TS HighCourt: వృద్ధులు మరమ్మతులు చేస్తుంటే సిగ్గుపడాలి

రోడ్లకు వృద్ధులు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ సిగ్గుపడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకు వచ్చే పింఛనును ఖర్చుపెట్టి మరీ వాళ్లు రహదారులకు మరమ్మతులు చేస్తుంటే.. మరి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏం చేస్తున్నట్లని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్‌లు

Updated : 15 Jul 2021 09:18 IST

వర్షాలు ప్రారంభమయ్యాక రోడ్లు వేస్తారా?
జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
ఈనాడు - హైదరాబాద్‌

రోడ్లకు వృద్ధులు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ సిగ్గుపడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకు వచ్చే పింఛనును ఖర్చుపెట్టి మరీ వాళ్లు రహదారులకు మరమ్మతులు చేస్తుంటే.. మరి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏం చేస్తున్నట్లని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్‌లు, 30 సర్కిళ్ల వారీగా రోడ్ల పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను సొంతంగా పూడ్చుతున్న 73 ఏళ్ల గంగాధర్‌ తిలక్‌, 64 ఏళ్ల వెంకటేశ్వరి దంపతుల గురించి ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వృద్ధులు తమ పింఛను సొమ్మును వెచ్చించి రోడ్ల మరమ్మతులు చేస్తున్నారని, మరి సిబ్బందికి జీతాలెందుకని ప్రశ్నించింది. ఈ దశలో జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. రోడ్ల అభివృద్ధితోపాటు నగర సుందరీకరణకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, వర్షాలకు రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏటా వర్షాలు వస్తుంటాయని, అవి ప్రారంభమయ్యాక రోడ్ల పనులు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించింది. నరకప్రాయంగా ఉన్న రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడంలేదంది. నిర్వహణ లోపంతోనే ఇలా తయారవుతున్నాయని పేర్కొంది. నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని