Rishi Sunak: చిన్న పడవల రాక తగ్గింది.. అక్రమ వలసలను అడ్డుకోవడంలో పురోగతి: సునాక్‌

అక్రమ వలసల కేసుల్లో తగ్గుదల నమోదైందని బ్రిటన్(Britain) ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వలసల సమస్య( Illegal Migration) ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో కీలక అంశంగా మారనుంది. ఈ క్రమంలో రిషి సునాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. 

Updated : 02 Jan 2024 11:15 IST

లండన్‌: అక్రమ వలసలకు(Illegal Migration) అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్‌(Britain) ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారి సంఖ్యను నియంత్రించడంలో తమ ప్రభుత్వం పురోగతి సాధించిందని తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) ప్రకటించారు. ఆ కేసుల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు. శరణార్థిగా ఆశ్రయం కోరిన కేసులను పరిష్కరించి వాటి భారాన్ని తగ్గించినట్లు తెలిపారు. ఈ మేరకు హోం శాఖ విడుదల చేసిన గణాంకాలను ఉటంకించారు.

చిన్న పడవల్లో ఇంగ్లిష్‌ ఛానల్‌ను దాటుతున్న వారి సంఖ్య గత సంవత్సరం 36 శాతం తగ్గినట్లు ఆ గణాంకాలు వెల్లడించాయి. దాదాపు ఐదేళ్లలో మొదటిసారి ఈ తగ్గుదల నమోదైందని పేర్కొన్నాయి. దీనిపై సునాక్‌ స్పందిస్తూ.. ‘బ్రిటన్‌ ప్రజలపై అక్రమ వలసల భారానికి ముగింపు పలకాలని నేను నిశ్చయించుకున్నాను. ఈ చర్యలతో ప్రజల పన్నుల సొమ్మును ఆదా చేస్తున్నాం. ఫలితంగా పౌరసేవలపై ఒత్తిడి తగ్గుతోంది’ అని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది బ్రిటన్‌ ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో అక్రమ వలసల అంశం ప్రభుత్వానికి కీలకంగా మారింది.

‘ యూకే వీసా కఠిన నిబంధనలు.. నేటి నుంచి అమల్లోకి!’

బ్రిటన్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసి పెండింగ్‌లో ఉన్న కేసులు ప్రభుత్వంపై ఆర్థికంగా ప్రభావం చూపుతున్నాయి. ఆశ్రయం కోరుకుంటున్న ప్రజలు హోటళ్లు, నిర్బంధ కేంద్రాల్లో ఉండటంతో వారి నిర్వహణ నిమిత్తం ప్రభుత్వంపై రోజుకు 10.2 మిలియన్ల డాలర్ల భారం పడుతోంది. ఈ కేసుల్ని వేగంగా పరిష్కరించడంతో సొమ్ము ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ఏడాది బ్రిటన్‌కు భారీ సంఖ్యలో వలసలు వచ్చే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ సర్వీస్‌ యూనియన్‌కు చెందిన అధికారులు హెచ్చరించారు. ఈ తరుణంలో సునాక్‌ ప్రభుత్వం సాధించిన పురోగతి తాత్కాలికమేననే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు వీసా కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు. ‘సరిహద్దులను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను రక్షించుకునే చర్యలు ఈ ఏడాది మొత్తం అమల్లో ఉంటాయి. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు వారి కుటుంబీకులను తీసుకురావడానికి నేటితో ముగింపు పడింది. దీని ద్వారా వేల సంఖ్యలో వలసలు తగ్గుతాయి. ఇలా దాదాపు మూడు లక్షల మందిని నిరోధించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాం’ అని బ్రిటన్‌ హోంశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని