సాలీడు పట్టు!

సాలె గూడు చాలా దృఢంగా ఉంటుంది. బరువు పరంగా చూస్తే స్టీలు కన్నా గట్టిగానూ ఉంటుంది! అత్యంత దృఢమైన సహజ పట్టు రకాల్లో సాలీడు ఉత్పత్తి చేసే పట్టుకే అగ్రస్థానం దక్కుతుంది.

Published : 27 Sep 2023 00:34 IST

సాలె గూడు చాలా దృఢంగా ఉంటుంది. బరువు పరంగా చూస్తే స్టీలు కన్నా గట్టిగానూ ఉంటుంది! అత్యంత దృఢమైన సహజ పట్టు రకాల్లో సాలీడు ఉత్పత్తి చేసే పట్టుకే అగ్రస్థానం దక్కుతుంది. అందుకే దీన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, వయోలిన్‌ తీగలు, గాయాల పట్టీలు, ఆప్టికల్‌ ఫైబర్ల వంటి వాటి తయారీకి వాడుతుంటారు. అయితే వాణిజ్యపరంగా పెద్దఎత్తున సాలీడు పట్టు ఉత్పత్తి సాధ్యం కావటం లేదు. సాలీళ్లను పెంచటానికి చాలా ప్రాంతం కావాలి. పైగా ఇవి ఒకదాని మీద మరోటి దాడి చేసి, చంపుతాయి. ఇవి చనిపోకుండా కలిపి  ఒకదగ్గర పెంచటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో చైనాలోని డాంగువా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం మంచి పరిష్కారం చూపుతోంది. తొలిసారిగా పూర్తిస్థాయి సాలీడు పట్టు దారాలను సృష్టించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు మరి. పట్టు పురుగులను జన్యుపరంగా మార్చి దీన్ని సాధించారు. చాలా గట్టిగా, దృఢంగా ఉండే ఇది నైలాన్‌ వంటి కృత్రిమ దారాలకు ప్రత్యామ్నాయం కాగలదని భావిస్తున్నారు. పట్టు పురుగుల నుంచి పట్టును తీసే ప్రక్రియ బాగా స్థిరపడింది, విరివిగా వాడుతున్నారు. అందువల్ల జన్యుపరంగా మార్చిన పట్టు పురుగులతో చవకగా, పెద్దఎత్తున సాలీడు పట్టును తయారు చేయొచ్చని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ముందుగా అరేనియస్‌ వెంట్రికోసస్‌ అనే సాలీడు నుంచి మిస్ప్‌ అనే చిన్న పట్టు ప్రొటీన్‌ను తీశారు. దీన్ని క్రిస్ప్‌ఆర్‌-కాస్‌9 అనే జన్యు సవరణ పద్ధతితో మార్చి పట్టు పురుగు డీఎన్‌ఏలో జొప్పించారు. ఇది పట్టు పురుగులో సహజ పట్టు ఉత్పత్తి ప్రక్రియ వంటి వాటిల్లో ఎలాంటి జోక్యం చేసుకోకుండా డీఎన్‌ఏను ప్రేరేపితం చేయటం విశేషం. వీటి ద్వారా పుట్టుకొచ్చిన సాలీడు పట్టు బలంగా, దృఢంగానే కాదు.. మృదువుగా, సాగేలా ఉండటం గమనార్హం. బలంగా అదే సమయంలో సాగే సాలీడు దారాలను తయారుచేయాలని శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలకు దీంతో పరిష్కారం లభించింది. ఈ పట్టును శస్త్రచికిత్స చేసేటప్పుడు వేసే కుట్లకు వినియోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్లకు పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నందున ఇదెంతగానో మేలు చేయగలదని ఆశిస్తున్నారు. అంతేకాదు.. సైనిక అవసరాలు, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, దుస్తుల తయారీకీ ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లలో వాడే ఒకరకం సాలీడు దారాలతో పోలిస్తే తాజా పట్టు 6 రెట్లు ఎక్కువ దృఢంగా ఉంటుంది! ఇప్పుడు సహజ, కృత్రిమ అమైనో ఆమ్లాల నుంచి సాలీడు పట్టును ఉత్పత్తి చేసేలా పట్టు పురుగులను జన్యుపరంగా మార్చటానికీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని