సీఎం సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి

నలుగురు కాంగ్రెస్‌ నేతలను రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో నియమిస్తూ సాధారణ పరిపాలనాశాఖ శనివారం(ఈ నెల 20) తేదీతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులయ్యారు.

Published : 22 Jan 2024 05:22 IST

ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్‌, హర్కర
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి

ఈనాడు, హైదరాబాద్‌: నలుగురు కాంగ్రెస్‌ నేతలను రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో నియమిస్తూ సాధారణ పరిపాలనాశాఖ శనివారం(ఈ నెల 20) తేదీతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా, మరో ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌, ప్రజాసంబంధాల విభాగాలకు సలహాదారుగా నియమించారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సలహాదారుగా నియమించారు. నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పించారు.


వేం నరేందర్‌రెడ్డి

హబూబాబాద్‌ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి ఎంఏ చదివారు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డికి అండగా ఉన్నారు.


మల్లు రవి

ల్లు రవి ఎంబీబీఎస్‌, డీఎల్‌వో చదివారు. 1991-96లో, 1998-99లో రెండుసార్లు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా, 2008-09లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్‌. సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా క్యాబినెట్‌ హోదాలో దిల్లీలో పనిచేశారు. ఇప్పుడు అదే పదవిలో మళ్లీ నియమితులు కావడం విశేషం. గతంలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.


షబ్బీర్‌ అలీ

బ్బీర్‌ అలీ 1970లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1989, 2004లలో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2013 మార్చి 14న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆరేళ్లపాటు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇటీవలి ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


హర్కర వేణుగోపాల్‌

పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన హర్కర వేణుగోపాల్‌ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర ప్రొటోకాల్‌ విభాగం ఛైర్మన్‌గా ఉన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదుకు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధి మిషన్‌ కార్యక్రమానికి కన్వీనర్‌గా ఉన్నారు. వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని