Emmanuel Macron: ‘ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు!’.. నెతన్యాహుతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడి భేటీ

హమాస్‌తో పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రాన్ సంఘీభావం తెలిపారు.

Published : 24 Oct 2023 17:43 IST

టెల్‌ అవీవ్: ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌తో పోరాడుతోన్న అంతర్జాతీయ సంకీర్ణాన్ని (The Global Coalition).. హమాస్‌పై యుద్ధానికి కూడా విస్తరించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రాన్‌ పిలుపునిచ్చారు. హమాస్‌తో ఉద్ధృత పోరు కొనసాగిస్తోన్న వేళ.. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా మాక్రాన్‌ (Emmanuel Macron) జెరూసలెంలో అడుగుపెట్టారు. దేశ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లకు ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని పేర్కొన్నారు. ఇరాన్‌, హిజ్బుల్లాలు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ‘ఇజ్రాయెల్‌- పాలస్తీనా శాంతి ప్రక్రియ’ను పునః ప్రారంభించాలని సూచించారు. అయితే.. హమాస్‌ను నాశనం చేయాల్సిందేనని, యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని నెతన్యాహు చెప్పారు.

‘ఇజ్రాయెల్‌కు ఆ హక్కుంది’.. మారిన చైనా స్వరం!

ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడుల్లో మృతి చెందిన వారిలో 30 మంది ఫ్రాన్స్‌ పౌరులు కూడా ఉన్నారు. మరో తొమ్మిది మంది ఆచూకీ లభించాల్సి ఉందని మాక్రాన్‌ వెల్లడించారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాలనూ ఆయన పరామర్శించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడినీ మాక్రాన్‌ కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితరులూ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హమాస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరుకు తాము మద్దతుగా నిలుస్తున్నామనే సందేశాన్ని చాటేందుకే ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టినట్లు వారు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని