China Ship: మా దేశానికే వస్తోంది.. చైనా పరిశోధన నౌకపై మాల్దీవులు

చైనా పరిశోధక నౌక తమ దేశానికే వస్తున్నట్లు మాల్దీవులు ప్రభుత్వం ధ్రువీకరించింది. వచ్చే నెలలో రాజధాని మాలె తీరంలో లంగరు వేస్తుందని తెలిపింది.

Published : 23 Jan 2024 22:51 IST

మాలె: చైనా పరిశోధక నౌక (Xiang Yang Hong 03) తమ దేశానికే వస్తున్నట్లు మాల్దీవులు (Maldives) ధ్రువీకరించింది. ఫిబ్రవరి ప్రారంభంలో రాజధాని మాలె తీరంలో లంగరు వేస్తుందని తెలిపింది. చైనా నుంచి ఈ మేరకు అభ్యర్థన వచ్చినట్లు పేర్కొంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ నౌక ఎలాంటి పరిశోధన కార్యకలాపాలు నిర్వహించదని చెప్పింది. భారత్‌- మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న వేళ.. ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘మాల్దీవులు ఎల్లప్పుడూ స్నేహపూర్వక దేశాల నౌకలకు గమ్యస్థానంగా ఉంది. శాంతియుత ప్రయోజనాల కోసం పౌర, సైనిక నౌకలకు ఆతిథ్యం ఇస్తూనే ఉంటుంది. ఇటువంటి చర్యలు.. మా భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుస్తాయి. మిత్ర దేశాల ఓడలను స్వాగతించే శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని చాటుతాయి’’ అని పేర్కొనడం గమనార్హం.

భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవుల దిశగా చైనా పరిశోధక నౌక

‘షియాన్‌ యాంగ్ హాంగ్‌ 03’ కదలికల్ని నిశితంగా గమనిస్తున్నట్లు భారత నేవీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. గతంలో ఇదే తరహా నౌకలు శ్రీలంక తీరంలో కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నౌకలు సైనిక- పౌర ప్రయోజనాలకు సంబంధించినవి కావని ఆరోపించింది. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది.

మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు.. చైనా అనుకూల పార్టీగా పేరుంది. దానికి తగ్గట్టే ఆయన భారత్‌తో వివాదం వేళ.. బీజింగ్‌లో పర్యటించారు. తమ దేశంలోని సైన్యాన్ని వాపస్‌ తీసుకోవాలని భారత్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని