Amaravati: అంబరాన్నంటిన సంబరాలు

అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు రైతుల మోముల్లో కనిపించిన ఆవేదన తొలగి సంతోషం వెల్లివిరిసింది. తీర్పు వెలువడగానే శిబిరాల్లో రైతులు ఒకరికొకరు

Updated : 04 Mar 2022 05:29 IST

రాజధాని గ్రామాల్లో పండగ వాతావరణం

ఈనాడు డిజిటల్‌- అమరావతి, తుళ్లూరు గ్రామీణం- న్యూస్‌టుడే: అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు రైతుల మోముల్లో కనిపించిన ఆవేదన తొలగి సంతోషం వెల్లివిరిసింది. తీర్పు వెలువడగానే శిబిరాల్లో రైతులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. భారీగా బాణసంచా కాల్చి, సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆకుపచ్చ కండువాలు చేతపట్టి నినాదాలతో హోరెత్తించారు. మహిళా రైతులు రంగులు పూసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.  తీర్పు అనుకూలంగా రాగానే టీవీల ముందు చప్పట్లు కొడుతూ కనిపించారు. శిబిరాల్లో జై అమరావతి నినాదాలు మిన్నంటాయి.

హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం

తీర్పు వెలువడిన తర్వాత రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ఉదయం హైకోర్టు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మోకాళ్లపై నిల్చుని రెండు చేతులు జోడించి నమస్కరించారు. మహిళలు హైకోర్టుకు హారతులిచ్చారు. ముస్లిం మహిళలు, రైతులు మోకాళ్లపై నిల్చుని కృతజ్ఞతలు తెలిపారు. న్యాయాన్ని కాపాడిన న్యాయదేవతకు వందనం అని నినాదాలు చేశారు. న్యాయవాదులంతా హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం హైకోర్టు వద్దకు రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు. హైకోర్టు వద్ద నుంచి సీడ్‌యాక్సిస్‌ రహదారి వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిల్చుని ఆ రోడ్డులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్లే వరకు వేచి ఉండి రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది రైతులు మోకాళ్లపై నిల్చుని ధన్యవాదాలు తెలిపారు.

న్యాయదేవత విగ్రహానికి పాలాభిషేకం

తుళ్లూరు, అబ్బరాజుపాలెంలో న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. మందడం శిబిరంలో న్యాయదేవత ఎదుట నిల్చుని నినదించారు. అనంతవరం శిబిరంలో అమరావతి ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళి అర్పించారు. వెలగపూడిలో శిబిరంలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, నినాదాలు చేశారు. భాజపా ఎంపీ సుజనా చౌదరి మందడం, వెలగపూడి, తుళ్లూరు దీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఆయనకు మందడం గ్రామంలో ఘనస్వాగతం పలికారు.


ఉద్యమాన్ని కొనసాగిస్తాం అభివృద్ధి చేపట్టేంతవరకు పోరుబాటే: ఐకాస

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కోర్టు తీర్పునుబట్టి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేసేంత వరకు రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తామని అమరావతి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో యథాతథంగా శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. రెండున్నరేళ్లలో పాలకుల విధానాల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, అమరావతిలో అన్ని రకాల మౌలిక వసతులు సమకూరే వరకు పోరుబాట కొనసాగుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని