యూట్యూబ్‌ నిపుణులు మీరే

సినిమాలైనా, పాటలైనా, హాస్యభరిత స్కిట్లకైనా.. అన్నింటికీ యూట్యూబే. వినోదానికే కాదు, విజ్ఞాన సముపార్జనకూ ఇదే ఆధునిక సాధనం.

Updated : 22 Nov 2023 03:34 IST

సినిమాలైనా, పాటలైనా, హాస్యభరిత స్కిట్లకైనా.. అన్నింటికీ యూట్యూబే. వినోదానికే కాదు, విజ్ఞాన సముపార్జనకూ ఇదే ఆధునిక సాధనం. ఉచిత కోర్సుల దగ్గరి నుంచి రోజువారీ పనుల్లో చిట్కాల వరకూ ఎన్నెన్నో వీడియోలు అందరినీ అలరిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం యూట్యూబ్‌ వీక్షించనివారు లేరన్నా అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా స్మార్ట్‌ టీవీల్లోనూ కాలక్షేపానికి ఎక్కువ మంది ఇష్టపడేది దీన్నే. టీవీలో మాదిరిగా కాకుండా వెనక్కీ ముందుక్కీ వీడియోను జరపొచ్చు. విసుగుపుడితే ప్లే లిస్టులో తర్వాతి వీడియో మీదికి లంఘించొచ్చు. సమయం లేదనుకుంటే వీడియో వేగాన్నీ పెంచుకోవచ్చు. కావాలంటే తగ్గించుకోనూ వచ్చు. డెస్క్‌టాప్‌ మీద యూట్యూబ్‌ను వీక్షిస్తున్నప్పుడు ఇలాంటి పనుల కోసం మాటిమాటికీ మౌజ్‌ను వాడటం కాస్త కష్టంగా అనిపించొచ్చు. ఇలాంటి సమయంలోనే కీబోర్డు షార్ట్‌కట్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. రి యూట్యూబ్‌ చూస్తున్నప్పుడు మధ్యలో ఫోన్‌ కాల్‌ వచ్చిందా? వెంటనే పాజ్‌ చేయాలనుకుంటే కే మీటను నొక్కితే చాలు. వీడియో ఆగుతుంది. మళ్లీ కే మీటను నొక్కితే మొదలవుతుంది. స్పేస్‌బార్‌తోనూ వీడియోను పాజ్‌, ప్లే చేయొచ్చు.

  •  వీడియో చూస్తుంటాం. కానీ చుట్టుపక్కల వారికి చప్పుడు ఇబ్బంది కలిగిస్తుండొచ్చు. ఇలాంటప్పుడు ఎం మీటను నొక్కితే మ్యూట్‌లోకి వెళ్తుంది. తిరిగి అదే మీటను నొక్కితే శబ్దం వినిపిస్తుంది.
  •  వరుసగా వీడియోలు చూస్తున్నప్పుడు తర్వాతి వీడియోకు వెళ్లాలంటే షిఫ్ట్‌, ఎన్‌ మీటలను కలిపి నొక్కితే సరి. ఇది ప్లేలిస్టులో తర్వాత వీడియోకు తీసుకెళ్తుంది. ఒకవేళ ప్లేలిస్టు లేదనుకోండి. సజెస్టెడ్‌ వీడియోల్లో తర్వాత వీడియో ప్లే అవుతుంది.
  •  వీడియో చూస్తున్నప్పుడు ఫార్వర్డ్‌ చేయాలనుకుంటే ఎల్‌ బటన్‌ నొక్కితే సరి. పది సెకండ్ల ముందుకు వెళ్తుంది. అదే వెనక్కి వెళ్లాలనుకోండి జే మీట నొక్కాలి.
  •  కొద్దిసేపట్లో ఎక్కువ వీడియోలను చూడాలనుకున్నప్పుడు ప్లేబ్యాక్‌ స్పీడ్‌ను పెంచాలని భావిస్తుంటాం. ఇందుకు గ్రేటర్‌దాన్‌ మీటను నొక్కితే చాలు. వేగం పెరుగుతుంది. అలాగే లెస్‌దాన్‌ మీటను నొక్కితే వేగం తగ్గుతుంది.
  •  వీడియోలో ఏదైనా భాగం చూడొద్దనుకుంటే స్కిప్‌ చేస్తాం కదా. దీని కోసం అంకెల మీటలను వాడుకోవచ్చు. వీడియో ప్లే అవుతున్నప్పుడు 1 నుంచి 9 అంకెల వరకు దేన్నయినా వాడుకోవచ్చు. ఇది 10% మేరకు వీడియోను స్కిప్‌ చేస్తుంది. ఉదాహరణకు- 1 అంకె మీట నొక్కితే 10% స్కిప్‌ అవుతుంది. అదే 80% వీడియో స్కిప్‌ కావాలంటే 8 నొక్కితే సరి. ఒకవేళ వీడియోను మొదటి నుంచీ చూడాలనుకుంటే 0 నొక్కి చూడండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని