌ కంపెనీ ‘గెలాక్సీ బుక్‌ 2 ప్రో (Galaxy Book 2 Pro)’ను ఈ సదస్సులో పరిచయం చేసింది. 13-అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో రెండు పౌండ్ల కంటే తక్కువ బరువుతో ఇది వస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని ఫీచర్లు వెల్లడి కావాల్సి ఉంది. 


బ్యాటరీతో పాటే మొబైల్‌

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో పాటే ప్రముఖ టెక్‌ దిగ్గజం ఒప్పొ (OPPO) ఈ వేడుకలో ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో ఓ కొత్త మొబైల్‌ను ఆవిష్కరించింది. మొత్తం రెండు వేరియంట్లలో (OPPO Find X5, Find X5 Pro) ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ‘ఒప్పొ ఫైండ్‌ x5 ప్రో’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అధిక రిఫ్రెష్‌ రేట్‌ గల అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ఒక్క వేరియంట్‌లోనే 80W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలు ఉండటం విశేషం. ఈ మేరకు అందుబాటులో ఉన్న ఏ ఛార్జర్‌తోనైనా మొబైల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. 5,000mAh బ్యాటరీ, వెనకాల ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ (50MP ప్రైమరీ, 50MP అల్ట్రా-వైడ్, 13MP టెలిఫోటో), ముందు 32MP సెల్ఫీ షూటర్‌లు దీనిలో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు.


రియల్‌మీ జీటీ 2 ప్రో

ఎండబ్ల్యూసీ-2022 సదస్సులో చైనా కంపెనీ రియల్‌ మీ (Realme) కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ కంపెనీ జీటీ సిరీస్‌లో మరో రెండు మోడల్స్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో పేరుతో వీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో రియల్‌మీ జీటీ 2 ప్రో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1, 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 5,000mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. ఇది కూడా ఒప్పొ x5 ప్రో మాదిరి హై ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో రానుంది. అయితే, ఈ రెండు వేరియంట్ల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ప్రో స్టీరియో స్పీకర్లు, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వైఫై 6 సపోర్ట్ వంటి ఇతర ఫీచర్‌లు రియల్‌మీ జీటీ2 ప్రో ఉండనున్నాయి.


మ్యాజిక్‌ సిరీస్‌లో రెండు

ఎండబ్ల్యూసీ వేదికగా ఆనర్ ‌(Honor) కంపెనీ మ్యాజిక్‌ సిరీస్‌లో మరో రెండు మోడళ్లను ఆవిష్కరించింది. ఆనర్‌ మ్యాజిక్‌ 4, మ్యాజిక్‌ 4 ప్రో పేరిట తీసుకొచ్చిన ఈ రెండింటిలోనూ స్పెసిఫికేషన్స్‌ దాదాపు ఒకేలా ఉన్నాయి. గరిష్ఠంగా 12GB ర్యామ్‌/512GB స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ ప్రాసెసర్‌, వెనకవైపు 50MP వైడ్‌, 50MP అల్ట్రా, 64MP పెరిస్కోప్‌ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 12MP లెన్స్‌తో 3డీ డెప్త్‌ సెన్సార్‌ ఉంది. బ్యాటరీ విషయానికొస్తే మ్యాజిక్‌-4లో 4,800 mAh బ్యాటరీ ఉండగా, ఆనర్‌ మ్యాజిక్‌ 4ప్రోలో 4,600 mAh బ్యాటరీ సదుపాయం ఉంది.


 పోకో ఎక్స్‌ సిరీస్‌లో మరొకటి

పోకో కంపెనీ తన ఎక్స్‌ సిరీస్‌లో POCO X4 Pro మోడల్‌ను పరిచయం చేసింది. ఇది 120 హెర్జ్‌ 6.67 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 5,000 mAh బ్యాటరీకి 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ వస్తుంది. వెనకవైపు 108MP, 8MP, 2MP కెమెరాలు.. ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 8GB ర్యామ్‌/256GB, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IR బ్లాస్టర్ మరిన్ని ప్రత్యేకతలు. కాగా, ఎండబ్ల్యూసీ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ మొబైల్స్‌ అన్ని 5జీ సపోర్ట్‌తో వస్తున్నాయి. భారత్‌లో వీటి విడుదల తేదీలు, ధరలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. 

ఇంటర్నెట్ డెస్క్



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని