Hamas: మార్చి.. ‘ఏమార్చి!’

ఇజ్రాయెల్‌పై దాడి ప్రణాళికను హమాస్‌ అత్యంత గోప్యంగా ఉంచింది. తాము పోరాడే స్థితిలో లేమని నమ్మించేందుకు కొన్ని నెలల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

Updated : 11 Oct 2023 06:35 IST

ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ వ్యూహం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌పై దాడి ప్రణాళికను హమాస్‌ అత్యంత గోప్యంగా ఉంచింది. తాము పోరాడే స్థితిలో లేమని నమ్మించేందుకు కొన్ని నెలల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంతేకాదు.. ఈ దాడి ప్రణాళి కీలక హమాస్‌ సభ్యులకు తప్ప మూడో కంటికి తెలియనీయలేదు. దాడిలో పాల్గొన్న మిలిటెంట్లకు ఎందుకు శిక్షణ ఇస్తున్నారో కొన్ని గంటల ముందు వరకూ చెప్పలేదు. మరోవైపు కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్‌, ఐడీఎఫ్‌ బలగాలను ఏమార్చే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది. ఈ విషయాన్ని హమాస్‌ నాయకుడు ఒకరు స్వయంగా వెల్లడించారు. ఆ సంస్థకు చెందిన అలీ బరాఖే ప్రస్తుతం లెబనాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. అతడు బీరుట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. హమాస్‌లోని అత్యంత సీనియర్‌ కమాండర్లలో అతి కొద్ది మందికే ఇజ్రాయెల్‌పై దాడి వ్యూహం తెలుసని పేర్కొన్నాడు. ‘జీరో అవర్‌ (దాడికి  నిర్ణయించిన పక్కా సమయం) గురించి అతి తక్కువ మంది హమాస్‌ కమాండర్లకే తెలుసు. మా సెంట్రల్‌ కమాండ్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎవరూ గత వారం బీరుట్‌లో లేరు’ అని వెల్లడించాడు. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, ఇరాన్‌ గ్రూపులు గతంలో హమాస్‌కు సాయం చేసేవి. కానీ 2014 గాజా యుద్ధం నుంచి హమాస్‌ సొంతంగా రాకెట్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకుని మిలిటెంట్లకు శిక్షణ ఇస్తోందని అలీ బరాఖే వెల్లడించారు.

డబ్బు, వర్క్‌ వీసాలు అవసరమని నమ్మించి..

ఇజ్రాయెల్‌తో తాము పోరాటానికి సిద్ధంగా లేమనే సంకేతాలు గత కొన్నాళ్లుగా హమాస్‌ నుంచి వస్తున్నాయి. ఇటీవల చిన్న చిన్న పాలస్తీనా గ్రూపులకు, ఇజ్రాయెల్‌ సేనలకు మధ్య జరిగిన ఘర్షణల్లో హమాస్‌ తలదూర్చలేదు. పీఐజే, ఇతర సంస్థలు జరిపిన దాడుల్లో పాల్గొనేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దళాలు హమాస్‌పై కన్నేసి ఉంచినా అటువైపు నుంచి ఎటువంటి దాడి యత్నాలు లేకపోవడంతో సంతృప్తి చెందింది. అదే సమయంలో గాజా వాసులు అధిక ఆదాయం పొందేందుకు ఇజ్రాయెల్‌లో పని చేసేలా ఎక్కువ వర్క్‌ వీసాలు సాధించడంపైనే తమకు ఆసక్తి ఉందన్నట్లు టెల్‌ అవీవ్‌ను నమ్మించింది. దీనికి తోడు హమాస్‌ మరింత బాధ్యతా యుతంగా ఉందని తమను మిత్ర దేశాలు నమ్మించాయని ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా మాజీ సలహాదారు యాకోవ్‌ అమిడ్రోర్‌ మండిపడ్డారు. ‘మూర్ఖంగా మేం వారి మాటలు నమ్మి తప్పు చేశాం. ఇక ముందు ఇలాంటి తప్పులు జరగవు’ అని పేర్కొన్నారు.

ఉగ్రవాది ఇంటరాగేషన్‌తో ధ్రువీకరణ..

ఐడీఎఫ్‌ బలగాలు ఓ హమాస్‌ సాయుధ ముష్కరుడిని అరెస్టు చేశాయి. దాడికి 5 గంటల ముందే కీలక నేత తమకు దాడి చేస్తున్న ప్రాంతం గురించి చెప్పాడని ఆ సాయుధుడు వెల్లడించాడు. 1,000 మంది పాల్గొన్నారని తెలిపాడు. మొత్తం 15 చోట్ల సరిహద్దు కంచెను కత్తిరించినట్లు చెప్పాడు. తాము ఇజ్రాయెల్‌లో చొరబడే సమయానికి అక్కడ దళాలు లేకపోవడంతో ఆశ్చర్యపోయామని పేర్కొన్నాడు. తమతోపాటు ఉన్న సాయుధులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి.. రెండు గంటలపాటు నడిపించి గాజాలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. అప్పుడూ ఇజ్రాయెల్‌ దళాలు కనిపించలేదన్నాడు. అంతేకాదు.. తమ సాయుధుల ట్రక్కులు అత్యాధునిక ఆయుధాలతో ఉన్నాయని వెల్లడించాడు.


తొలుత ఐడీఎఫ్‌ కమ్యూనికేషన్లను తెంపి.. ఆపై అరాచకం

ఐడీఎఫ్‌ దక్షిణ గాజా డివిజన్‌పై తొలుత హమాస్‌ కమాండో యూనిట్‌ దాడి చేసింది. ఇది అక్కడి కమ్యూనికేషన్‌ వ్యవస్థలను దెబ్బతీసింది. దీంతో ఇజ్రాయెల్‌ కమాండర్లు పరస్పరం సంప్రదించుకోవడం నిలిచిపోయింది. ఫలితంగా దళాలకు ఆదేశాలు రావడంలో జాప్యం జరిగింది. ఈ లోపు ముష్కర మూక సరిహద్దు ఊళ్లపై పడి రక్తపాతం సృష్టించింది. అంతేకాదు మరో 130 మందిని కిడ్నాప్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు