Sunday Story: గోడలు కూల్చండి!

బాబూరావుగారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టలు వేసుకుని, కళ్ళకి రేబాన్‌ కళ్ళజోడు, చేతిలో రెడ్‌విల్స్‌ సిగరెట్‌ ప్యాకెట్టుతో చాలా దర్పంగా కనబడేవారు.

Updated : 22 Oct 2023 10:06 IST

- జయంతి ప్రకాశ శర్మ

బాబూరావుగారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టలు వేసుకుని, కళ్ళకి రేబాన్‌ కళ్ళజోడు, చేతిలో రెడ్‌విల్స్‌ సిగరెట్‌ ప్యాకెట్టుతో చాలా దర్పంగా కనబడేవారు. ఇప్పుడు... మొహం పీక్కుపోయీ, పొలాలలో కనబడే దిష్టిబొమ్మలా, ఒక్కరే బేలగా మంచం మీద కూర్చున్నారు. అప్పట్లో ఎవరినీ దగ్గరకి రానిచ్చేవారు కాదు, ఇప్పుడు కూడా  పక్కన ఎవ్వరూ లేరు.

‘‘నమస్కారం మావయ్యగారూ, నన్ను గుర్తుపట్టారా?’’ అంటూ ఎదురుగా నిలబడ్డాను.

కళ్ళజోడు సవరించుకుంటూ, లేదన్నట్లు చేతితో సంజ్ఞ చేశారు.

‘‘నేను... విశ్వం... విశ్వనాథాన్ని... కామేశ్వరరావు గారి అబ్బాయిని’’ అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాను.

ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ... ‘‘ఓ... నువ్వా, చాలా మారిపోయావయ్యా, పోల్చుకోలేకపోయా. మీ వాళ్ళందరూ బావున్నారా?’’ అంటూ కూర్చోమని పక్కనే ఉన్న కుర్చీ చూపించారు.‘‘మీరేంటి ఇక్కడా..!?’’ కూర్చుంటూ అన్నాను.

‘‘వయసుతో వస్తాయి కదా, దానికి స్వయంకృతాపరాథాలు కూడా జోడీ కలిసి... ఇక్కడ పడుకోబెట్టాయి’’ బాబూరావుగారి మాటల్లో చిరాకు కంటే ఆయన మీద ఆయనకే కోపం ఉన్నట్టు కనబడింది. గిల్టీగా ఉన్నట్లు- నా మోహంలోకి చూడలేకపోతున్నారు.

‘‘అత్తయ్యగారూ... పిల్లలూ...’’ నా మాటలు పూర్తికాకుండానే...

‘‘ఆవిడా నేనూ ఎక్కడికి వెళ్తాం... క్యాంటీన్‌కి వెళ్ళిందయ్యా, నాకు కాఫీ తేవడానికి. ఇక పిల్లలా...’’ అంటూ ఓ నిట్టూర్పు విడిచారు.

నాకు అర్థమై, ఆ విషయం అడక్కుండా... ‘‘ఇంతకీ మీకు..?’’ సంశయంగా అడిగాను.

‘‘ఆ మధ్య కరోనా వచ్చిందిలే... తర్వాత అప్పుడప్పుడూ ఏదో హడావిడి చేస్తుంటుంది. ఆసుపత్రిలో జాయినై, రోగం తగ్గగానే వెళ్ళిపోవడం అలవాటైపోయింది. మా కంపెనీ- ఉద్యోగులందరికీ గ్రూపు ఇన్సూరెన్స్‌ చేసిందిలే, ఇబ్బంది లేదు’’ అంటూ చిన్నగా నవ్వారు.

‘‘ఓ... అలాగా’’ అన్నాను.

ఈసారి ఆయన బిగ్గరగా నవ్వుతూ ‘‘ఈ గ్లోబల్‌ యుగంలో రోగం వస్తేగానీ, మనుషుల మధ్య దూరం ఎంత పెరిగిపోయిందో తెలియడం లేదు. మిగిలిన ఆ కొద్దిపాటి అభిమానాలు కూడా ఈ మధ్య కాలంలో మంటకలిసిపోయాయి. ఓ రకంగా ఈ గ్రూపు ఇన్సూరెన్సుల వలన మాత్రం మనుషులందరూ భౌతికంగా కలిసినా కలవకపోయినా, అందరూ ఒక కరెంటు తీగ మీద పక్షుల్లా కలిసి కనబడతారు’’ అన్నారు.

ఆయన మాటలు నాకు అర్థమవడానికి అట్టేసేపు పట్టలేదు. భావగర్భితంగా ఓ నవ్వు నవ్వి, ఊరుకున్నాను.

ఆయనకి ఏదో ఙ్ఞాపకం వచ్చి, నావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ‘‘ఇంతకీ మీ అమ్మా నాన్నా... నువ్వూ...  ఇప్పుడూ... ఇక్కడా...’’  ముక్కలు ముక్కలుగా దీర్ఘాలు తీస్తూ అడిగారు.

‘‘మా అమ్మా, నాన్నా బానే ఉన్నారు. అందరం ఒక దగ్గరే ఉన్నాం. ఈ ఊరుకి మీరు తూర్పులో ఉంటే, మేం పశ్చిమంలో ఉన్నాం కదా... మిమ్మల్ని మళ్ళీ కలుసుకోలేకపోయాం. మా ఆఫీసులో పనిచేసే ఒకతనికి ఒంట్లో బాగాలేక, ఇక్కడ జాయిన్‌ అయ్యారు. ఆయన్ని చూడ్డానికి వచ్చాను’’ అంటూ... ‘‘అవునూ... ఇన్సూరెన్స్‌ కంపెనీ వారు రూమ్‌ రెంట్‌ కూడా ఇస్తారు కదా, మీరు సెపరేటు రూము తీసుకుని ఉంటే బావుండేది కదా’’ చుట్టూ చూస్తూ అన్నాను.

ఆ ఆసుపత్రిలో అది జనరల్‌ వార్డ్‌. ఓ పాతిక ముప్ఫైమంది పేషెంట్లు, వాళ్ళ పక్కనే వాళ్ళ మనుషులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.

‘‘ఇప్పటికే మన బతుకులు గోరీ బతుకులు అయిపోయాయి. పెద్ద పెద్ద ఇళ్ళని పడగొట్టి, ఆకాశం అంత ఎత్తు సమాధులు కట్టుకున్నాం. పదిమంది ఉండే స్థలంలో ఇప్పుడు వంద మంది ఉంటున్నాం, కానీ ఏం లాభం... ఎవరి సమాధి వారిది. తలుపులు మూసుకుంటూ బంధాలు తెంపేశాం. ఆ జీవితానికి విసుగెత్తిపోయి, కనీసం ఈ ఆసుపత్రిలోనైనా పదిమంది మధ్య ఉండాలనిపించిందయ్యా’’ నిర్లిప్తంగా, తల దించుకుని అంటున్న బాబూరావుగారి మాటలు వింటూ విస్తుపోయాను.

ఆ మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనబడింది.

బాబూరావుగారి మాటల్లో మార్పు కనబడేసరికి, ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.

* * * * *

విజయనగరం నుంచి మా నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత, బాబూరావుగారి ఇంట్లో మేం అద్దెకి దిగాం. అప్పటికే మా ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళయి, విశాఖపట్నంలోనే స్థిరపడ్డారు. విజయనగరంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో, విశాఖపట్నం బదిలీ వస్తే, మా అమ్మా నాన్నా, ముగ్గురం అన్నదమ్ములం ఆనందంగానే వచ్చేశాం. అప్పటికింకా మా అన్నయ్యలిద్దరూ డిగ్రీలలో ఉంటే, నేను ఇంటర్మీడియట్‌ చదువుతూ ఉండేవాణ్ణి.

రెండంతస్తుల ఆ ఇంట్లో,  పైన బాబూరావుగారూ, ఆయన భార్యా, ఇద్దరు పిల్లలూ ఉండేవారు. మేం కింద వాటాలో అద్దెకి ఉండేవాళ్ళం. రెండు వరసల్లో మూడేసి పెద్ద గదులు, రైలు పెట్టెల్లా ఉండేవి. వెనుక గదిలో వంట చేసుకుని, అందరం అక్కడే కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్ళం. ముందూ వెనుకా పెద్ద పెద్ద వరండాలు, చిన్న పెరడు, చుట్టూ ప్రహరీగోడతో నాలుగు వందల గజాలలో ఆ ఇల్లు విశాలంగా ఉండేది.

తర్వాత ఏడాదిలో మా పెద్దన్న డిగ్రీ అవగానే విశాఖపట్నంలోనే ఉద్యోగం వచ్చింది. మరో ఏడాది తర్వాత మా చిన్నన్నయ్య డిగ్రీ అవగానే ఉద్యోగం వచ్చి, రాజమండ్రి వెళ్ళిపోయాడు.
ఆ ఏడాదే మా పెద్ద అన్నయ్య పెళ్ళి జరిగింది. నేను ఇంటర్‌ అవగానే ఇంజనీరింగ్‌లో చేరాను. నాలుగో సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో, చదువు అవగానే హైదరాబాద్‌ వెళ్ళిపోయాను. నాకు ఉద్యోగం వచ్చేనాటికి మా నాన్నగారు రిటైరయినా, మా పెద్దన్న ఉద్యోగం అక్కడే కావడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయారు. అప్పటికే వాడికి ఇద్దరు పిల్లలు. ఏడాది తేడాలో నాకూ, మా చిన్నన్నయ్యకీ వివాహాలు జరిగిపోయి, మరో నాలుగేళ్ళు గడిచేసరికి ఇద్దరేసి పిల్లలతో, ఎవరి జీవితాల్లో వాళ్ళు పరుగులు పెడుతూ కొంత అసంతృప్తిగానే వేర్వేరు ఊళ్ళలో ఉండిపోయాం.

అదిగో... అప్పుడే అదృష్టవశాత్తూ మా చిన్నన్నయ్యకి ప్రమోషన్‌ వచ్చి తిరిగి పోస్టింగ్‌ విశాఖపట్నంకి వచ్చింది. ఇక నేను హైదరాబాద్‌లో ఉండలేక, ఉద్యోగం రిజైన్‌ చేసి, విశాఖపట్నం వచ్చి, బ్యాంకు లోను తీసుకుని, స్టీల్‌ ప్రాజెక్టు ఏరియాలో, ఓ స్టార్టప్‌ కంపెనీ పెట్టాను. అలా అందరం తిరిగి ఆ ఇంట్లోకే చేరిపోయాం. ఎనిమిది మంది పెద్దవాళ్ళూ, ఆరుగురు చిన్న పిల్లలతో ఇల్లు ఇరుగ్గా ఉన్నా ఆనందంగా సర్దుకుపోయేవాళ్ళం.

ఉన్నట్టుండి ఓ రోజు బాబూరావుగారి భార్య మా ఇంట్లోకి వస్తూ ‘‘కౌరవ కుటుంబంలా ఇంతమంది ఈ ఇంట్లో ఉంటే ఇల్లు పాడైపోతుంది. నీళ్ళు సరిపోవడం లేదు.

ఇల్లు ఖాళీ చెయ్యండి’’ అంటూ అల్టిమేటమ్‌ ఇచ్చి వెళ్ళిపోయింది.

ఆ మాటలు వింటూనే మా నాన్నగారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సాయంత్రం మా నాన్నగారు బాబూరావుగారితో మాట్లాడి, అద్దె పెంచారు. ఆ ఏర్పాటు కూడా ఓ నెలే పనిచేసింది. ఈసారి బాబూరావుగారే వచ్చి... ‘‘అయినా ఈ రోజుల్లో పద్నాలుగు మందికి ఇల్లు అద్దెకివ్వడం మాదే బుద్ది తక్కువ.

మీ గోల భరించలేం... నెల రోజులు టైమిస్తున్నాం, ఈలోగా ఖాళీ చెయ్యండి’’ అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశారు.

వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ‘ఏఁవిటీ గోల’ అంటూ విసుక్కునేవారు. అందరం హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటే వారికి నచ్చేదికాదు. పండగలకి అందరం కలిసి, ఇంట్లో పేకాట ఆడుకుంటుంటే.. ‘ఇది ఇల్లా క్లబ్బా?’ అంటూ గట్టిగా అరిచేవారు.

అసలు... పదిమంది కనబడితే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు.

ఇక గత్యంతరంలేక ఇళ్ళ వేటలో పడ్డ మాకు... నిరాశే ఎదురయింది. అంతమందికి సరిపోయే ఇల్లు దొరకలేదు. ఒకటో రెండో ఉన్నా, ‘పద్నాలుగు మందా’ అంటూ, ఇవ్వమని మొహం మీదే చెప్పేశారు. అప్పుడే కొత్తగా అపార్ట్‌మెంట్లు కడుతుండటంతో, నాలుగైదు గదులతో విశాలంగా ఉండే ఇళ్ళ స్థానంలో అపార్ట్‌మెంట్‌లు వెలిశాయి. ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని చెప్పి, గాజువాక ఏరియాలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఒకే అంతస్తులో మూడు ఫ్లాట్లు తీసుకుని వెళ్ళిపోయాం.

అదిగో ఆ తర్వాత మళ్ళీ బాబూరావుగారిని కలవడం ఇదే.

‘‘ఎవరో గుర్తుపట్టావా!’’ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకి నన్ను చూపిస్తూ అడిగారు బాబూరావుగారు.

ఆవిడ అనుమానంగా నన్ను చూశారు.

‘‘నేను... విశ్వాన్ని అత్తయ్యగారూ.

మీ కింద వాటాలో అద్దెకుండేవాళ్ళం కదా, కామేశ్వరరావుగారి మూడో అబ్బాయిని’’ అంటూ రెండు చేతులు జోడించాను.

‘‘నువ్వా విశ్వం... ఎంత మారిపోయావయ్యా. మిమ్మల్ని చూసి చాలా కాలమైపోయింది. ఏదీ... ఒకే ఊరిలో ఉన్నాం అన్న మాటేగానీ, ప్రపంచం కనబడకుండా నాలుగు గోడలు కట్టేసుకుని, ఆ గోడల మధ్యే జీవితాలు నడుపుతున్నాం. సర్లే, మా సంగతులకేంగానీ, అమ్మా నాన్నా బావున్నారా?’’ అంటూ నా దగ్గరకి కొచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ అడిగారు.

‘‘ఏఁవిటో ఆ రోజులే వేరు. మీ నాన్నగారు అందరూ కలిసి ఉండేలా మిమ్మల్ని పెంచారు. ఎవరి గోరీలు వాళ్ళు కట్టుకుని ఉండేలా మా పిల్లల్ని పెంచాం. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం.’’ బాబూరావుగారి మాటలకు అడ్డొస్తూ... ‘‘సరే సరే... ఎప్పుడూ ఉండే భాగవతమేకానీ... విశ్వం... మీ అమ్మా నాన్నా ఎక్కడున్నారూ? మీ అన్నయ్యలూ అక్కయ్యలూ ఎలా ఉన్నారూ?’’ అంటూ జానకమ్మగారు ప్రశ్నల వర్షం గుప్పించారు.

‘‘అందరం కలిసే ఉన్నాం అత్తయ్యగారూ. ఇక్కడ నుంచి గాజువాక వెళ్ళాం, అక్కడ నుంచి కూర్మన్నపాలెంలో ఒకే అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్లు కొనుక్కుని అందరం అక్కడే ఉన్నాం. అక్కలు కూడా ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు. వాళ్ళూ  బావున్నారు’’ అంటూ అందరి గురించీ చెప్పాను.

‘‘అవునూ ఒక్క విషయం చెప్పూ, అంతమంది కలిసే ఉంటున్నారని అంటున్నావుగా... గొడవలు రావూ’’ అంటూ బాబూరావుగారు నావైపు ప్రశ్నార్థకంగా చూశారు.

‘‘ఎందుకు రావూ... అప్పుడప్పుడూ కాస్తో కూస్తో అభిప్రాయ భేదాలూ పొరపొచ్చాలూ వచ్చినా, వాటికి పెద్ద విలువ ఇవ్వం. సముద్రం ఒడ్డున ఇసుకలో రాసే మాటల్లా... కాసేపటికి అవి కొట్టుకుపోతాయి’’ నవ్వుతూ అన్నాను.

‘‘మరి ఆడవాళ్లో....’’ జానకమ్మగారు అనుమానంగా అడిగారు.

‘‘వాళ్ళూ మామధ్య ఉన్నవాళ్ళే కదా..!’’ అంతకంటే ఎక్కువగా చెబితే స్వోత్కర్షగా ఉంటుందని ఊరుకున్నాను.

‘‘అవున్లే... అదీ నిజమే. ఇదిగో, మీ మావయ్యగారే... పిల్లల్ని అమెరికా పంపేశారు. ఆ ఇంటిని అపార్ట్‌మెంట్లకి ఇచ్చేశారు. చివరికి ఆయన ఆఫీసులో కూడా పక్కవాడితో సంబంధం లేకుండా గోడలు కట్టేసుకున్నారు. ఇంకా ఎవరి గురించి సంపాదించాలనే ప్రశ్న వచ్చినప్పుడు, ఆ ఆఫీసు జంజాటం వదిలించుకుని, సమాధి నుంచి బయటపడ్డాం. కానీ ఏం ప్రయోజనం... బతకడానికి డబ్బులు ఉన్నాయిగానీ, మనుషులే కనబడటం లేదు’’ అంతకంటే మాటలు రాక, కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు జానకమ్మగారు.

‘‘అవునయ్యా, మా తరంవాళ్ళం అన్ని పరిస్థితులూ రుచి చూశాం అంటూ భుజాలు తట్టుకుంటాంగానీ, నిజమైన జీవితాన్ని నష్టపోయింది మా తరమేనయ్యా. ముందుతరాల గురించి ఆలోచించకుండా, అందరికీ ఎక్కువ రెక్కలు ఇచ్చి, మనుషుల మధ్య ఉండవలసిన ఐక్యతాభావాన్ని వేళ్ళతో పీకి పారేశాం.’’ బాబూరావుగారి మాటలు వింటుంటే... మానసికంగా ఎంత బాధపడుతున్నారో అర్థం అయింది నాకు.

టాపిక్‌ మార్చి, మరో ఐదు నిమిషాలు కబుర్లు చెప్పి... ‘‘నాకు మా కంపెనీ మీటింగు ఉంది, వెళ్ళాలి. ఈసారి అందరం కలిసి మీ ఇంటికి వస్తాం. ఈలోగా మీకు ఏ అవసరం ఉన్నా, నాకు ఫోన్‌ చెయ్యండి’’ అంటూ నా విజిటింగు కార్డు ఇచ్చి, అక్కడ్నుంచి వచ్చేశాను. ఆ ఆసుపత్రిలో ఉన్న మా కొలీగ్‌ను చూసి ఆఫీసుకు వచ్చేశాను.

ఆఫీసు మీటింగులో మాట్లాడవలసిన విషయాలని త్వరగా ముగించి, చివర్లో నా ఆలోచనల్ని చెప్పాను.

‘‘మనకున్న ఆఫీసు వాతావరణంలో అందరూ బాగానే పని చేస్తున్నా, మన మధ్య ఉండవలసిన అనుబంధాలు లేవు. ఉదాహరణకి... మన మాధవరావుకి ఒంట్లో బాలేక, వారం రోజుల నుంచీ ఆసుపత్రిలో ఉంటే, ఏ ఒక్కరూ ఆయన్ని చూడ్డానికి వెళ్ళలేదు. ఇది చాలా దురదృష్టం. నిజానికి మన చుట్టూ ఉన్న సమాజమే అలా ఉందిప్పుడు, ఒప్పుకుంటాను. అయితే, మొత్తం సమాజాన్ని మనం సరిదిద్దలేం. కానీ, ఒకే ఆఫీసులో పనిచేసే మన మధ్య కూడా ఉండవలసిన ఐక్యత లేదంటే, మనలో కూడా ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని దిద్దుకోవాలి. ఇందుకు మొదటి మెట్టుగా... మన ఆఫీసులో ఉద్యోగుల మధ్య ఉన్న గోడలన్నింటినీ తీయించేద్దాం. విశాలమైన హాల్లో అందరికీ అందరూ కనబడేలా సీటింగు అరేంజ్‌ చేద్దాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, ఆఫీసు నిండుగా చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారులు కూడా వారి మధ్యే ఉంటారు కనుక, పని తప్పించుకోడానికి మార్గాలు ఉండవు. ఎక్కడో అమెరికావాడు ‘ఆఫీసు అంటే ఇలా ఉండాలని’ చెపితే, మనం గుడ్డిగా అనుసరించి, ఇప్పుడు మన మధ్య దూరాలు పెంచుకున్నాం. ఆ దూరాలు పోవడానికి- ముందు ఈ మార్పుతో శ్రీకారం చుడదాం, మెల్లమెల్లగా మరికొన్ని పద్ధతులూ మార్చుకుందాం. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి’’ అంటూ కొత్త అధ్యాయానికి తెర దించి, మీటింగ్‌ ముగించాను.

సాయంత్రం ఇంటికి వెళ్తుంటే, పదేళ్ళక్రితం ఒకే అంతస్తులో మూడు ఫ్లాట్లు కొని, వాటిమధ్య ఉండే గోడల్ని తీసేసి, ఒకే ఇంటిలా స్వరూపం మార్చి, మేం అందరం కలిసి గృహప్రవేశం చేసిన విషయం ఙ్ఞాపకం వచ్చి తృప్తిగా గాలి పీల్చుకున్నాను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..