WhatsApp Update: వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌లో ఆరు కొత్త ఫీచర్లు.. మీరు వాడారా?

వాట్సాప్ వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌లో ఆరు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో వాయిస్‌ మెసేజ్‌ వినియోగం మరింత సరళతరమవుతుందని వాట్సాప్ తెలిపింది. 

Updated : 12 Apr 2022 16:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌లో ఆరు కొత్త అప్‌డేట్లను యూజర్లకు పరిచయం చేసింది. వాట్సాప్‌ యూజర్లలో వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌ ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోందని.. కొత్తగా తీసుకొచ్చిన అప్‌డేట్స్‌ ద్వారా యూజర్స్‌ వాయిస్‌ మెసేజ్‌ వినియోగం మరింత మెరుగవడంతోపాటు, సరళతరం అవుతుందని వాట్సాప్‌ తెలిపింది.

వాయిస్ మెసేజ్‌ కొత్త ఫీచర్ల జాబితాలో అవుట్‌ ఆఫ్ చాట్ ప్లేబ్యాక్ (Out of Chat Playback)‌, పాజ్ అండ్ రెజ్యూమ్‌ రికార్డింగ్ (Pause and Resume Recording)‌, వేవ్‌ఫామ్‌ విజువలైజేషన్ (Waveform Visualization)‌, డ్రాఫ్ట్ ప్రివ్యూ (Draft Preview), రిమెంబర్‌ ప్లేబ్యాక్ (Remember Playback)‌, ఫాస్ట్‌ ప్లేబ్యాక్‌ ఆన్‌ ఫార్వార్డ్‌ మెసేజెస్‌ (Fast Playback on Forward Messages)లు ఉన్నాయి. ఈ ఫీచర్లు వాయిస్ మెసేజ్‌లో ఎలా పనిచేస్తాయి? వీటితో యూజర్స్‌కు ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం. 

అవుట్‌ ఆఫ్ చాట్ ప్లేబ్యాక్ (Out of Chat Playback)

ఈ ఫీచర్‌తో యూజర్స్‌ చాట్ చేస్తూనే వాయిస్‌ మెసేజ్‌లు వినొచ్చు. గతంలో ఒక చాట్ పేజ్‌లో వాయిస్‌ మెసేజ్‌ వింటూ మరో చాట్ పేజ్‌ ఓపెన్‌ చేస్తే సదరు వాయిస్‌ మెసేజ్‌ ఆగిపోయేది. అవుట్‌ ఆఫ్‌ చాట్ ప్లేబ్యాక్‌ ఫీచర్‌తో ఇతరులు పంపిన వాయిస్‌ మెసేజ్‌లు వింటూ మరొకరితో చాట్ చేయొచ్చు.  

పాజ్ అండ్ రెజ్యూమ్‌ రికార్డింగ్ (Pause and Resume Recording)

వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ రికార్డ్ చేస్తున్నారు.. ఇంతలో ఏదో గుర్తొచ్చి మధ్యలో రికార్డింగ్‌ ఆపి తిరిగి రికార్డ్ చేద్దామంటే అసంపూర్తిగా ఉన్న మెసేజ్‌ వెళ్లిపోతుంది. ఇది గతం.. వాట్సాప్‌ కొత్తగా పరిచయం చేసిన ఫీచర్‌తో వాయిస్‌ మెసేజ్‌ రికార్డ్ చేస్తూ మధ్యలో పాజ్‌ చేసి తిరిగి మెసేజ్‌ రికార్డింగ్ ప్రారంభించవచ్చు. 

వేవ్‌ఫామ్‌ విజువలైజేషన్ (Waveform Visualization)

మెసేజ్‌లోని వాయిస్‌ ఆధారంగా ఫోన్‌ స్క్రీన్‌ మీద యూజర్‌కు ఆడియో వేవ్‌ కనిపిస్తుంది. దాంతో ఆడియో మెసేజ్‌లో ఎక్కడ వాయిస్‌ ఉందనేది యూజర్‌కు తెలుస్తుంది. దానివల్ల మెసేజ్‌ రికార్డింగ్‌ను యూజర్‌ సులువుగా అనుసరించవచ్చు. 

డ్రాఫ్ట్ ప్రివ్యూ (Draft Preview)

ఈ ఫీచర్‌తో యూజర్‌ ఆడియో మెసేజ్‌ రికార్డ్ చేసిన తర్వాత ఇతరులకు పంపేముందే దాన్ని వినవచ్చు. ఒకవేళ రికార్డు చేసిన మెసేజ్‌లో ఏవైనా తప్పులుంటే దాన్ని డిలీట్ చేసి తిరిగి కొత్త మెసేజ్‌ను రికార్డు చేసి పంపొచ్చు. 

రిమెంబర్‌ ప్లేబ్యాక్ (Remember Playback)

వాయిస్‌ మెసేజ్‌ వినేటప్పుడు ఏదైనా పనుండి మెసేజ్‌ను పాజ్‌ చేసి తిరిగి ప్లే చేస్తే, మళ్లీ మొదటి నుంచి వినాల్సిందే. రిమెంబర్‌ ప్లేబ్యాక్‌ ఫీచర్‌తో ఆడియో మెసేజ్‌ను ప్లే చేసి, పాజ్‌ చేసి, తిరిగి ప్లే చేసినప్పుడు ఆడియో ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుంచి ప్లే అవుతుంది. దీంతో యూజర్‌ సమయం ఆదా అవుతుంది. 

ఫాస్ట్‌ ప్లేబ్యాక్‌ ఆన్‌ ఫార్వార్డ్‌ మెసేజెస్‌ (Fast Playback on Forward Messages)

ఆడియో మెసేజ్‌లు వేగంగా వినేందుకు వీలుగా కొత్త ఫార్వార్డ్‌ మెసేజ్‌ టైమ్‌లను వాట్సాప్ పరిచయం చేసింది. గతంలో 1X స్పీడ్‌ ఉండేది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా 1.5X, 2X స్పీడ్‌లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్‌ సాధారణ మెసేజ్‌లతోపాటు, ఫార్వాడెడ్‌ మెసేజ్‌లలో కూడా పనిచేస్తుంది. దీంతో యూజర్స్‌ తమకు నచ్చిన స్పీడ్‌తో వాయిస్‌ మెసేజ్‌లు వినవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని