Maldives: రిపబ్లిక్‌డే సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన ముయిజ్జు

భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మాల్దీవుల అధ్యక్షుడు సందేశం పంపారు. ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకొంది. 

Updated : 26 Jan 2024 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఓ పక్క దిల్లీ-మాలెల మధ్య దౌత్య వివాదం వేడెక్కిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఇరుదేశాల స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు. ‘‘భారత రాష్ట్రపతి, ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు వేర్వేరుగా సందేశాలు పంపారు. రానున్నకాలంలో భారత ప్రజలు శాంతి, అభివృద్ధి, సంపదతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని వందల ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని, బంధాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు’’ అని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు ఇబ్రహీం సోలీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. భవిష్యత్తులో ఇది మరింత బలపడాలని ఆయన ఎక్స్‌లో పోస్టు చేసిన సందేశంలో ఆకాంక్షించారు. 

గతేడాది మాల్దీవుల్లో ఎన్నికల అనంతరం ముయిజ్జు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకొన్నాయి. ఇటీవల ఆ దేశానికి చెందిన ముగ్గురు మంత్రులు మన ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వారిని పదవి నుంచి తప్పించి మాలె నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు ఆ దేశంలో ఉన్న భారత సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని నూతన ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. న్యూదిల్లీ కూడా ఈ దిశగా చర్యలు తీసుకొంటోంది. 

మరోవైపు ఆ దేశ విపక్షాలు మాత్రం భారత్‌ను దూరం చేసుకోవడం దేశానికే హానికరమని ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ మేరకు ‘మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (MDP)’, ది డెమొక్రాట్స్‌ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. భారత్‌ను దీర్ఘకాల మిత్రుడిగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాయి. ఎప్పటినుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ మారుతున్న ‘విదేశాంగ విధాన వైఖరి’ని ఎత్తి చూపాయి. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరతలు మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని గుర్తుచేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు