యాసంగి పంట కొంటారా... లేదా..?

యాసంగి పంట కొంటారా..లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని తెరాస ఎంపీలు కోరారు. ధాన్యం కొనుగోళ్లపై ఏదీ తేల్చి చెప్పకుండా  రాష్ట్ర రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు.

Published : 01 Dec 2021 06:07 IST

కేంద్రానికి తెరాస ఎంపీల సూటి ప్రశ్న

విలేకరులతో మాట్లాడుతున్న తెరాస ఎంపీలు రాములు, మాలోతు కవిత, వెంకటేశ్‌, దయాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌

ఈనాడు, దిల్లీ: యాసంగి పంట కొంటారా..లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని తెరాస ఎంపీలు కోరారు. ధాన్యం కొనుగోళ్లపై ఏదీ తేల్చి చెప్పకుండా  రాష్ట్ర రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. వెంకటేష్‌ నేత మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తమను అవమానపరుస్తున్నా రైతుల కోసం సహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. కొనుగోళ్లపై రెండు రోజులుగా ఉభయ సభల్లో పోడియాలను ముట్టడిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదన్నారు.  రైతు ద్రోహులు, దళిత ద్రోహులు భాజపా నేతలేనన్నారు. తెలంగాణ రైతులను, ప్రజలను తప్పుదారి పట్టించడానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వరి వేయాలని చెబుతున్నారన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నోటిమాటగా చెప్పకుండా సంబంధిత మంత్రులు పీయూష్‌ గోయల్‌తోనో, నరేంద్రసింగ్‌ తోమర్‌తోనో సభలో అధికారిక ప్రకటన ఇప్పించాలని, రాతపూర్వకంగా హామీ ఇప్పించాలని కోరారు. నేరుగా రైతుల జాబితా తీసుకొని కేంద్రమే కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నిధులు వేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు గోదాములు కట్టలేదని ప్రశ్నించారు. మహబూబాబాద్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ భాజపా నాయకులు రాజకీయం చేస్తున్నది కేసీఆర్‌తో కాదని, రాష్ట్ర రైతులతో అన్నారు. పీయూష్‌ గోయల్‌ కార్యాలయానికి వెళితే మీకేం పని లేదా? ఎందుకొచ్చారని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, బండ ప్రకాశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

రెండో రోజూ కొనసాగిన ఆందోళన...
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉభయ సభల్లో రెండో రోజూ తెరాస సభ్యులు ఆందోళన చేశారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని