Forest Land: ఆ 22 లక్షల ఎకరాల అటవీ భూములు ఎక్కడ?

రాష్ట్రంలో అటవీ ప్రాంతాల విస్తీర్ణం ఎంతన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 66.33 లక్షల ఎకరాలు.

Updated : 24 May 2024 05:17 IST

అటవీశాఖ రికార్డుల్లో 66.33 లక్షల ఎకరాలు
అందులో నోటిఫై చేసిన భూములు 65.12 లక్షలు
కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 43.05 లక్షలే
రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల మధ్య భారీగా అంతరం!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ ప్రాంతాల విస్తీర్ణం ఎంతన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 66.33 లక్షల ఎకరాలు. ఇందులో నోటిఫైడ్‌ అటవీ బ్లాక్‌లనే పరిగణనలోకి తీసుకుంటే ఆ విస్తీర్ణం 65.12 లక్షల ఎకరాలు. అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అటవీశాఖ పంపిన నివేదికలో మాత్రం ఆ విస్తీర్ణం 43.05 లక్షల ఎకరాలుగా ఉంది. మిగిలిన 22 లక్షల ఎకరాల అటవీ భూములు ఏమైపోయాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2,77,10,412 ఎకరాలు. అటవీ చట్టం ప్రకారం అందులో అటవీ ప్రాంతం 66,33,312 ఎకరాలు. అంటే రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో దాదాపు 24 శాతం అటవీ ప్రాంతమే. కేంద్ర అటవీశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ (ఐజీ)కి రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెడ్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ ఇటీవల పంపిన నివేదికలో జిల్లాలవారీగా అటవీ భూముల వివరాల్ని పొందుపరిచారు. అందులో మొత్తం అటవీ భూములు 43.05 లక్షల ఎకరాలుగా పేర్కొన్నారు. ఇవి రెవెన్యూశాఖ గుర్తించిన అటవీ భూములని, తెలంగాణ సీసీఎల్‌ఏ (చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) నుంచి తీసుకున్న వివరాలని తెలిపారు. టీఎన్‌ గోదావర్మన్‌ కేసుకు సంబంధించిన అంశంలో దేశంలో అటవీ భూములకు సంబంధించిన వివరాలను 2024 మార్చి 31కల్లా పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు అడవులుగా గుర్తించిన భూముల వివరాల్ని పంపాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్‌ అటవీ భూముల వివరాల్ని కేంద్ర అటవీశాఖకు పంపించారు. నోటిఫైడ్‌ ఫారెస్టు బ్లాక్‌లతో పాటు వివిధ కేటగిరీల కింద రెవెన్యూ రికార్డుల్లో నమోదైన అటవీ ప్రాంతాలని అందులో వివరించారు.

అటవీ చట్టం ప్రకారం మరో జాబితా..

తెలంగాణలో అటవీ భూములకు సంబంధించి మరో జాబితాను కూడా పీసీసీఎఫ్‌ పంపించారు. అటవీ చట్టం ప్రకారం గుర్తించిన భూములంటూ జిల్లాల వారీగా వివరాల్ని పొందుపరిచారు. అందులో వివిధ సెక్షన్ల కింద మూడు రకాల నోటిఫైడ్‌ అటవీ బ్లాకుల కింద భూములు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 65.12 లక్షల ఎకరాలు. అదేవిధంగా నోటిఫై చేయని అటవీ బ్లాక్‌లంటూ సుమారు 1.20 లక్షల ఎకరాల భూముల్ని పేర్కొన్నారు.

రెండు శాఖల రికార్డులు వేర్వేరు!

అటవీ భూములకు సంబంధించి అటు రెవెన్యూ, ఇటు అటవీ శాఖల రికార్డులు వేర్వేరుగా ఉన్నాయి. రెండింటి మధ్య నోటిఫైడ్‌ అటవీ బ్లాక్‌ల విస్తీర్ణం అంతరం 22 లక్షల ఎకరాలకు పైచిలుకు. నోటిఫై చేయనివి కూడా కలిపితే తేడా 23.28 లక్షల ఎకరాలు. రికార్డులు వేర్వేరుగా ఉండటం సమస్యగా మారింది. ఈ 23.28 లక్షల ఎకరాల భూమి ఎక్కడ ఉంది.. ఏ స్థితిలో ఉంది అన్నది తేలాల్సి ఉంది. నోటిఫైడ్‌ అటవీ బ్లాక్‌ల గణాంకాలను పరిశీలిస్తే.. 

  • ఆదిలాబాద్‌లో జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి విస్తీర్ణం 4,43,729.42 ఎకరాలు కాగా, రెవెన్యూశాఖ శాఖ రికార్డుల్లో 1,28,525 ఎకరాలే ఉంది. 
  • కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం 10,08,720.81 ఎకరాలు ఉండగా.. రెవెన్యూశాఖ గుర్తించిన అటవీభూమి 9,52,943 ఎకరాలు మాత్రమే.
  • కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి 4,92,674.50 ఎకరాలు కాగా.. రెవెన్యూ రికార్డుల్లో 4,09,587 ఎకరాలే ఉంది.
  • ములుగు జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి 7,18,940 ఎకరాలు కాగా.. రెవెన్యూ రికార్డుల్లో 4,42,094 ఎకరాలే ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని