Huzurabad By Election: వీవీ ప్యాట్స్‌ తరలింపుపై నివేదిక ఇవ్వండి

హుజూరాబాద్‌ ఉపఎన్నిక అనంతరం వీవీప్యాట్స్‌ తరలింపు విషయంలో వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందజేయాలని ఆదివారం కరీంనగర్‌ కలెక్టర్‌, నియోజకవర్గ ....

Updated : 24 Sep 2022 15:12 IST

కరీంనగర్‌ కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
భాజపా నేతల ఫిర్యాదు నేపథ్యం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు అందజేస్తున్న భాజపా నేతలు డీకే.అరుణ, రాజాసింగ్‌, రాంచందర్‌రావు తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌ - బన్సీలాల్‌పేట్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉపఎన్నిక అనంతరం వీవీప్యాట్స్‌ తరలింపు విషయంలో వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందజేయాలని ఆదివారం కరీంనగర్‌ కలెక్టర్‌, నియోజకవర్గ ఎన్నికల అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు. వీవీప్యాట్స్‌ను బస్సు నుంచి కారులోకి ఎందుకు తరలించారో, కారణాలేంటో అందులో స్పష్టం చేయాలన్నారు. అంతకు ముందు వీవీప్యాట్ల తరలింపులో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆదివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీవీప్యాట్లను తరలిస్తున్న బస్సులను జమ్మికుంట శివారులోని హోటల్‌ వద్ద నిలిపి, ప్యాట్లను కారులోకి మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు. వీవీప్యాట్‌లను అక్రమంగా తరలించారనే వార్తల నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో గాంధీజీ విగ్రహం వద్ద భాజపా నేతలు మౌనదీక్ష నిర్వహించారు.‘వీవీ ప్యాట్లు పనిచేయకుంటే స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చాలి లేదా అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లకు విషయం చెప్పాలి.. ప్రైవేటు కార్లలో తరలించడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దర్శకత్వంలోనే ఈ దొంగాటకు తెరలేపారని ఆరోపించారు.

ఓట్ల లెక్కింపుపై సమీక్ష
మరోవంక.. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి కేంద్రంలో జరిపిన ఏర్పాట్లపై కరీంనగర్‌ కలెక్టర్‌, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శశాంక్‌ గోయల్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


పటిష్ఠ భద్రతతో తరలించాం: కరీంనగర్‌ సీపీ

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా ఈవీఎంల తరలింపు విషయంలో పోలీసులు, అధికారులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ స్పష్టీకరించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నిక తర్వాత ఈవీఎంలను బస్సుల్లో తరలిస్తుండగా జమ్మికుంట ఫ్లైఓవర్‌ వద్ద ఓ బస్సు టైరు పంక్చరు కావడంతో మిగతావి ఆగిపోయాయని చెప్పారు. వీవీప్యాట్‌ను కారులో తీసుకెళ్లడాన్ని ఈవీఎంను ఆ వాహనంలోకి మార్చినట్లుగా వీడియో తీసి తప్పుదోవ పట్టించారని వివరించారు. పోలీసులు విచారణ జరపగా అది సాంకేతిక లోపంతో పక్కన పెట్టిన వీవీప్యాట్‌ అని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి అధికారుల ఆదేశాలతో దాన్ని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు తీసుకువచ్చినట్లు తేలిందన్నారు. 306 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలను ప్రత్యేక భద్రత, జీపీఎస్‌ విధానంతో పర్యవేక్షిస్తూ కరీంనగర్‌కు తరలించామని సీపీ పేర్కొన్నారు. ఈ అంశాలపై పలు పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. జమ్మికుంట, కరీంనగర్‌లో జరిగిన సంఘటనలపై సీసీ ఫుటేజీ సేకరించి ఎన్నికల అధికారికి సమర్పిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్ట్‌ చేసిన వ్యక్తుల వివరాలు సేకరించి కేసు పెడతామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని