Cyclone Gulab: తీరం దాటిన గులాబ్‌

గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

Updated : 27 Sep 2021 09:41 IST

రాష్ట్రంలో నేడు కుంభవృష్టి.. రేపు భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికలు
అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం
కలెక్టరేట్‌లలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటుకు సీఎస్‌ ఆదేశం

ఈనాడు-హైదరాబాద్‌, అమరావతి: గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది.  విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఎరుపు రంగు హెచ్చరికల జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను కారణంగా సోమవారం తెలంగాణలో అత్యంత భారీ కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. కుంభవృష్టి వర్షాలు పడతాయనే సూచనలుంటే ఎరుపు, భారీ వర్షాలైతే ఆరెంజ్‌, ఓ మోస్తరు వర్షాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేయడం ఆనవాయితీ. సోమవారం బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 29 నాటికి బెంగాల్‌ వైపు వెళ్తుందని అంచనా. సోమవారం తెలంగాణలో 40 కి.మీ. వేగంతో గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం అత్యంత భారీ వర్షాలకుఅవకాశాలున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయట తిరగవద్దని వాతావరణ శాఖ సూచించింది.

13 రైళ్ల రద్దు

తుపాను నేపథ్యంలో ఒడిశా వైపు నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 13 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మరో 16 రైళ్లను దారిమళ్లించింది. వీటిలో సోమవారం(27న) బయలుదేరాల్సిన కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ-భువనేశ్వర్‌, యశ్వంత్‌పుర్‌-బెంగళూరు, తిరుపతి-భువనేశ్వర్‌, చెన్నై సెంట్రల్‌-పూరీ, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-సంబల్‌పుర్‌, కోయంబత్తూర్‌-ముంబయి ఎల్‌టీటీ రైళ్లు ఉన్నాయి. గుంటూరు-రాయగడ రైలును పాక్షికంగా రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ప్రాణ, ఆస్తినష్టాలు నివారించాలి: సీఎస్‌

తుపాన్‌ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఆదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా నివారించాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పంచాయతీరాజ్‌, కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. వాగుల వద్ద వరద సమయంలో ప్రజలు, వాహనాలు దాటకుండా చూడాలన్నారు. చెరువులు, జలాశయాల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.


వణికిన ఉత్తరాంధ్ర

ఈనాడు, అమరావతి: గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల వద్ద తీరం దాటింది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వానలు ముంచెత్తాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. తుపాను తీరం దాటడం మొదలయ్యాక.. విశాఖపట్నం నగరంలో కుండపోత వానలు కురిశాయి. నగరంలో రహదారులు జలమయమయ్యాయి. విజయనగరం జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. పూసపాటిరేగ, భోగాపురంలోని తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రెండు చోట్ల పడవలు తిరగబడటంతో ఒకరు గల్లంతయ్యారు. ఒకరు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌లతో ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్రం తరఫున అన్నిరకాలుగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని