Gmail: ఇకపై ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ సేవలు.. ఎలా పొందాలంటే?

ఇంటర్నెట్‌ అవసరం లేకుండా జీమెయిల్‌ సేవలు ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకునేలా గూగుల్ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Published : 28 Jun 2022 02:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖ్యమైన పనిమీద అర్జంటుగా బయటకు వెళుతున్నారు.. మొయిల్‌ ఇన్‌బాక్స్‌లో చెక్‌ చేయాల్సిన మెయిల్స్‌ చాలా ఉన్నాయి. వాటికి రిప్లై ఇచ్చే సమయం లేదు. అలాగని మీరు వెళ్లే చోట సరైన ఇంటర్నెట్‌ సదుపాయం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఇంటర్నెట్‌ అవసరం లేకుండా మెయిల్‌ యాక్సెస్‌ చేసుకునే వెసులుబాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ (Google) సంస్థ జీమెయిల్‌ (Gmail) యూజర్లు ఆఫ్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఇంటర్నెట్‌ అవసరంలేకుండా ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ ద్వారా మెయిల్ చదవడం, రిప్లై ఇవ్వడంతోపాటు జీమెయిల్‌ మెసేజ్‌లను కూడా చూడొచ్చు. దీంతో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాలతోపాటు, మారుమూల ప్రాంతాల్లోని వారికి జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సర్వీస్‌ గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో మాత్రమే పనిచేస్తుంది. అలానే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పనిచేయదు. మరి జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలు ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. 

ఎలా ఎనేబుల్ చేయాలంటే..? 

* జీమెయిల్‌ సేవలు ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకునేందుకు ఇంటర్నెట్‌ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడే mail.google.comను క్రోమ్‌ బ్రౌజర్‌లో బుక్‌ మార్క్‌ చేసుకోవాలి.

* తర్వాత జీమెయిల్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్‌లోకి వెళితే సీ ఆల్‌ సెట్టింగ్స్‌ (See All Settings) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో ఆఫ్‌లైన్‌ (Offline) ట్యాబ్‌పై క్లిక్ చేస్తే ఎనేబుల్ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ (Enable Offline Mail) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల క్రితం ఈ-మెయిల్స్‌ ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేయాలని అడుగుతుంది. వారం, నెల, 90 రోజుల ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌ సెలెక్ట్ చేసుకుని సేవ్‌ ఛేంజస్‌పై క్లిక్ చేసి జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. 

* కొంతమందికి జీమెయిల్ ఖాతా ఆఫ్‌లైన్‌ ఆప్షన్స్‌లో ఎనేబుల్ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ అనే ఆప్షన్‌ కనిపించకుండా ఎండ్‌ స్పేస్‌ అనే మెసేజ్‌ కనిపిస్తుంది. అంటే మీ గూగుల్ ఖాతాకు కేటాయించిన స్టోరేజ్‌ నిండిపోయిందని అర్థం. అలాంటి సందర్భాల్లో గూగుల్ ఖాతాలో అనవసరపు డేటాను డిలీట్ చేయడం మేలు. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో మెయిల్స్‌ను స్టోర్‌ చేసుకునేందుకు జీమెయిల్‌కు కొంత స్టోరేజ్‌ అవసరం ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని