WhatsApp: వీడియో కాల్స్‌ వయా డెస్క్‌టాప్‌.. వాట్సాప్‌ ఫీచర్‌ వచ్చేసింది!

వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యూజర్లు ఇక వీడియో కాల్స్‌ చేయాలంటే ఇతర యాప్‌ల వైపు చూడాల్సిన పనిలేదు. ఇన్నాళ్లు మొబైల్‌ వెర్షన్‌కి మాత్రమే..

Published : 13 Feb 2022 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యూజర్లు ఇక వీడియో కాల్స్‌ చేయాలంటే ఇతర యాప్‌ల వైపు చూడాల్సిన పనిలేదు. ఇన్నాళ్లూ మొబైల్‌ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్‌ కాల్‌ ఫీచర్లను ఇప్పుడు డెస్క్‌టాప్‌ యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఎంపిక చేసిన పలువురు యాజర్లకు మాత్రమే (బీటా) ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. అతిత్వరలో పూర్తిస్థాయిలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను మెటా పరిచయం చేయనుంది. పలువురు బీటా యూజర్లు షేర్‌ చేసిన స్క్రీట్‌ షాట్‌ ప్రకారం.. డెస్క్‌టాప్‌ చాట్‌ విండోలో సెర్చ్‌ ఫీచర్‌కు పక్కనే వీడియో, వాయిస్‌ కాల్‌ ఫీచర్‌ ఉంది. 

మరోవైపు ఆండ్రాయిడ్‌ యూజర్లను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత, గ్రూప్‌ కాల్స్‌ కోసం కొత్త ఇంటర్‌ఫేస్‌ డిజైన్‌ను వాట్సాప్‌కు తీసుకురానుంది. త్వరలో ఈ ఫీచర్‌ అందరికి అందుబాటులో రానున్నట్లు సమాచారం. అలాగే రాబోయే అప్‌డేట్‌లో ‘కమ్యూనిటీ’ ఫీచర్‌ను వాట్సాప్‌ విడుదల చేసే అవకాశం ఉంది. వాట్సాప్ కమ్యూనిటీ అనేది గ్రూప్ చాట్ లాంటిదే. కమ్యూనిటీలో ఇతర గ్రూప్‌లను లింక్‌ చేసుకోవచ్చని వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. అయితే, గరిష్టంగా 10 గ్రూప్‌లను మాత్రమే లింక్‌ చేసుకునే వీలుంటుందట. 

కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉన్నవాళ్లు కమ్యూనిటీలో ఉన్న అన్ని గ్రూప్స్‌లోకి కూడా మెసేజ్‌లు పంపొచ్చు. గ్రూప్స్‌లోలానే కమ్యూనిటీ అడ్మిన్‌లు ఇతరులను ఇన్వైట్‌ లింక్‌, క్యూఆర్‌ కోడ్ లేదా మాన్యువల్‌గా కమ్యూనిటీలలోకి ఆహ్వానించవచ్చు. అయితే, కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్‌లకు మెసేజ్‌ పంపలేరు. కమ్యూనిటీ సభ్యులకు ఇతర సభ్యులతో సంభాషించాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీ అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటే వాట్సాప్‌ ఆడియో ప్రివ్యూ, డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌కు కొత్త టైమ్‌ లిమిట్‌, నోటిఫికేషన్‌లో డీపీ, ఐపాడ్‌ యాప్‌ వంటి ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని