Maldives: మాల్దీవుల నిర్వాకం.. ఓ నిండు ప్రాణం బలి!

Maldives: మాల్దీవుల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలుణ్ని అత్యవసరంగా రాజధాని మాలెకు తరలించాల్సి వచ్చింది. కానీ, ఎయిర్‌లిఫ్ట్‌కు అనుమతుల్లో జాప్యం జరగటంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 21 Jan 2024 11:48 IST

మాలె: అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు (Mohammed Muizzu) నేతృత్వంలోని మాల్దీవుల (Maldives) ప్రభుత్వం చేసిన నిర్వాకం ఓ బాలుడి ప్రాణాల్ని బలిగొంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. తీవ్ర అస్వస్థతకు గురైన 14 ఏళ్ల బాలుణ్ని భారత్‌కు చెందిన డోర్నియర్‌ విమానంలో తరలించేందుకు అక్కడి ప్రభుత్వ వర్గాల నుంచి సమయానికి అనుమతులు రాలేదు. ఫలితంగా సకాలంలో చికిత్స అందక బాలుడు మృతిచెందాడు.

విల్మింగ్టన్ అనే దీవిలో బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి జనవరి 17వ తేదీ సాయంత్రం స్ట్రోక్‌ వచ్చింది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తక్షణమే రాజధాని మాలెకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ఎయిర్‌ అంబులెన్స్‌ కోసం అతని తల్లిదండ్రులు ప్రభుత్వ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. మర్నాడు ఉదయం వరకు తమ ఆవేదన పట్టించుకున్నవారే లేరని బాలుడి తండ్రి వాపోయాడు. ఎట్టకేలకు ఆ దేశ వైమానిక దళం స్పందించి బాలుణ్ని మాలెకు తీసుకెళ్లింది. అప్పటికే 16 గంటల జాప్యం కారణంగా చికిత్సకు అవసరమైన కీలక సమయం ఆవిరైపోయింది. ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది.

అత్యవసర సమయాల్లో తరలింపు ప్రక్రియను మాల్దీవుల (Maldives) ప్రభుత్వం ‘ఆసంధ కంపెనీ లిమిటెడ్‌’కు అప్పగించింది. తాజా ఘటనపై వారి వాదన మాత్రం భిన్నంగా ఉంది. సమాచారం అందిన వెంటనే బాధితుణ్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొంది. ఈ సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకోవాలని.. ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రకటన విడుదల చేసింది.

మాల్దీవుల్లో అత్యవసర సమయాల్లో బాధితులను తరలించేందుకు భారత విమానాన్ని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న వేళ దాన్ని ఉపయోగించడానికి ప్రభుత్వం నిరాకరించడం వల్లే జాప్యం జరిగిందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీనిపై మాల్దీవుల ఎంపీ మీకైల్‌ నసీమ్‌ స్పందిస్తూ.. ‘‘భారతదేశంపై అధ్యక్షుడికి ఉన్న శత్రుత్వం కోసం ప్రజల జీవితాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు