Updated : 29 May 2022 04:21 IST

మెప్పించే కథలు

కష్టాన్ని నమ్ముకునే సామాన్యుల జీవితాలను హృద్యమైన కథలుగా మలిచిన పుస్తకమిది. పార్కులో తారసపడిన యువతితో స్నేహం పెంచుకుని, ఆమె పాటలోని ప్రేమరాగం వినగలుగుతాడో యువకుడు. ఈ పుస్తకానికి మకుటంగా మారిన ఈ కథను సరళత, క్లుప్తత, ఆకట్టుకునే కథన శిల్పం మెరిపిస్తాయి. కష్టాలూ, అవరోధాలూ ఓ స్త్రీని ధీరగా ఎలా మార్చగలవో ‘శ్రీలక్ష్మి పేరు మార్చుకుంది’లో చిత్రించారు. బాల్య జ్ఞాపకాలు వర్తమానంలోకి ప్రవహించిన ఫీల్‌ గుడ్‌ కథ- ‘హిందీ టీచర్‌’. ‘తీతువుపిట్ట పాట’ కీడుకు కాకుండా శుభానికి ప్రతీకగా నిలిచిన కథ మరొకటి. ఇంటా బయటా హింసకూ, పీడనకూ గురైన స్త్రీలు స్థైర్యంతో ముందడుగు వేయటం చాలా కథల్లో  కనిపిస్తుంది. ‘తోలు బొమ్మలాట’లో జానపద వృద్ధ కళాకారుడు, ‘బుడబుచ్చ కాయలు’లో పిట్టల వేటగాడు విబ్రో గుర్తుండిపోయే పాత్రలు. పశ్చిమగోదావరి ప్రాంత జన జీవితాన్ని కొన్ని కథలు ప్రతిబింబిస్తాయి.

- సీహెచ్‌. వేణు

ప్రేమరాగం వింటావా!
రచన: కుమార్‌ కూనపరాజు
పేజీలు: 160; వెల: రూ. 180/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


కవితా చిత్రాలు!

శిఖామణి పదచిత్రాల కవి. ఆ చిత్రాలు- ఓ బరువైన తాత్వికత నడుమ అలంకరించిన చమ్కీల్లా ఉండవు. ఆ చమ్కీమెరుపుల నడుమే అక్కడక్కడా తాత్వికత కనిపిస్తుంది. ఇది చూడండి- నేలకు రాలిన అల్లనేరేడు పండు/ చితికిన హృదయానికి అంటుకున్న/ ఇసుక రేణువులను ఉఫ్‌ ఉఫ్‌మని ఊదిన/ ఊదారంగు అరచేతులు బాల్యం(మట్టిబొమ్మ కొంగలు)! అసలు ‘నాయనొచ్చాడు’, ‘తెల్లవారుజాము కల’ శీర్షికల కింద ఉన్నవైతే చిక్కటి కవితలుగా మారిన చక్కటి కథలనే అనుకోవాలి. మరి ఆ వస్తువుని కవితగానే ఎందుకు రాశారని ప్రశ్నించేవాళ్లకి ‘కవి ఏమిస్తాడు ఈ లోకానికి/ప్రాణవాయువులాంటి ఓ అమృతవాక్యం తప్ప!’(కవిలేని ఊరు) అని జవాబు చెబుతాడు.

- అంకిత

తెల్లవారుజాము కల(కవిత్వం)
రచన: శిఖామణి
పేజీలు: 124; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మంచితనం కథలు

జీవితానుభవాల నేపథ్యంలో రూపుదిద్దుకుని పాఠకుడిని ఆలోచింపజేసే కథలివి. పనిమనిషి చంద్రమ్మ ఎయిడ్స్‌తో చనిపోతే స్వయంగా వెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడానికి కారణమేమిటో భార్య రుక్మిణి కన్నా కృష్ణమూర్తికే బాగా తెలుసు. అతడి వ్యక్తిత్వంలోని ‘కృష్ణపక్షం’ అది. ఊరొదిలి వెళ్లి కోట్లు సంపాదించిన జయచంద్ర ఆ డబ్బుకి సార్థకతనివ్వాలని సొంతూరు చేరాడు. చిన్ననాటి స్నేహితుడి పేర నిత్యాన్నదానం చేపట్టడం వెనక అతడు నమ్మిన ‘స్నేహధర్మం’ ఉంది. ‘స్పర్శ’, ‘అమ్మకు అటూ ఇటూ’, ‘యశోద కృష్ణ’ కథలు అమ్మప్రేమ ఔన్నత్యాన్ని చాటితే, వృద్ధాశ్రమం నేపథ్యంలో సాగే కథ ‘జారిన మెట్టు’. ప్రతి కథలోనూ ఉదాత్తమైన పాత్రలూ మంచితనమూ మానవత్వాలదే పైచేయిగా కన్పిస్తుంది.

- పద్మ

స్పర్శ (కథాసంపుటి)
రచన: మేడా మస్తాన్‌ రెడ్డి
పేజీలు: 180; వెల: రూ. 180/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


జ్ఞానబోధ

సామాన్యుడూ సాధకుడూ నేర్చుకోవాల్సిన తత్త్వ విషయాల్నీ వేదాంతసారాన్నీ సున్నితంగా, సూటిగా, స్పష్టంగా గ్రహించడానికి అనువైన రీతిలో శంకర భగవత్పాదులు ‘భజగోవిందం’ ద్వారా అందించారు. శంకరాచార్యుల జీవితమూ రచనల గురించి క్లుప్తంగానూ భజగోవిందం శ్లోకాల గురించి వివరంగానూ తెలిపే పుస్తకమిది. వ్యాకరణం వల్లెవేసే ఓ వృద్ధుడిని చూసి ఆయనలోని అజ్ఞానానికి జాలిపడి, ‘మనిషిని చక్రబంధం నుంచి కాపాడేది ఒక్క భగవన్నామమే’ అని ఉపదేశిస్తూ భగవత్పాదులు పదమూడు శ్లోకాలను ఆశువుగా చెప్పారట. అందులో మొదటిదే ‘భజగోవిందం’. మిగిలిన పన్నెండూ ద్వాదశ మంజరికా స్తోత్రంగా పేరొందాయి. పామరుడికి కూడా అర్థమయ్యేలా ఉదాహరణలతో ఈ శ్లోకాలకు వివరణ ఇచ్చారు. పరస్త్రీ వ్యామోహం వల్ల నష్టాలు, ధనం ఎంతవరకూ ముఖ్యం, మనవాళ్లు అనుకునేవాళ్లంతా మన    వాళ్లేనా... లాంటి ఎన్నో విషయాలను ఇందులో వివరించారు.

- శ్రీ

భజగోవిందం (శ్లోకాల మీద వ్యాఖ్యానం)
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి
పేజీలు: 181; వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలుAdvertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts