Kishan Reddy: కిషన్‌రెడ్డి కుటుంబం ఆస్తులు తగ్గాయ్‌!

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కుటుంబం స్థిర, చరాస్తుల విలువ ఏడాదిలో రూ.54,58,003 మేర తగ్గింది. ఆయన కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ. 17,39,04,250.44 ఉండగా.. 2023 ఆగస్టు నాటికి రూ.16,84,46,246.96కి తగ్గాయి.

Published : 05 Sep 2023 08:21 IST

తగ్గిన స్థిర, చరాస్తుల విలువ రూ.54 లక్షలు

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కుటుంబం స్థిర, చరాస్తుల విలువ ఏడాదిలో రూ.54,58,003 మేర తగ్గింది. ఆయన కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ. 17,39,04,250.44 ఉండగా.. 2023 ఆగస్టు నాటికి రూ.16,84,46,246.96కి తగ్గాయి. ఇదే సమయంలో అప్పులు కూడా రూ.90,68,948 మేర తగ్గాయి. ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన మంత్రి తాజా కుటుంబ ఆస్తి, అప్పుల పట్టిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. కేంద్ర మంత్రి కుటుంబం చేతిలో నగదు గత ఏడాది రూ.2,45,000 మేర ఉండగా, ఈ సంవత్సరం అది రూ.3,30,000కి చేరింది. ఇదే సమయంలో చరాస్తుల విలువ రూ.8,82,60,250.44 నుంచి రూ.8,42,49,246.96కి తగ్గింది. నికరంగా మొత్తం కుటుంబ చరాస్తుల విలువ రూ.40.11 లక్షల మేర తగ్గింది. ఇదే సమయంలో కుటుంబ స్థిరాస్తుల విలువ రూ.8,53,99,000 నుంచి రూ.8,38,67,000కి తగ్గిపోయాయి. హిందూ ఉమ్మడి కుటుంబం(హెచ్‌యూఎఫ్‌) పేరున ఉన్న ఆస్తి విలువ రూ.40,31,000 మేర తగ్గింది. కుమారుడి పేరున ఉన్న స్థిరాస్తి విలువ రూ.24.99 లక్షల మేర పెరిగింది. సతీమణి పేరున ఉన్న అప్పులు రూ.12,35,448 మేర తగ్గగా, కుమార్తె పేరున ఉన్న రుణాలు రూ.78,33,500 మేర తగ్గాయి.

  • చరాస్తుల్లో కిషన్‌రెడ్డి పేరున మూడు బ్యాంకుల్లో డిపాజిట్లు, కాడిలా హెల్త్‌కేర్‌లో 3 వేల షేర్లు, 2 ఎల్‌ఐసీ పాలసీలు ఉన్నాయి. వైష్ణవి అసోసియేట్స్‌కి రూ.2 లక్షలు, ఇందిరా లెజిస్లేచర్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి రూ.5 లక్షల రుణం ఇచ్చారు.
  • మంత్రి సతీమణి పేరున బంజారాహిల్స్‌లో 425 చదరపు గజాల స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.1,78,50,000. 2021 డిసెంబరు 30న యూసుఫ్‌గూడలో రూ.4,57,31,000 పెట్టి ఆమె 600 చదరపు గజాల స్థలం కొనుగోలు చేయగా, దాని మార్కెట్‌ విలువను ఇప్పుడూ అంతే చూపారు.
  • కుమారుడి పేరున కాచిగూడలో వారసత్వంగా సంక్రమించిన 122 చదరపు గజాల స్థలంలో నిర్మించిన భవనం మార్కెట్‌ విలువను రూ.1,20,19,000గా చూపారు.
  • హిందూ ఉమ్మడి కుటుంబం కింద రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 8.2850 ఎకరాల వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చినట్లు చెప్పారు. ఎకరా రూ.8.80 లక్షల చొప్పున.. రూ.76.67 లక్షలుగా పేర్కొన్నారు. అదే గ్రామంలో 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉన్నట్లు చూపారు. దాని మార్కెట్‌ విలువ రూ.6 లక్షలు ఉన్నట్లు చెప్పారు.
  • కిషన్‌రెడ్డి పేరున ఉన్న 1995 మోడల్‌ మారుతీ 800 కారు(రూ.40 వేలు) తప్పితే వీరి కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ కారు లేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని