BJP: ఆద్యంతం.. ఉద్రిక్తం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ హైదరాబాద్‌లో మంగళవారం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సాయంత్రం 5 గంటలకు దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు

Updated : 05 Jan 2022 05:23 IST

సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా భాజపా ర్యాలీ
దిల్లీ నుంచి జాతీయ అధ్యక్షుడి రాక
ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
కొవిడ్‌ నిబంధనలు పాటిస్తానన్న జె.పి.నడ్డా

సికింద్రాబాద్‌ ఎం.జి.రోడ్డులోని గాంధీ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా. చిత్రంలో ఆ పార్టీ నేతలు విజయశాంతి, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రామచంద్రరావు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌, సనత్‌నగర్‌, రెజిమెంటల్‌బజార్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ హైదరాబాద్‌లో మంగళవారం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సాయంత్రం 5 గంటలకు దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ కార్తికేయ కలిసి, ర్యాలీకి అనుమతి లేదని వివరించారు. అప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేతలు కె.లక్ష్మణ్‌, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్‌, వందలమంది కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయంలోనే నడ్డాను అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తానని, నిరసన తెలిపే హక్కును అడ్డుకోవద్దంటూ ఆయన చెప్పడంతో పోలీస్‌ అధికారులు వెళ్లిపోయారు.

విమానాశ్రయంలో తమ నేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానాశ్రయం లోపలికి వెళ్లడానికి యత్నించారు. ముందుగా ఇచ్చిన భాజపా శ్రేణుల జాబితాలో రాజాసింగ్‌ పేరు లేకపోవడంతో భద్రతాధికారులు ఆయనను అనుమతించలేదు. దీంతో ఆయన అరగంట పాటు బయటే ఉండి నడ్డాకు స్వాగతం పలికారు. బయటకు వచ్చిన నడ్డా..   కిషన్‌రెడ్డి కారులో సికింద్రాబాద్‌ బయలుదేరారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించినా.. దారులను దిగ్బంధించినా వారి కళ్లుగప్పి భాజపా కార్యకర్తలు వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో గాంధీచౌక్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జె.పి.నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్‌, తరుణ్‌ఛుగ్‌ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీ కాకుండా మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు ప్రకటించడంతో నడ్డా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి కొవ్వొత్తులను వెలిగించారు. ఆయన వెళ్లిన తర్వాత పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్‌ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో భాజపా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

 గాంధీ విగ్రహం వద్దకు చేరుకొన్న భాజపా శ్రేణులు

నేడు భాజపా స్వచ్ఛభారత్‌
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా కమలదళం బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అరెస్సెస్‌ సమావేశాల కోసం అన్నోజిగూడ వెళ్లిన అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 14 రోజుల నిరసన కార్యక్రమాలకు సమన్వయకర్తగా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను నియమించారు. ఈ సందర్భంగా వివిధ రూపాల్లో రోజుకొక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని