ఆహారం వృథా కాకుండా..

నోటికి రుచించటం లేదనో, ఎక్కువైందనో అన్నాన్ని విడిచి పెడుతుంటాం. అవసరానికి మించి కొన్న కూరగాయలు, పండ్లు చెడిపోయాయని పారేస్తుంటాం.

Published : 18 May 2022 00:50 IST

నోటికి రుచించటం లేదనో, ఎక్కువైందనో అన్నాన్ని విడిచి పెడుతుంటాం. అవసరానికి మించి కొన్న కూరగాయలు, పండ్లు చెడిపోయాయని పారేస్తుంటాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత ఆహారం వృథా అవుతోంది. పండిస్తున్న ఆహార పదార్థాల్లో మూడింట ఒక వంతు చెత్తకుప్పల్లోకే చేరుకుంటోంది. ఇది ఆర్థికంగానే కాదు, పర్యావరణ పరంగానూ నష్టం కలిగిస్తుంది. ఒక కిలో ఆహార పదార్థాలను వృథా చేస్తే 4.5 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేసినట్టే. సుమారు రూ.442 చెత్తబుట్ట పాలయినట్టే. వృథా అయ్యే ఆహారాన్ని ఒక దేశంగా భావిస్తే- ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిండిన దేశం అదే అవుతుంది. అందుకే ఆహారం వృథా కాకుండా చూసుకోవటానికి ఓర్‌బిస్క్‌ అనే సంస్థ వినూత్న పరికరాన్ని రూపొందించింది. దీన్ని చెత్తబుట్ట మీద అమర్చితే చాలు. సెన్సర్‌ సాయంతో ఎలాంటి ఆహారాన్ని పారేస్తున్నారు? ఎంత పారేస్తున్నారు? ఎప్పుడెప్పుడు పారేస్తున్నారు? ఇలాంటి వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటుంది. డ్యాష్‌బోర్డు మీద ఎప్పటికప్పుడు చూపిస్తుంది. సమాచారాన్నంతా క్రోడీకరించి నిజంగా మనకు ఎంత ఆహారం అవసరమో లెక్కించి చెబుతుంది. చాలా మంచి ప్రయత్నం కదా. ఆహారాన్ని వృథా చెయ్యకపోతే ఆహారాన్ని పండించినట్టే మరి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని