Updated : 27 Nov 2022 12:26 IST

అత్తను వృద్ధాశ్రమానికి పంపిన కోడలు అదే ఆశ్రమానికి వస్తే..

- మావూరు విజయలక్ష్మి

‘మలిపొద్దు...’ గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలూ... విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లూ, మామిడి చెట్లూ... మధ్యమధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్‌ మొక్కలూ... వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులూ... వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్‌లాగా బోగన్‌ విల్లా చెట్లూ... అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం... చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్‌ చేస్తూ కొందరూ, చెట్ల కింద ఉన్న సిమెంట్‌ బెంచీల మీద కూర్చుని మరికొందరూ వృద్ధులు సేదతీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ. తొంభై ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ.

కనబడ్డవారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్తా, అమ్మా, వదినా అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడనూ ఆవిడ చలాకీతనాన్నీ చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కిపడింది.
హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా, ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది.

వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా, నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోందొకావిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏదీ తెలియని భావం కనబడుతోంది. ఓ పెద్ద సూట్‌కేస్‌ లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక ముప్పయ్యేళ్ళ యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్‌ బెంచీ, గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనబడతారుగానీ, వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్‌ రూమ్‌ వైపు వెళ్ళిపోయారు. ‘ఇదేంటి వీళ్ళు... వీళ్ళు... ఇక్కడికి వస్తున్నారెందుకు!? ఇక్కడ వీళ్ళకేం పని’ మనసును తొలిచేస్తున్న భావన. వాళ్ళను చూసిన వర్ధనమ్మ మునుపట్లా తోటివాళ్ళతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ‘ఆఁ... ఉఁ...’ అంటూ ఊకొడుతోంది.
ఓ అరగంట ఆఫీస్‌ రూమ్‌లో మాట్లాడిన తరవాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. ‘అంటే... అంటే... అంటే... ఆమె ఇక్కడే ఉంటుందా!? అదేంటి, ఎందుకలా!? ఆమె ఇక్కడుండడమేంటి?’ వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా
రొదపెడుతున్నాయి.

ఆ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలయింది. అందరూ ‘మలిపొద్దు’ వృద్ధాశ్రమంలోని డైనింగ్‌ హాల్లో చేరారు. అందరితోపాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్‌ నిర్వాహకురాలు ‘ఆమె’ను తీసుకువచ్చింది.

‘‘ఈవిడ సుందరిగారు. ఈరోజే మన ఆశ్రమంలో చేరారు. ఇక ఇక్కడే ఉంటారు’’ అందరికీ పరిచయం చేసి, ‘‘ఆ... వర్ధనమ్మ గారూ, సుందరిగారికి మీ రూమే అలాట్‌ చేశాను. ఇకనుంచీ ఆవిడ మీ రూమ్‌లోనే ఉంటారు’’ చెప్పిందావిడ.

అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్ళ వాన కొట్టినట్టయింది. ‘‘అదేంటి ఈవిడ... ఈవిడ ఇక్కడుందేవిటి..!?’’ సుందరికి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్‌ని పట్టుకుంది ఆసరా కోసం.

‘‘వెళ్ళండి, అక్కడ కూర్చోండి. అందరూ మీ తోటివారే. ఎలాంటి మొహమాటాలూ లేకుండా హాయిగా ఉండండి’’ వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్లిపోయిందావిడ.

నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తలవంచుకుంది. ‘‘అదీ... మరీ... అదేంటంటే... మీరు... ఇక్కడ..?’’ ఏదో చెప్పబోయింది.

‘‘ముందు భోజనం చెయ్యి సుందరీ... గదికెళ్ళిన తరవాత మాట్లాడుకుందాం’’ నెమ్మదిగా చెప్పి భోజనం చెయ్యడం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి, తనూ భోజనం చెయ్యడంలో పడింది సుందరి.

ఇద్దరూ భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోనే కాసేపు అటూ ఇటూ వాకింగ్‌ చేసి, వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికెదురుగానే ఉన్న తన మంచంమీద తలవంచుకొని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతోంది.
నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ‘‘ఆ... ఇప్పుడు చెప్పు సుందరీ...’’ అంది.

‘‘మీరు... ఇక్కడికి... ఎలా..?’’
తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతోంది సుందరి.

వర్ధనమ్మకు, ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమయింది. చిన్నగా నవ్వి చెప్పింది. ‘‘నీ అనుమానం నాకర్థమయింది. పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికెలా వచ్చాననే కదా!’’

‘‘ఊఁ...’’
‘‘ఆ ఆశ్రమంవారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు. పైగా ఇక్కడయితే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం. అది సరే, నీ విషయమేంటి? ఏమయింది... నువ్విక్కడ..!?’’ అర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ.

‘‘అదే... అబ్బాయికి యూఎస్‌లో జాబ్‌ వచ్చింది. కోడల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా, ముందే తన దారి తను చూసుకొని ఏ బాదరబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా...

అందుకే... నన్ను... నన్ను... ఇక్కడ...’’ మాటలు పూర్తి చేయలేకపోతోంది సుందరి.

‘భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్నూ తీసుకుపోవచ్చుగా’ ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు. మనసులో అనుకుంది. బయటకు మాత్రం ‘‘ఓ... అవునా!’’ అంది.

ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి... ‘‘అబ్బాయి తనతోపాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యూఎస్‌ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్ళికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని- ఆ అమ్మాయీ, తనతోపాటు నా కొడుకూ కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట.

‘మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా’ అంది కోడలు. పోనీ నా కాళ్ళూ చేతులూ బాగానే ఆడుతున్నాయి కదా... సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయంలేదని చెప్పాను. ‘కానీ, ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం... ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు, వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు... నీ తోటివారి మధ్యలో అయితే నీకూ కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది’ అన్నారు కొడుకూ కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడయిపోతుందనీ, అదీకాక మంచి రేటు వస్తుందనీ ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు’’ వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు పదేళ్ళక్రితంనాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయిందావిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకూ మూలం ఒక్కటే, కేంద్రం ఒక్కటే, నేపథ్యం ఒక్కటే, వేదిక ఒక్కటే! అందుకే ఇద్దరి ఆలోచనలూ
ఒక్క దగ్గరకే వెళ్ళి చేరాయి.

* * *

గతం కళ్ళముందు తెర కట్టింది వర్ధనమ్మకు. రావడం రావడమే అత్తన్నా...
అత్తిల్లన్నా... ఒక వ్యతిరేకభావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజు రోజుకూ పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో... అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు.

హు..! అయినా అర్థం కాకపోవడానికేముంది..! నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక, అగ్నికి ఆజ్యం తోడయినట్టయింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతాభావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో, కోడలిని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అన్న దుర్భుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చెయ్యాలన్న కుతంత్రంతో, ఆడపిల్లను ఓ పధ్ధతీ పాడూ లేకుండా పెంచారనీ, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారనీ కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగుకు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరయిపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికీ తనకూ మధ్య దూరం పెంచుకోవడమే కాదు పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది. అది ఎంతవరకూ వెళ్ళిందంటే చివరకు...

చివరకు... తన ముఖం చూడడానికే అసహ్యించుకునే స్థితికొచ్చేసింది కోడలు. ఫలితం... తను ఇక్కడికి చేరుకోవడం.

* * *

తన చేతిమీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకొచ్చింది వర్ధనమ్మ. తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని తనవైపే ఆర్తిగా చూస్తోంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్ళు.

నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి.
‘‘అరె, ఏమయింది సుందరీ... ఎందుకేడుస్తున్నావు?’’ ఆమె కళ్ళలో నీళ్ళు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ.

‘‘నేను... నేను... చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా?’’ రుద్ధమయిన కంఠంతో అంది సుందరి. ఆమె రెండు కళ్ళలో నుంచి గంగా యమునల్లా
నీటిధారలు స్రవిస్తూనే ఉన్నాయి.
‘‘ఊరుకో... ఊరుకో... ఏం చేస్తాం... పరిస్థితులలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా... నువ్వొక్కదానివి చేసిందేం ఉంది’’ ఇంకేం చెప్పాలో
అర్థం కాలేదు వర్ధనమ్మకు.

‘‘లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది. అందుకే అంటారు ‘బుద్ధి కర్మానుసారిణి’ అని. నా బుద్ధి సరిగాలేకే నాకీ పరిస్థితి వచ్చింది.’’
‘‘సుందరీ, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా, నా పాత్ర ఏం లేదా?
నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన
వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేంటి... ఇద్దరమూ ఇద్దరమే. సర్లే,
జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకీ పొరపాట్లకీ... మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరికే చేరాం కదా’’ దీర్ఘంగా
నిట్టూర్చింది వర్ధనమ్మ.
‘‘లేదు, లేదత్తయ్యా... నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురయింది.
నన్ను... నన్ను క్షమించండత్తయ్యా...’’ ఇక ఆగలేనట్టు, సంకోచాలూ భేషజాలన్నీ వదిలిపెట్టి, మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది సుందరి.
‘హుఁ... ఎంత చిత్రం... ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే
ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడమంతే ఇదేనన్నమాట’ కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు