ఇష్టానుసారం పేర్లను తొలగించడం సరికాదు

ధరణి పోర్టల్‌లో అధికారులు ఇష్టానుసారం రైతుల పేర్లను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలా తీసేసే ముందు కొన్ని విధి విధానాలను అనుసరించాలని వ్యాఖ్యానించింది.

Published : 03 Jul 2022 06:19 IST

ధరణి నుంచి పేర్లను తీసేయడంపై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో అధికారులు ఇష్టానుసారం రైతుల పేర్లను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలా తీసేసే ముందు కొన్ని విధి విధానాలను అనుసరించాలని వ్యాఖ్యానించింది. కామారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన 76 మంది రైతుల పేర్లను పోర్టల్‌ నుంచి తొలగించడంపై నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. లేని పక్షంలో కలెక్టర్‌తోపాటు ఆర్డీవో ఈ నెల 15న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ పేర్లను ధరణి పోర్టల్‌ నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ యాచారం మండలానికి చెందిన భూపల్లి సాయిలు మరో 75 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్‌ ముమ్మనేని సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆనందం వాదనలు వినిపిస్తూ సాజ్య నాయక్‌ తాండ, పూర్యనాయక్‌ తాండ, గాంధారీ ఉట్నూరు, లక్ష్మీనాయక్‌ తాండ తదితర గ్రామాలకు చెందిన 75 మంది రైతుల పేర్లను పోర్టల్‌ నుంచి అధికారులు తొలగించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం భూమిలేని రైతులకు అర ఎకరం నుంచి  3 ఎకరాల వరకు కేటాయించి, పట్టాలను కూడా మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వారి పేర్లను ధరణి పోర్టల్‌లో నమోదు చేయడంతోపాటు రైతుబంధు సాయం కూడా అందించారన్నారు. ఉన్నట్టుండి ఆ రైతుల పేర్లను ధరణి పోర్టల్‌ నుంచి తొలగించడంతో రైతుబంధుతోపాటు ఇతర పథకాల సాయం కూడా వారికి అందడంలేదన్నారు. అది అటవీ భూమి అని ప్రభుత్వ న్యాయవాది చెప్పబోగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎప్పుడో కేటాయించిన భూమికి ఇప్పుడు ఇలా చెప్పడం సరికాదన్నారు. రైతుబంధు సాయం అందించే సాయాన్ని మిగల్చడానికన్నట్లు ధరణి పోర్టల్‌లో ఇష్టానుసారం పేర్లను తొలగించడం సరికాదన్నారు. దీనిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా రైతులను భూముల నుంచి ఖాళీ చేయించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని