Hyderabad-Vijayawada highway: ఈసారైనా ‘దారి’కొచ్చేనా?

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలోని ప్రమాదకర ప్రాంతాల(బ్లాక్‌ స్పాట్స్‌) దిద్దుబాటుకు మార్గం సుగమంకానుంది. ఎట్టకేలకు ఆరుగురు గుత్తేదారులు టెండర్ల దాఖలుకు ముందుకు వచ్చారు.

Updated : 13 Feb 2024 08:53 IST

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మరమ్మతులకు 6 టెండర్లు
ఎట్టకేలకు స్పందించిన గుత్తేదారులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలోని ప్రమాదకర ప్రాంతాల(బ్లాక్‌ స్పాట్స్‌) దిద్దుబాటుకు మార్గం సుగమంకానుంది. ఎట్టకేలకు ఆరుగురు గుత్తేదారులు టెండర్ల దాఖలుకు ముందుకు వచ్చారు. గుత్తేదారులు ముందుకు రాకపోవటంతో పలు దఫాలు వాయిదా పడిన ప్రక్రియ ఈ సారైనా కొలిక్కి వస్తుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో పంతంగి టోల్‌ప్లాజా నుంచి తెలంగాణ సరిహద్దులోని నల్లబండగూడెం వరకు సుమారు 17 ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని చక్కదిద్దాలని గడిచిన కొన్నేళ్లుగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన కారణంగా వాహనాల రద్దీ తగ్గిన నేపథ్యంలో నాలుగు వరసల రహదారిని ఆరు వరసలకు విస్తరించే అవకాశం లేదని, ప్రమాదకర ప్రాంతాలను సరిదిద్దేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గడచిన ఏడాది లోక్‌సభలో ప్రకటించారు.

ఆ మేరకు గతేడు జూన్‌ నెలలో తొలిసారి టెండర్లు ఆహ్వానించారు. గుత్తేదారుల ముందుకు రాలేదు. తర్వాత మరో రెండుసార్లు టెండర్లు పిలిచినా ఇదే పరిస్థితి. నాలుగో దఫా టెండర్లు ఆహ్వానించిన సందర్భంలో ముగ్గురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయగా సాంకేతిక స్థాయిలో ఒకరు అనర్హతకు గురయ్యారు. ఆర్థిక బిడ్ల సమయంలో మరొకరు అనర్హతకు గురికావడంతో ఒక్కరే పోటీలో మిగిలారు. దీంతో కేంద్రం టెండరు రద్దు చేసింది. మరోదఫా రెండు సార్లు నోటిఫికేషన్‌ జారీ చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా గతేడు డిసెంబరులో మరోదఫా కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు దాఖలు చేసేందుకు ఈ నెల పదో తేదీ చివరి గడువు కావటంతో ఆరుగురు గుత్తేదారులు ముందుకొచ్చారు. సాంకేతికంగా ఆరు టెండర్లు అర్హత పొందినట్లు సమాచారం. 17 ప్రాంతాల్లో దిద్దుబాటు పనులకు రూ.326 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని