ఫోన్ కెమెరాతో హార్ట్‌ రేట్ ట్రాకింగ్.. 

సాంకేతిక సాయంతో కరోనా రోగులను గుర్తించడం నుంచి అత్యవసర సేవలకు ప్రత్యేక యాప్‌లు, ఆన్‌లైన్ వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే గూగుల్‌ తన ఫిట్‌ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసకురానుంది. దీని ద్వారా యూజర్స్‌ తమ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సాయంతో...

Published : 05 Feb 2021 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య రంగంలో సాంకేతికత పాత్ర ఎంతో కీలకం. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ఇదే విషయం నిరూపితమైంది. సాంకేతికత సాయంతో కరోనా రోగులను గుర్తించడం నుంచి అత్యవసర సేవలకు ప్రత్యేక యాప్‌లు, ఆన్‌లైన్ వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించే స్మార్ట్ గ్యాడ్జెట్స్‌, మొబైల్‌ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నాయి టెక్ కంపెనీలు. ఈ క్రమంలోనే గూగుల్‌ తన ఫిట్‌ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా యూజర్స్‌ తమ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సాయంతో హార్ట్‌ రేట్‌, రెస్పిరేటరీ రేట్‌ (ఊపిరి వేగాన్ని)ను తెలుసుకోవచ్చు. 

స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సెన్సార్‌, కంప్యూటర్‌ విజన్‌ టెక్నిక్‌ సాయంతో ఇది‌ పనిచేస్తుంది. రెస్పిరేటరీ రేట్‌ తెలుసుకునేందుకు ఫోన్‌లో ఉండే సెల్ఫీ కెమెరా ముందు తల, ఛాతీ భాగం కనిపించేలా నిల్చోని ఊపిరి తీసుకోవాలి. అలానే హార్ట్‌రేట్ కోసం చేతి వేలుని ఫోన్ వెనక వైపు కెమెరాపై ఉంచాలి. తర్వాత వాటికి సంబంధించిన సమాచారం ఫోన్‌లో ఉన్న గూగుల్ ఫిట్ యాప్‌లో స్టోర్‌ అవుతుంది. ఇది పూర్తిగా వైద్య ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటి, పూర్తిస్థాయి వైద్యం కోసం వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చనేది కచ్చితంగా చెప్పలేమని గూగుల్ హెల్త్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ శ్వేతక్ పటేల్ తెలిపారు. అయితే యూజర్స్ తమ రోజువారీ జీవితంలో ఆరోగ్యపరంగా జరిగే మార్పులను ఈ ఫీచర్‌ సాయంతో ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు పాటించేందుకు ఉపయోగపడుతుందని పటేల్ అభిప్రాయపడ్డారు. ముందుగా దీన్ని పిక్సెల్‌ ఫోన్లలో గూగుల్‌ ఫిట్‌ యాప్‌లో పరిచయం చేస్తున్నారు. త్వరలోనే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆండ్రాయిడ్ ప్రైవసీ ఫీచర్

యాపిల్ తరహాలోనే గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ఓఎస్‌లో యాంటీ-ట్రాకింగ్ ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ మేరకు ప్లేస్టోర్‌లోని యాప్‌ డెవలపర్లు యూజర్‌ సమాచారాన్ని ట్రాక్‌ చేయాలంటే అనుమతి తప్పనిసరి. అలానే యాప్ డెవలపర్స్‌ యూజర్ డేటా ఏవిధంగా ట్రాక్‌ చేస్తున్నారనేది తెలియజేయాలి. దీని వల్ల యాజర్ నుంచి యాప్‌ డెవలపింగ్ కంపెనీలు ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయనేది తెలుస్తుంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ ఐఓఎస్‌ యూజర్స్‌ కోసం ఇదే తరహా ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తొలుత విముఖత వ్యక్తం చేసినప్పటికీ, తర్వాత అంగీకరించింది. యూజర్‌ నుంచి సేకరించిన డేటాతో యాప్‌ డెవలపర్స్‌, వాటి అనుబంధ సంస్థలు డిజిటల్‌ ప్రకటనలు విక్రయించేందుకు ఉపయోగిస్తుంటాయి. అయితే కొత్త ఫీచర్‌తో యూజర్స్‌ తమ డేటాను ట్రాక్‌ చేయాలా వద్దా అనేది ఎంచుకోవచ్చు. ఒక వేళ యూజర్‌ అనుమతించకపోతే యాప్‌ డెవలపర్స్‌ డేటాను ట్రాక్ చేయకూడదు. ఈ చర్య వల్ల తాము ఆదాయం కోల్పోతామని ఫేస్‌బుక్ సహా పలు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో యాప్‌ డెవలపర్స్‌ నష్టపోకుండా డిజిటల్‌ ప్రకటనలకు ప్రత్యేకంగా 100 బిలియన్‌ డాలర్ల సహాయం అందించాలని గూగుల్ భావిస్తోందట.  

ఇవీ చదవండి..

మీరు నడిస్తే... వీళ్లు డబ్బులిస్తారు

CES 2021: కరోనా స్పెషల్‌గా ఇవీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని