బీబీనగర్‌ -గుంటూరు మధ్య రెండో లైనుపై మరో ముందడుగు

తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్‌- నడికుడి- గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్‌, గుంటూరు మధ్య (239 కి.మీ.) రెండో లైను నిర్మాణ పనులకు కసరత్తు మొదలైంది.

Published : 09 Oct 2023 07:59 IST

ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు లేఖ
రూ.1,947.44 కోట్ల అంచనాతో సివిల్‌ నిర్మాణాలు
రూ.905.79 కోట్లతో సిగ్నల్‌, ఎలక్ట్రికల్‌ పనులు
త్వరలో టెండర్లు..

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్‌- నడికుడి- గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్‌, గుంటూరు మధ్య (239 కి.మీ.) రెండో లైను నిర్మాణ పనులకు కసరత్తు మొదలైంది. కేంద్ర కేబినెట్‌ వ్యవహారాల కమిటీ డబ్లింగ్‌కు ఆమోదం తెలపడంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు ద.మ.రైల్వేకు తాజాగా లేఖ రాసింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ.2,853.23 కోట్లుగా పేర్కొంది. ఇందులో సివిల్‌ పనులకు రూ.1,947.44 కోట్లు, సిగ్నలింగ్‌, టెలికాం పనులకు రూ.319.62 కోట్లు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ నిర్మాణ పనులకు రూ.586.17 కోట్ల మొత్తాన్ని అంచనా వ్యయాలుగా పేర్కొంది. నిర్మాణ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైలకు దగ్గరి దారి..

సికింద్రాబాద్‌- విజయవాడ మధ్య ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలున్నాయి. ఇందులో కాజీపేట, ఖమ్మం మార్గంలో ఈ రెండు నగరాల మధ్య దూరం 350 కి.మీ. మరో మార్గమైన బీబీనగర్‌- నడికుడి- గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం 336 కి.మీ మాత్రమే. దీనికంటే ముఖ్యంగా  సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నైలకు వయా విజయవాడతో పోలిస్తే.. నడికుడి, గుంటూరు మార్గంలో దాదాపు 46 కి.మీ. దూరం తక్కువ. దీంతో ఇది అత్యంత రద్దీ మార్గంగా మారింది. ఈ ట్రాక్‌ సామర్థ్య వినియోగం ఏకంగా 148.25 శాతం ఉంది. అయితే సింగిల్‌ ట్రాక్‌ కావడంతో.. ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు స్టేషన్‌లో పక్కన ఆపాల్సి వస్తోంది. రెండో లైను నిర్మిస్తే ప్రస్తుత రైళ్ల వేగం పెరుగుతుంది. అదనపు రైళ్లు నడిపించడానికి అవకాశం ఉంటుంది. బీబీనగర్‌-గుంటూరు మార్గంలో 100 కి.మీ. రైల్వే ట్రాక్‌ ఏపీ పరిధిలో, 139 కి.మీ. రైల్వే ట్రాక్‌ తెలంగాణ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సింగిల్‌ లైను గరిష్ఠ వేగ సామర్థ్యం 130 కి.మీ. మాత్రమే. వందేభారత్‌ రైలు సామర్థ్యం 160 కి.మీ.గా ఉంది. దీంతో రెండోలైన్‌ను 150-160 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించే అవకాశం ఉంది.

4 ఏళ్లు ఆలస్యం.. రూ.373 కోట్ల భారం

నిజానికి ఈ ప్రాజెక్టు 2019-20 కేంద్ర బడ్జెట్‌ రైల్వే పింక్‌బుక్‌లో చూపించారు. అప్పట్లో అంచనా వ్యయాన్ని రూ.2,480 కోట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడంతో.. ఇప్పుడు అంచనా వ్యయం రూ.2,853.23 కోట్లకు చేరింది. అంటే రూ.373 కోట్లు పెరిగింది.


అనేక ప్రయోజనాలు

రెండో లైన్‌ నిర్మాణంతో ప్రయాణికులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటు, బొగ్గు రవాణా వేగవంతమవుతుంది. ఈ మార్గంలోని విష్ణుపురం, నడికుడి, జాన్‌పహాడ్‌, మేళ్లచెరువు, జగ్గయ్యపేట, రామాపురంలో అనేక సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. చిట్యాల, నార్కట్‌పల్లిలో ఐరన్‌, స్టీల్‌ పరిశ్రమలు ఉండగా, విష్ణుపురంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణమవుతోంది. అలానే మిర్యాలగూడ, నల్గొండ, నాగిరెడ్డిపల్లిలో ఎఫ్‌సీఐ గోదాములున్నాయి. రెండో రైల్వే లైను నిర్మాణం వీటన్నింటికీ మరింత ఉపయోగకరంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని