నేటి నుంచే సభా సమరం

పార్లమెంటు వేదికగా అధికార, విపక్ష పార్టీల మధ్య రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది! శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పెగాసస్‌,

Published : 29 Nov 2021 04:56 IST

 పార్లమెంటు శీతాకాల సమావేశాలు

మద్దతుధర, నిరుద్యోగంపై విపక్షాల వ్యూహాలు

దీటుగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వ సన్నాహాలు

టీజర్‌ను తలపించిన అఖిలపక్ష భేటీ

దిల్లీ: పార్లమెంటు వేదికగా అధికార, విపక్ష పార్టీల మధ్య రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది! శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పెగాసస్‌, చైనా చొరబాట్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తుండగా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టడమే లక్ష్యంగా పాలకపక్షం ప్రతివ్యూహాలు రచిస్తోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లు.. సమావేశాల తొలిరోజే లోక్‌సభకు రానుంది. సోమవారం తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలంటూ అధికార భాజపా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌ జారీచేశాయి. మరోవైపు- శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. దేశంలో రైతుల దుస్థితికి సంబంధించి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని తాజా సమావేశాల్లో ఆ పార్టీ ప్రధానంగా డిమాండ్‌ చేయనుంది. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టనున్నారు. వచ్చేనెల 23 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

* ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ.. శీతాకాల సమావేశాలకు టీజర్‌లా కనిపించింది! ఎంఎస్‌పీపై చట్టం తీసుకురావాలని, పెగాసస్‌ గూఢచర్యం, ఇంధన ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని, సాగుచట్టాలపై నిరసనల సమయంలో మృత్యువాతపడ్డ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. భేటీకి ప్రధాని గైర్హాజరవడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. సాగుచట్టాలను ప్రభుత్వం ప్రస్తుతానికి రద్దుచేసి మరేదైనా రూపంలో తీసుకొస్తుందేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని హాజరయ్యే సంప్రదాయమేదీ లేదని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని తృణమూల్‌ కాంగ్రెస్‌, వైకాపా, డీఎంకే తదితర పార్టీలు డిమాండ్‌ చేశాయి.

* పార్లమెంటు కార్యకలాపాల కవరేజీకి సంబంధించి కొవిడ్‌ నేపథ్యంలో మీడియాపై విధించిన ఆంక్షలను సడలించాలని, డిప్యూటీ స్పీకర్‌ నియామకం చేపట్టాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌రంజన్‌ చౌధరీ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

* శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమై రావాలని తమ ఎంపీలకు ఆదివారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని