విండోస్‌లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌

విండోస్‌ 11 పీసీలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ వాడకం. ఆండ్రాయిడ్‌ అభిమానులు దీని కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నిజానికి విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను విడుదల చేసినప్పుడే మైక్రోసాఫ్ట్‌ సంస్థ మున్ముందు పీసీలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను తేలికగా ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పింది.

Published : 23 Feb 2022 01:21 IST

విండోస్‌ 11 పీసీలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ వాడకం. ఆండ్రాయిడ్‌ అభిమానులు దీని కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నిజానికి విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను విడుదల చేసినప్పుడే మైక్రోసాఫ్ట్‌ సంస్థ మున్ముందు పీసీలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను తేలికగా ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఆ తరుణం రానే వచ్చింది. వెయ్యికి పైగా ఆండ్రాయిడ్‌ యాప్స్‌ సిద్ధంగా ఉన్నట్టు మైక్రోసాఫ్ట్‌ ఇటీవల ప్రకటించింది. వీటిల్లో గేమ్స్‌ దగ్గర్నుంచి రీడింగ్‌ యాప్స్‌ వరకు రకరకాలున్నాయి. అయితే వీటిని ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవటం కుదరదు. మరి విండోస్‌ 11 పీసీలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటమెలా?

ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి ముందు పీసీలో విండోస్‌ 11 తాజా వర్షన్‌ ఇన్‌స్టాల్‌ అయ్యిందో లేదో చూసుకోవాలి. అలాగే మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ కూడా అప్‌డేట్‌ అయ్యిండాలి. ఒకవేళ అప్‌డేట్‌ కాకపోయి ఉంటే మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి లైబ్రరీలోకి వెళ్లి గెట్‌ అప్‌డేట్స్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

* మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌లో నేరుగా ఆండ్రాయిడ్స్‌ యాప్స్‌ అందుబాటులో ఉండవు. కాబట్టి విడిగా విండోస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టార్ట్‌ బటన్‌ను నొక్కి మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ను సెర్చ్‌ చేసి, దాని మీద క్లిక్‌ చేయాలి. స్టోర్‌లో సెర్చ్‌బార్‌ను క్లిక్‌ చేసి ‘అమెజాన్‌ యాప్‌స్టోర్‌’ అని టైప్‌ చేయాలి. అమెజాన్‌ యాప్‌స్టోర్‌ కనిపించగానే దానిపై క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ ప్రక్రియను ఆరంభించాలి. (ఈ సమయంలో బయాస్‌లో వర్చువలైజేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలని సిస్టమ్‌ అడగొచ్చు. ఇది విండోస్‌ 11 పీసీలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ రన్‌ అయ్యేలా చేస్తుంది.)

* అమెజాన్‌ యాప్‌స్టోర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో ‘విండోస్‌ సబ్‌సిస్టమ్‌ ఫర్‌ ఆండ్రాయిడ్‌’ అని పాపప్‌ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవటం తప్పనిసరి. సిస్టమ్‌లో ఇది చేసే మార్పులకు అంగీకరిస్తూ ‘ఎస్‌’ బటన్‌ను నొక్కాలి.

* డౌన్‌లోడ్‌ పూర్తయ్యాక పాపప్‌లో ‘ఓపెన్‌ అమెజాన్‌ యాప్‌స్టోర్‌’ను క్లిక్‌ చేయాలి. తర్వాత అమెజాన్‌ అకౌంట్‌తో దీనిలో సైన్‌ ఇన్‌ కావాలి. దీంతో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ కోసం పీసీ సిద్ధం అవుతుంది. ఈ ప్రక్రియను ఒకసారి చేస్తే చాలు. మాటిమాటికీ ఇంత తతంగం అవసరం లేదు.

* తర్వాత అమెజాన్‌ యాప్‌స్టోర్‌ను ఓపెన్‌ చేసి కావాల్సిన యాప్‌ను ఎంచుకొని ‘గెట్‌’ బటన్‌ను నొక్కాలి. అంతే యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. అనంతరం యాప్‌ మీద క్లిక్‌ చేసి ఉపయోగించుకోవచ్చు. చాలా యాప్స్‌ పీసీ కంట్రోళ్లకు అనుగుణంగానే ఉంటాయి. టచ్‌ కంట్రోళ్లకు బదులు కీబోర్డు కీస్‌తోనే వీటిని వాడుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని