నిర్లక్ష్యానికి మూల్యం.. నాలుగు ప్రాణాలు

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్‌ ఆసుపత్రి)లో

Published : 01 Sep 2022 02:53 IST

కు.ని. శస్త్రచికిత్సలు వికటించిన ఘటనలో మరో ఇద్దరు మహిళల మృతి

మిగిలిన 30 మంది వివిధ ఆసుపత్రులకు తరలింపు

ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ఆపరేషన్లు చేసిన వైద్యనిపుణుడి లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు

ఈనాడు - హైదరాబాద్‌

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్‌ ఆసుపత్రి)లో ఈ నెల 25న 34 మంది మహిళలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మొబైల్‌ బృందంలో ఉండే ఇద్దరు సర్జన్లు, ఒక అనస్తీషియా వైద్యుడు ఇందులో పాల్గొన్నారు. శస్త్రచికిత్సలు వికటించి ఆదివారం మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత(32), సోమవారం ఉదయం మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ(28), అర్ధరాత్రి మాడ్గుల మండలం రాజీవ్‌నగర్‌ తండాకు చెందిన మేరావత్‌ మౌనిక(24), మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్‌కు చెందిన లావణ్య(28) మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నలుగురు మహిళలు ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందినట్లు, ఇందులో వైద్యుడు, ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యమున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా గుర్తించింది. శస్త్రచికిత్స చేశాక పరికరాలను సరిగా స్టెరిలైజేషన్‌ చేయలేదని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే వీలుంది. ఆపరేషన్లు జరిగిన తరువాత మూడోరోజు ఏఎన్‌ఎం, ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి మహిళలకు కుట్లు వేసినచోట డ్రెస్సింగ్‌ చేయాలి. కానీ, కేవలం ఫోన్‌ చేసి సరిపెట్టినట్లు తెలిసింది. కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకున్న 34 మందిలో నలుగురు చనిపోగా.. మిగిలిన 30 మందికి ఇళ్ల వద్ద, ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రానికి తరలించీ పరీక్షలు నిర్వహించారు. కొందరికి జ్వరం, కోత దగ్గర చీము, ఇన్‌ఫెక్షన్‌ సమస్యలుండడంతో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తొలుత నలుగురిని ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తీసుకురాగా.. తర్వాత నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 19 మంది, అపోలో ఆసుపత్రిలో 11 మందికి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రమాదకర పరిస్థితులు లేవని వైద్యవర్గాలు తెలిపాయి. అపోలోలో చికిత్స పొందుతున్న ముగ్గురికి కోత పెట్టినచోట చీము పట్టినట్లు తేలడంతో దాన్ని తొలగించారు. మరికొందరు జ్వరంతో, బీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఆయాసంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేసింది. శస్త్రచికిత్సలు చేసిన వైద్యనిపుణులు డాక్టర్‌ జోయల్‌ లైసెన్స్‌ను రాష్ట్ర వైద్య మండలి తాత్కాలికంగా రద్దు చేసింది. ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ విషయంపై అక్టోబరు 10లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ను ఆదేశించింది. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో వెంకటి మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి ఆసుపత్రిలోనే ఉండి వైద్య సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించారు.

ఇకనుంచి రోజుకు గరిష్ఠంగా 10 శస్త్రచికిత్సలే..

ఒకే వైద్యుడు రోజుకు 30-40 సర్జరీలు చేయడం వల్ల ఒత్తిడిలో తప్పులు దొర్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒక సర్జన్‌ ఒక రోజులో 10 కంటే ఎక్కువ సర్జరీలు చేయకూడదని వైద్యారోగ్యశాఖ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపీ విధానంలో శస్త్రచికిత్సలు చేసే నిపుణులు ప్రభుత్వ వైద్యంలో కేవలం నలుగురే ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని