సామాజికం భద్రంగా..

ప్రస్తుతం వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల యాప్‌లు అనుబంధాలకు, స్నేహాలకు పర్యాయపదంగా మారాయి. ఫొటోలైనా, వీడియోలైనా.. వ్యాఖ్యలైనా, వ్యాఖ్యానాలైనా అన్నీ వీటితోనే పంచుకోవటం. అయితే సామాజిక మాధ్యమాల యాప్‌లు ఏవైనా పూర్తి సురక్షితం కాదు.

Updated : 13 Jul 2022 15:55 IST

ప్రస్తుతం వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల యాప్‌లు అనుబంధాలకు, స్నేహాలకు పర్యాయపదంగా మారాయి. ఫొటోలైనా, వీడియోలైనా.. వ్యాఖ్యలైనా, వ్యాఖ్యానాలైనా అన్నీ వీటితోనే పంచుకోవటం. అయితే సామాజిక మాధ్యమాల యాప్‌లు ఏవైనా పూర్తి సురక్షితం కాదు. అందువల్ల సెటింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా ఆన్‌లైన్‌ భద్రతను పెంచుకోవటం మీద దృష్టి సారించాలి.


వాట్సప్‌లో..

* ముందుగా చేయాల్సింది హానికర అంశాల జోలికి వెళ్లకపోవటం. తెలిసో తెలియకో చాలామంది విశ్వసనీయం కాని వెబ్‌సైట్లను ఫార్వర్డ్‌ చేస్తుంటారు. ఇవి ‘ఫార్వర్డెడ్‌ యాజ్‌ రిసీవ్డ్‌’ నోట్‌తో కనిపిస్తుంటాయి. ఆయా సైట్ల విశ్వసనీయతను తెలుసుకోకుండా స్నేహితులు పంపించే ఇలాంటి లింకులను, అటాచ్‌మెంట్లను క్లిక్‌ చేయొద్దు.

* ఫొటోల ద్వారా మాల్వేర్‌లు వ్యాపించే ప్రమాదముంది. కాబట్టి ఇతరులు పంపించే ఫొటోలు వాటంతటవే ఫోన్‌ గ్యాలరీలో సేవ్‌ అయ్యే ఆప్షన్‌ను డిసేబుల్‌ చేసుకోవాలి.

* రెండు అంచెల ధ్రువీకరణకు పిన్‌ను సెట్‌ చేసుకోవాలి. అలాగే బ్యాకప్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఐక్లౌడ్‌లో గానీ గూగుల్‌ డ్రైవ్‌లో గానీ ఒకసారి ఛాట్‌ బ్యాకప్‌ అయితే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత కొరవడుతుంది.


టెలిగ్రామ్‌లో..

* టెలిగ్రామ్‌ యాప్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యాక ఫోన్‌ నంబరును అడుగుతుంది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా ధ్రువీకరణ మెసేజ్‌ పంపుతుంది. కాబట్టి మోసగాళ్ల చేతికి ఫోన్‌ నంబరు చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఎడమవైపు పైన కనిపించే మూడు గీతల ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో పాస్‌కోడ్‌ను సృష్టించుకోవాలి. టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను ఆన్‌ చేసుకోవాలి.

* లాస్ట్‌ సీన్‌ అండ్‌ ఆన్‌లైన్‌, ఫ్రొఫైల్‌ ఫొటోస్‌ అండ్‌ వీడియోస్‌, ఫార్వర్డెడ్‌ మెసేజెస్‌, కాల్స్‌, గ్రూప్స్‌ అండ్‌ ఛానెల్స్‌ ఆప్షన్లు డిఫాల్ట్‌గా ఎవ్రీబడీగా ఎనేబుల్‌ అయ్యింటాయి. దీన్ని ‘మై కాంటాక్ట్స్‌’ లేదా ‘నోబడీ’గా మార్చుకోవాలి. ఇలా మన ఫోన్‌ నంబరు, ప్రొఫైల్‌ ఫొటోల వంటి వాటిని ఎవరెవరు చూడొచ్చనేది నిర్ణయించుకోవాలి.

* ఎక్కువకాలం ఎక్కడికైనా వెళ్తున్నట్టయితే ‘డిలిట్‌ మై అకౌంట్‌’ను సెట్‌ చేసుకోవాలి. బాట్స్‌ అండ్‌ వెబ్‌సైట్స్‌ కింద ఉండే క్లియర్‌ పేమెంట్‌ ఇన్ఫో, షిపింగ్‌ ఇన్ఫోను టర్న్‌ ఆన్‌ చేసుకోవాలి.


సిగ్నల్‌లో..

* రిజిస్ట్రేషన్‌ లాక్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. దీంతో ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా, హైజాక్‌ చేసినా ఛాట్‌ హిస్టరీని ఇతరులు చూడలేరు.

బయోమెట్రిక్‌ సెక్యూరిటీ లేదా పాస్‌కోడ్‌తో స్క్రీన్‌ లాక్‌ సెట్‌ చేసుకోవాలి. స్క్రీన్‌ లాక్‌ అయినప్పుడు మెసేజ్‌లు కనిపించకుండా ‘ప్రివ్యూస్‌’ను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

* ఫ్రొఫైల్‌ మీద ట్యాప్‌ చేసి, ప్రైవసీ ద్వారా స్క్రీన్‌ సెక్యూరిటీలోకి వెళ్లి ఎనేబుల్‌ చేసుకోవాలి. దీంతో సిగ్నల్‌ టెక్స్ట్‌ మీద సిగ్నల్‌ లోగోతో కూడిన నీలిరంగు ప్రైవసీ స్క్రీన్‌ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనైతే సిగ్నల్‌ను స్క్రీన్‌ షాట్‌ తీయకుండానూ కాపాడుతుంది.

* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో దీన్ని డిఫాల్ట్‌ ఎస్‌ఎంఎస్‌ యాప్‌గా పెట్టుకోవాలి. ఈ ఫీచర్‌ ఐఫోన్లకు అందుబాటులో లేదు. సిగ్నల్‌ వాడేవారి మధ్య మెసేజ్‌ల మాదిరిగా ఈ యాప్‌ ద్వారా పంపించిన ఎస్‌ఎంఎస్‌లు ఎన్‌క్రిప్ట్‌ కావు. కానీ యాప్‌ ఇతర ఫీచర్లు కాపాడతాయి.


ఫేస్‌బుక్‌లో..

* యాప్‌ను వాడకపోయినా ఫేస్‌బుక్‌ మనం చేసే పనులన్నింటినీ గమనిస్తుంది. ఇతర యాప్‌ల్లో ఏమేం చేస్తున్నామో చూడగలదు. కాబట్టి దీన్ని నివారించుకోవాలి. ఇందుకు ఫేస్‌బుక్‌ సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌ కింద ఉండే ‘ఆఫ్‌ ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’ మీద ట్యాప్‌ చేయాలి. వెంటనే హిస్టరీని క్లియర్‌ చేసుకోవాలి. తర్వాత మోర్‌ ఆప్షన్స్‌ మీద క్లిక్‌ చేసి ‘మేనేజ్‌ ఫ్యూచర్‌ యాక్టివిటీ’ని నొక్కాలి. ఆ తర్వాత విండోలో ‘మేనేజ్‌ ఫ్యూచర్‌ యాక్టివిటీ’ని మరోసారి క్లిక్‌ చేయాలి. ఆ పక్కన స్క్రీన్‌లో ‘ఫ్యూచర్‌ ఆఫ్‌-ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’ని టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని