Smartphones Hacking:2021లో స్మార్ట్‌ఫోన్‌ కొన్నారా? జాగ్రత్త.. మీరూ హ్యాకింగ్‌కు గురికావచ్చు!

హ్యాకింగ్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా దీని గురించి పెద్ద చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఒకటి కొన్ని విస్తుపోయే అంశాలను వెల్లడించింది.

Updated : 11 May 2022 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ్యాకింగ్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా దీని గురించి పెద్ద చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఒకటి విస్తుపోయే అంశాలను వెల్లడించింది. 2011 నుంచి ఒక మాల్వేర్‌ కారణంగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు నివేదించింది. అంతేకాదు 2021లో కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్లు కూడా 2/3 వంతు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆడియో డీకోడర్‌ అనే బగ్‌ ద్వారా ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్లు హ్యాకింగ్‌ గురైనట్లు అధ్యయనం తెలిపింది.

మీడియాటెక్‌, క్వాల్‌కమ్‌ చిప్‌సెట్‌లలో ఏఎల్‌ఏసీ ఆడియో కోడింగ్‌ను వాడారు. ఇదే ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను హ్యాకింగ్‌ ప్రమాదంలో ముంచేస్తోంది. ఆడియో సంభాషణ ద్వారా మాల్‌వేర్‌ను పంపించి ఫోన్‌ను హ్యాక్‌ చేస్తున్నట్లు అధ్యయనం వివరించింది.

ఐఓఎస్‌లో..

యాపిల్‌ 2004లో డిజిటల్‌ మ్యూజిక్‌ కోసం యాపిల్‌ లాస్‌లెస్ ఇన్ఫర్మేషన్ కంప్రెషన్ (ALAC) ఆడియో కోడింగ్‌ ఫార్మాట్‌ను తొలిసారిగా అభివృద్ధి చేసింది. 2011 చివర్లో యాపిల్ దీన్ని ఓపెన్‌గా సప్లై చేసింది. అప్పటినుంచి ఏఎల్‌ఏసీ ఫార్మాట్‌ను నాన్‌ యాపిల్‌ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌, లైనెక్స్‌, విండోస్‌ మీడియా ప్లేయర్స్‌ల్లో ఉపయోగించారు.  ఆడియో కోడ్‌ను యాపిల్‌ అప్‌డేట్‌ చేస్తూ వస్తోంది. కానీ, షేర్‌ చేసిన కోడ్‌ మాత్రం అప్‌డేట్‌ అవ్వలేదు. దీంతో సైబర్‌ నేరగాళ్లు సులువుగా హ్యాక్‌ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగం ఫోన్లలో ఈ ఆడియో డికోడర్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

ఆండ్రాయిడ్‌లోనూ ప్రభావం..

మొబైల్స్‌లో రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌ (REC) చేసి ఫోన్‌ను హ్యాక్‌ చేయడానికి ఆడియో ఫైల్స్‌ను ఉపయోగించినట్లు నిపుణులు కనుగొన్నారు. ఆర్‌ఈసీ ద్వారా మాల్‌వేర్స్‌ను పంపించి ఫోన్‌లోని ఆర్థికపరమైన సమాచారంతోపాటు ఇతరత్రా డేటాను సైబర్‌ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుందని అధ్యయనం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని