Updated : 04 Dec 2022 14:38 IST

భర్తకు చనిపోయిన భార్య ఫోన్ చేస్తే.. ఏంటా ‘మిస్టరీ’

- విజయార్కె

టీవీలో ‘జగమేమాయ’ ఓల్డ్‌ మూవీ వస్తోంది. దాదాపు యాభై సంవత్సరాల కిందటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా.

అలివేణి భయపడుతూనే సినిమా చూస్తోంది. ‘నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను’ అని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి మరింత భయమేసింది.

వంటింట్లో అటక మీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావడం... చనిపోయిన పనిమనిషి ఇంట్లో దెయ్యంగా ఉండటం... అందులోనూ అలివేణి ఒంటరిగా చూస్తుండటంతో భయం రెట్టింపు అయింది.

అలివేణి కాపురానికి హైదరాబాద్‌ వచ్చింది. అలివేణి భర్త మానస్‌ ఓ కార్పొరేట్‌ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఏరికోరి పల్లెటూరి అమ్మాయిని, అదీ బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.

ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే, తెలిసిన బంధువుల ద్వారా కాణీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటానని ముందుకువచ్చి పెళ్ళి చేసుకున్నాడు మానస్‌. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు.

అపార్ట్‌మెంట్‌ వాతావరణం కొత్త. అందులోనూ అడుగు బయటపెట్టే అలవాటు లేదు. అపార్ట్‌మెంట్‌లో ఎవరూ అలా బయటకు తొంగి చూడరు. భర్త ఆఫీసుకు వెళ్ళగానే తలుపులు వేసుకుని పని చేసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీసు నుంచి లేటుగా రావడంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి.

తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది. వాట్సాప్‌ వాసనలు ఇంకా తగల్లేదు. ఫేస్‌బుక్‌ అంటే నోట్‌బుక్‌ అనుకుంటుంది.

*      *      * 

అలివేణికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నిజాలు- అని కూడా తెలియని అమాయకత్వం.

ఎవరో తనను వెంటాడుతున్నట్టూ ఎవరో ఈ ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్టూ అనిపిస్తోంది.  

ఈలోగా ‘అలివేణీ’ అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్‌ గొంతు అది. ఆ గొంతు తన పడగ్గదిలో నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆఫీసు పనిమీద వేరే ఊరు వెళ్ళిన భర్త పడగ్గదిలో ఎలా ఉంటాడు?

పడగ్గదిలోకి పరుగెత్తింది. పడగ్గది అంతా గాలించింది. ఈసారి హాలులో నుంచి మరికాస్త గట్టిగా వినిపించింది ‘అలివేణీ ఎక్కడున్నావ్‌?’ అంటూ. హాలులోకి పరుగెత్తింది. అక్కడెవరూ లేరు. టీవీలో- దెయ్యం రూపంలో ఉన్న పనిమనిషి భయపెడుతున్న సన్నివేశం. వెంటనే భయంతో టీవీ కట్టేసింది.

ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇరుగుపొరుగుతో పరిచయం లేదు. ఎవరికీ పలకరించే తీరికా లేదు.

వెంటనే భర్తకు ఫోన్‌ చేద్దామని ఫోన్‌ కోసం టీవీ ముందున్న టీపాయ్‌ దగ్గరికి వెళ్ళేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్‌ అయింది. ఛానెల్స్‌ వాటంతటవే మారుతున్నాయి. అలివేణి గొంతు తడారిపోయింది. మొహమంతా చెమట్లు.

ఇంగ్లిష్‌ ఛానెల్‌లో ‘ఈవిల్‌ డెడ్‌’ సినిమా వస్తోంది. దెయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది. వాయిస్‌ పెరిగింది. ఇంగ్లిష్‌ అర్థం కాకపోయినా సౌండ్‌కు భయం వేసింది. భయంతో పడగ్గదిలోకి పరుగెత్తింది ఫోన్‌ పట్టుకుని.

అందులో ఉండే ఒకే ఒక నంబర్‌ భర్తది. తనకు ఎలా ఫోన్‌ చేయాలో, ఏ బటన్‌ నొక్కాలో చెప్పాడు. అది స్మార్ట్‌ఫోన్‌ కూడా కాదు. పాతకాలం నాటి ఫోన్‌.

అటువైపు నుంచి భర్త మానస్‌ ఫోన్‌ ఆన్సర్‌ చేశాడు. ‘‘ఏంటి అలివేణీ... ఈ టైమ్‌లో ఫోన్‌ చేశావు?’’ అని అడిగాడు. అతని గొంతులో ఆదుర్దా వినిపిస్తోంది.

‘‘నాకు... నాకు... భయం వేస్తోందండీ. ఇందాక ఎవరో మీ గొంతుతోనే ‘అలివేణీ’ అని నన్ను పిలిచారండీ’’ భయంగా చెప్పింది.

అటువైపు నుంచి మానస్‌ నవ్వాడు. ‘‘నువ్వు దెయ్యం సినిమాలు చూడటం తగ్గించు... నేను రెండు రోజుల్లో వచ్చేస్తానుగా’’ అన్నాడు అనునయంగా.

‘‘నాకు చాలా భయంగా ఉందండీ. ఇందాక టీవీ దానంతటదే ఆన్‌ అయింది. ఏదో దెయ్యం సినిమా వచ్చింది. సౌండ్‌ కూడా పెద్దగా, కావాలంటే మీరే వినండి’’ అంటూ హాల్లోకి వచ్చింది ఆ సౌండ్‌ భర్తకు వినిపించడానికి. టీవీ ఆఫ్‌ అయింది.

‘‘అరె, ఇందాక వచ్చిందండీ’’ అంది అలివేణి.

‘‘అంతా నీ భ్రమ. ప్రశాంతంగా నిద్రపో’’ చెప్పాడు మానస్‌.

అయిష్టంగా భయంగానే ఫోన్‌ పెట్టేసింది. దుప్పటి నిండా కప్పుకుని నిద్రపోయింది.

*      *      * 

ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఫ్యాన్‌ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు. కరెంట్‌ పోయిందనుకుంది. కానీ బెడ్‌ల్యాంప్‌ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్‌ తిరగకపోవడం ఏమిటి? ఉక్కపోతా భయమూ రెండూ కలగలిశాయి. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది.

ఈ టైమ్‌లో భర్తకు ఫోన్‌ చేస్తే ఏమనుకుంటాడో... అప్పుడే బెడ్‌ ల్యాంప్‌ ఆరిపోయింది. మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్‌ నుంచి రెడ్‌ కలర్‌కూ, తర్వాత ఎల్లో కలర్‌కూ అలా వెంటవెంటనే రంగులు మారుతున్నాయి. ఫ్యాన్‌ సడెన్‌గా ఫుల్‌ స్పీడ్‌తో తిరుగుతోంది.

ఒక్క ఉదుటన లేచి బయటకు పరుగెత్తింది. పక్క ఫ్లాట్‌ వాళ్ళ తలుపు బాదింది భయంగా.

వాళ్ళు లేచి వచ్చారు. వాళ్ళకు విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటూనే లోపలికి వచ్చి చూశారు. ఫ్యాన్‌ తిరుగుతోంది, బెడ్‌ల్యాంప్‌ వెలుగుతోంది.

‘ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసి ఉంటుంది. అంతా నీ భ్రమ’ అన్నారుగానీ, ‘మా ఇంట్లోకి వచ్చి పడుకో’ అని అనలేకపోయారు. ఇరుగు పొరుగు... సాయం చేయాలనే తత్త్వం కనుమరుగైంది.

అలివేణికి ఆ రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది.

*      *      * 

రెండు రోజుల్లో వస్తానన్న మానస్‌ మరుసటిరోజే తెల్లారగానే రావడంతో ఊపిరి పీల్చుకుంది. భర్తను గట్టిగా వాటేసుకుని బావురుమంది.

*      *      * 

అలివేణి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతోంది.

స్నానం చేయడానికి వెళ్ళింది. అలివేణికి చన్నీళ్ళ స్నానం అలవాటు. షవర్‌ ఆన్‌ చేయగానే వేడినీళ్ళు పొగలు కక్కుతూ వచ్చాయి. ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరుగెత్తుకొచ్చింది.

గీజర్‌ తను ‘ఆన్‌’ చేయలేదని చెప్పింది.

‘‘నువ్వే ఆన్‌ చేసి మర్చిపోయి ఉంటావులే’’ అన్నాడు మానస్‌. గీజర్‌ ఆన్‌ చేయాలంటే భయం... ఫోబియాగా మారింది. బకెట్‌లో చన్నీళ్ళు పోసుకుని స్నానం చేయడం అలవాటు చేసుకుంది.

*      *      * 

కొన్నిరోజుల్లోనే బరువు తగ్గింది, రకరకాల భ్రాంతులు. నిజమో భ్రాంతో అర్థంకాని పరిస్థితి. చుట్టుపక్కల ఫ్లాట్స్‌ వాళ్ళకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేణికి మతిస్థిమితం లేదనే వరకూ వచ్చింది.

*      *      * 

సైకియాట్రిస్ట్‌ అలివేణి వంక పరిశీలనగా చూశాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెబుతోంది- లైట్లు వెలిగి ఆరిపోవడం... సడెన్‌గా భర్త గొంతు వినిపించడం... టీవీ ఛానెల్స్‌ వాటంతటవే మారడం... వేడి నీళ్ళు... ఇలా ఒక్కో విషయం చెబుతోంది. మానస్‌ ఆఫీసుకు కూడా ఈ విషయం చేరింది. ఒక్కొక్కరూ ఓదార్పు మొదలుపెట్టారు. ఈ విషయం అలివేణిని మరింత కుంగదీసింది. తనను అందరూ పిచ్చిదానిలా చూడటం భరించలేకపోయింది.

‘‘సారీ మిస్టర్‌ మానస్‌. మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు. ఆలా అని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను’’ అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్ట్‌. మానస్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీసుకు వెళ్ళినా వెంటనే తిరిగొస్తున్నాడు. ఇదంతా అలివేణీ గమనిస్తూనే ఉంది.

‘పాపం పిచ్చిదాని కోసం, భర్త ఉద్యోగాన్ని వదులుకుని ఉండాల్సి వస్తోంది’ అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి.

‘‘అలివేణీ, నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకుని ఏ అఘాయిత్యం  చేసుకోకు. కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్‌మెంట్‌ చేయిస్తాను’’ పరోక్షంగా ‘పిచ్చాసుపత్రిలో’ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు.

ఒకసారి మానసికంగా బలహీనం అయితే, తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి.

ఫలితంగా అలివేణి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది... ‘తన చావుకు తనే కారణం’ అని రాసిపెట్టి మరీ.

*      *      * 

పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వయిరీ చేశారు.

సైకియాట్రిస్ట్‌ను కలిశారు. అందరూ జరిగిన విషయం చెప్పారు. ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది. హత్య అని చెప్పడానికి, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.  ఇది జరిగిన నలభై ఎనిమిది గంటల తర్వాత...

*      *      * 

డిటెక్టివ్‌ నిశ్చల్‌ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది.

‘‘ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి, అది ‘హత్యా ఆత్మహత్యా’ అన్నది తేల్చాలి. ఇదిగోండి... కేసుకు సంబంధించిన వివరాలు, ఫొటో, మీ ఫీజు అడ్వాన్స్‌...’’ ఆ యువతి ఓ కవర్‌ అందజేసింది.

కవర్‌లోని డబ్బును పక్కన పెట్టి, కేసు వివరాలు చూసి, అందులో ఉన్న ఫొటోని చూశాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు.

‘‘మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి, మీరు ‘ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేయబడ్డారా’ అన్న విషయం తేల్చాలా?’’ నవ్వుతూ అడిగాడు ఆ కేసును టేకప్‌ చేస్తూ.

*      *      * 

అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు నిశ్చల్‌. మానస్‌ ఉండే మూడవ అంతస్తుకు వచ్చి, చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వయిరీ చేశాడు. వాచ్‌మెన్‌ని కలిశాడు. మానస్‌ను మాత్రం కలవలేదు. సైకియాట్రిస్ట్‌ను కూడా కలిశాడు.

మానస్‌ భార్య చనిపోయాక శవాన్ని మార్చురీలో నుంచి తీసుకెళ్ళి దహనం చేశాక, తిరిగి ఫ్లాట్‌కు రాలేదని తెలిసింది.

ఆ రాత్రి మానస్‌ ఫ్లాట్‌కు వచ్చాడు నిశ్చల్‌. ఆ ఫ్లాట్‌ తాళం తీయడం నిశ్చల్‌ లాంటి డిటెక్టివ్‌కు పెద్ద కష్టమైన విషయం కాదు. వాచ్‌మెన్‌ సహాయం తీసుకున్నాడు... అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి.

సరిగ్గా ముప్పై నిమిషాల తర్వాత డిటెక్టివ్‌ నిశ్చల్‌ బయటకు వచ్చాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌లా ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు.

*      *      * 

మానస్‌ ఫ్లాట్‌ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్‌ క్లోజ్‌ చేసి హాల్లో ఉన్న అలివేణి ఫొటో వైపు చూశాడు. ఆమె ఫొటోకు దండ వేలాడుతోంది. పడగ్గదిలోకి వెళ్ళాడు. మంచం పక్కనే తనూ అలివేణీ దిగిన ఫొటో. ఆ ఫొటోని బోర్లా పడుకోబెట్టాడు.

వెల్లకిలా పడుకుని సీలింగ్‌ ఫ్యాన్‌ వైపు చూశాడు. చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నాడు. దానికి కారణం- భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవడం కాదు.... చనిపోయిన భార్య తనకు ఫోన్‌ చేయడం.

రెండు గంటల క్రితం తను బార్‌ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్‌కాల్‌!

*      *      * 

మానస్‌ బార్‌ నుంచి బయలుదేరి అయిదు నిమిషాలు అయింది. మెయిన్‌ రోడ్డు మీద పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తారని, అడ్డదారిలో మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాడు. అప్పుడే అతని మొబైల్‌ రింగ్‌ అయింది.

‘‘ఎక్కడున్నారండీ, నాకు ఇంట్లో ఒక్కర్తినే ఉండాలంటే భయం వేస్తోంది’’ అన్న మాటలు విని షాక్‌తో సడెన్‌ బ్రేక్‌ వేశాడు. తాగిన మత్తు వదిలింది. భయం తాలూకు మత్తు మొదలైంది. ఆ గొంతు తన భార్య అలివేణిదే. అడ్డదారి కాబట్టి బతికిపోయాడు. లేకపోతే సడెన్‌ బ్రేక్‌ వేసినందుకు యాక్సిడెంట్‌ జరిగేది.

‘‘ఎ... ఎ... ఎవర్నువ్వు..?’’ గొంతు పెగుల్చుకుని మరీ అడిగాడు.

‘‘నేనండీ, మీ అలివేణిని. అయినా మెయిన్‌ రోడ్డు మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారు. మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడే నన్ను దహనం చేశారు.’’

ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్‌. తను ఆ విషయాన్ని మరచిపోయాడు. అయినా తను ఈ దారిలో వెళ్తున్నట్టు అలివేణికి ఎలా తెలుసు? ఛ... ఛ... అలివేణి చనిపోయిందిగా!?

తల దిమ్ముగా అనిపించింది. కారును వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్‌ మిస్టరీ తేలాలంటే- ఇప్పుడు తను అర్జెంట్‌గా ఆ రూట్‌లోనే వెళ్ళాలి... తన భార్యను దహనం చేసిన చోటికి. కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయంకన్నా ప్రమాదకరమైన టెన్షన్‌. భార్యను దహనం చేసిన చోటుకు వెళ్ళాడు. ఇంకా అక్కడ బూడిద కనిపిస్తోంది.

ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి. ఒళ్ళు జలదరించినట్టయింది. వేగంగా వెనక్కి తిరిగి వచ్చి, కారులో కూర్చుని కారు స్టార్ట్‌ చేసి యథాలాపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ అలివేణి నిలబడి తన వైపే చూస్తోంది. కుడిపాదం యాక్సిలేటర్‌ మీద బలంగా పడింది.

*      *      * 

ఈ పిచ్చి ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి... బాత్‌రూమ్‌లోకి నడిచాడు.

షవర్‌ తిప్పాడు. ఊహించని విధంగా వేడి నీళ్ళు మరుగుతూ... గీజర్‌ పాయింట్‌ దగ్గర రెడ్‌ లైట్‌. గీజర్‌ ఎవరు వేశారు? వెంటనే పడగ్గదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. ఫ్యాన్‌ స్పీడ్‌గా తిరుగుతూనే ఉంది.

మొదటిసారి అతనికి భయం పరిచయమైంది. ఇన్నాళ్ళూ భయపెట్టిన అతనికి భయం మొదలైంది.

వెంటనే హాలులోకి పరుగెత్తుకు వచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్‌ లైట్‌ ఆన్‌ చేశాడు. స్టూలు వేసుకుని పుస్తకాల ర్యాక్‌ మీద ఉన్న రిమోట్‌ కోసం చూశాడు. చేతికి తగల్లేదు. ‘యూ ఫూల్‌...’ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరోచోటు నుంచి వెంటనే హారర్‌ మ్యూజిక్‌... లైట్లు వెలుగుతూ ఆరుతూ... డోర్‌ బెల్‌ వినిపించింది. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది, తను తలుపు తీయకుండానే.

ఒక్కసారిగా లైట్లు వెలిగాయి.

ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి, అతని పక్కనే తన భార్య అలివేణి. కానీ తన భార్యలా చీరకట్టులో లేదు, జీన్స్‌లో ఉంది.

‘‘మీరు వెతుకుతున్న రిమోట్‌ అక్కడ లేదు మిస్టర్‌ మానస్‌. మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వచ్చారు. బై ది బై నా పేరు నిశ్చల్‌... డిటెక్టివ్‌  నిశ్చల్‌.

బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యను వదిలించుకోవడానికి మైండ్‌ గేమ్‌ మొదలుపెట్టావ్‌. మానవాళికి మంచి చేయడానికీ, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికీ కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికీ నేరానికీ వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్నీ టెక్నాలజీ పట్ల నాలెడ్జీ లేకపోవడాన్నీ ఆసరాగా చేసుకుని, ఆమెకు తెలియకుండా స్మార్ట్‌ గాడ్జెట్స్‌ ఉపయోగించావు. వాటి సహాయంతో ఆమెను భయభ్రాంతులకు గురి చేశావు. టీవీ ఆన్‌ అవ్వడం, షవర్‌ ద్వారా మరిగే నీళ్ళు రావడం,. ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చేసి మాట్లాడటం, లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం చేశావు. చుట్టుపక్కల వాళ్ళను సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ఫ్లాట్‌కు వచ్చి చూసినప్పుడే అర్థమైంది. అదే టెక్నాలజీతో నీ కారును ట్రాక్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శ్మశానంలోనూ ఇక్కడా కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు- నిజం... నీ మరణ శాసనం.

టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి- అంటే, అలివేణి సోదరి నీలవేణి- నిన్ను పట్టించింది .

అలివేణీ, నీలవేణీ అక్కాచెల్లెళ్ళు. పేదరికం కారణంగా ట్విన్స్‌లో ఒకరైన, ఈ నీలవేణిని అమెరికాలోని దంపతులకు దత్తత ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఇరవై ఏళ్ళ తర్వాత తన సోదరిని వెతుకుతున్న నీలవేణి, ఫేస్‌బుక్‌లో తన ప్రొఫైల్‌ పిక్‌ను పోలిన- అలివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన- ఫొటో చూసి, చెల్లి ఆత్మహత్య పూర్వాపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది.

ఒక మనిషిని చంపడంకన్నా, ఆ మనిషిని మానసికంగా టార్చర్‌ చేసి, చనిపోయేలా చేయడం పెద్ద నేరం. నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది’’ చెప్పాడు డిటెక్టివ్‌ నిశ్చల్‌.

పోలీసులు వచ్చారు. మానస్‌కు సంకెళ్ళు వేసి తీసుకువెళ్ళారు.

*      *      * 

‘‘సారీ నీలవేణీ. మీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను కానీ, మీ సిస్టర్‌ని కాపాడలేకపోయాను’’ అన్నాడు డిటెక్టివ్‌ నిశ్చల్‌.

‘‘తనను కళ్ళారా చూడకపోయినా, ‘తన మరణానికి కారణం అయిన నేరస్థుడిని చట్టానికి పట్టించాను’ అనే తృప్తి మిగిలింది. అందుకు మీకు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి’’ ఫ్లైట్‌ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి.

‘‘ఆప్‌లూ టెక్నాలజీని మన రక్షణకు తోడుగా ఉండడానికి ఉపయోగించుకోవాలి. మనకు ఉపయోగపడే ఆప్‌ల గురించీ టెక్నాలజీ గురించీ... కనీస పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు’’ చెప్పాడు డిటెక్టివ్‌ నిశ్చల్‌.

*      *      * 

(టెక్నాలజీ గురించీ, మనకు పనికొచ్చే ఆప్‌ల గురించీ ప్రతి ఒక్కరూ అవేర్‌నెస్‌ కలిగి ఉండాలన్న ఆలోచనే ఈ కథ).


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..