టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రెండో  ఛైర్మన్‌గా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బూసిరెడ్డి జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు.

Published : 20 May 2021 03:35 IST

సభ్యులుగా మరో ఏడుగురి నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రెండో  ఛైర్మన్‌గా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బూసిరెడ్డి జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో ఏడుగురు సభ్యులను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల పాటు లేదా 62 ఏళ్లు వచ్చే వరకు ఛైర్మన్‌, సభ్యులు పదవిలో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు.  సభ్యులుగా విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ రమావత్‌ ధన్‌సింగ్‌, టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, సీబీఐటీ భౌతికశాస్త్ర విభాగాధిపతి బండి లింగారెడ్డి, ప్రత్యేక గ్రేడ్‌ ఉప కలెక్టర్‌ కోట్ల అరుణకుమారి, తెలుగు పండిట్‌ సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యుడు ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణలను నియమించారు. టీఎస్‌పీఎస్సీలో ప్రస్తుత సభ్యుడు చింతా సాయిలు పదవీకాలం వచ్చే ఆగస్టు వరకు ఉంది.  దీంతో టీఎస్‌పీఎస్సీ ఎనిమిది మంది సభ్యులతో కొనసాగుతుంది.తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ 2014 ఆగస్టు 18న ఏర్పాటైంది. ఈ కమిషన్‌లో అధ్యక్షుడు గాకుండా తొమ్మిది మంది సభ్యులుండగా వీరిలో ఎనిమిది మంది పదవీకాలం గత డిసెంబరుతో ముగిసింది. మరో సభ్యుడైన చింతా సాయిలు గత మార్చి నుంచి తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. ఒక్కరితో ఉన్న టీఎస్‌పీఎస్సీని నాలుగు వారాల్లో నియమించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం సర్వీస్‌ కమిషన్‌లో నలుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకరి చొప్పున ఉన్నారు. ఉన్నతాధికారిణి, విశ్రాంత ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, భాషాపండిట్‌, ఆయుర్వేద వైద్యుడు, జర్నలిస్టుతో పాటు ఉద్యోగ సంఘాల కేటగిరి కింద సభ్యులను ఎంపిక చేశారు. గత పాలకమండలిలో  ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్‌ సభ్యుడు కాగా...తాజాగా టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డికి అవకాశమిచ్చారు.
స్వచ్ఛంద పదవీ విరమణ?  
సాధారణంగా విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ. తాజాగా ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఐఏఎస్‌గా వచ్చే ఏడాది నవంబరు వరకు ఆయన పదవీకాలం ఉంది. టీఎస్‌పీఎస్సీ చట్టబద్ధమైన సంస్థ అయినందున ఛైర్మన్‌గా విధుల్లో చేరే ముందు ఐఏఎస్‌కు రాజీనామా చేయాలి లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పొందాలి. నేరుగా ఛైర్మన్‌ పదవిలో చేరితే ఆ వెంటనే ఐఏఎస్‌ సర్వీసు నుంచి తొలగిస్తారు. జనార్దన్‌రెడ్డి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి శుక్రవారం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
సీఎం అభినందనలు  
టీఎస్‌పీఎస్సీ కొత్త ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, ఏడుగురు సభ్యులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సీఎం వారితో ఫోన్‌లో మాట్లాడారు. ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డితో మాట్లాడుతూ.. అధికారిగా, ఐఏఎస్‌గా పనిచేసిన ప్రతిచోటా గుర్తింపు తెచ్చుకున్నారని అభినందించినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీకి ఆయన అవసరం ఉందని గుర్తించి నియమించామని, ఈ పదవికి సైతం ఆయన వన్నె తెస్తారని భావిస్తున్నామన్నారు. కొత్త ఛైర్మన్‌, పాలకమండలి సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలో వ్యవసాయ శాఖకు కొత్త ముఖ్యకార్యదర్శి
జనార్దన్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులు కావడంతో వ్యవసాయశాఖకు కొత్త ముఖ్యకార్యదర్శిని త్వరలో నియమించనున్నారు.  సమర్థుడైన అధికారి పేరును సూచించాలని జనార్దన్‌రెడ్డిని సీఎం కోరినట్లు తెలిసింది.
టీఎస్‌పీఎస్సీ ద్వారా మళ్లీ నియామకాలు
గత డిసెంబరులో పాలకమండలి పదవీ విరమణ అనంతరం కొత్త ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు వెలువడలేదు. పూర్తి స్థాయి పాలకమండలి లేక ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీ జాబితాను పంపలేదు. తాజాగా కొత్త పాలకమండలి రావడంతో నియామకాల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
కారెం రవీందర్‌రెడ్డికి అభినందనలు
టీఎస్‌పీఎస్సీ సభ్యునిగా నియమితులైన టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభినందనలు తెలిపారు. టీఎన్జీవో, టీజీవోల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, మమత, ప్రతాప్‌, సత్యనారాయణ, గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌గౌడ్‌, హన్మంత్‌నాయక్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ పద్మాచారి, అధ్యక్షులు పవన్‌, మార్త రమేశ్‌, ప్రభుత్వ రంగ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ రాజేశం, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్‌, వైద్య ఆరోగ్య టీజీవోల నేత జూపల్లి రాజేందర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నేపథ్యమిది..

ఛైర్మన్‌... బి.జనార్దన్‌రెడ్డి(59): మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దయాపల్లి గ్రామంలో జన్మించిన ఈయన పశువైద్యశాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీ(ఎంవీఐసీ) చేశారు. 1990లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూపు-1కు ఎంపికై..  1996లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. వరంగల్‌, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా, పురపాలక శాఖ సంచాలకుడు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల కమిషనర్‌, జలమండలి ఎండీ, వ్యవసాయ శాఖ కమిషనర్‌, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా ఉన్నారు.  
సభ్యులు... రమావత్‌ ధన్‌సింగ్‌ (ఎస్టీ)(59) : నల్గొండ జిల్లా దేవరకొండ జాత్యానాయక్‌ తండాలో జన్మించారు. ఉస్మానియాలో సివిల్‌ ఇంజినీరింగులో మాస్టర్‌ డిగ్రీ చేశారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీరుగా ఎదిగారు. ఈఎన్‌సీగా పదోన్నతి పొందారు. మిషన్‌భగీరథ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.
కారెం రవీందర్‌రెడ్డి (ఓసీ)(59): ఉమ్మడి వరంగల్‌ జిల్లా వేలేరు గ్రామవాసి. రెవెన్యూ ఉద్యోగిగా చేరి పదవీ విరమణ పొందారు. టీఎన్జీవో జిల్లా, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు.
బండి లింగారెడ్డి (ఓసీ)(53) : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు వాసి. ఉస్మానియాలో రేడియేషన్‌ ఫిజిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. సీబీఐటీలో చేరి 25 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. లింగారెడ్డి భార్య రమ హెటిరో డ్రగ్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నారు.  
కోట్ల అరుణ కుమారి (బీసీ)(57) :  స్వస్థలం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌. ఎల్‌ఎల్‌బీ చదివారు. ప్రస్తుతం వికారాబాద్‌లో జేసీ.
సుమిత్రా ఆనంద్‌ తనోబా (బీసీ)(51): స్వగ్రామం కామారెడ్డి జిల్లా చినమల్లారెడ్డి. తెలుగు భాషాపండిట్‌, తెలంగాణ ఉద్యమకారిణి, వివిధ సంఘాల్లో పదవులు నిర్వహిస్తున్నారు.
ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు (ఓసీ)(60): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ వాసి. నవజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 2014లో సిరిసిల్లలో కేటీఆర్‌పై భాజపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత తెరాసలో చేరారు.
ఆర్‌.సత్యనారాయణ (బీసీ)(56): బీఏ చదివిన ఈయన స్వస్థలం మెదక్‌ జిల్లా వరిగుంతం. వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు.2001లో తెరాసలో చేరి, క్రియాశీలకంగా పనిచేశారు. 2007లో కరీంనగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆరునెలలకే పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని