‘ఎలాగైనా నువ్వే కరెక్ట్‌ డాడీ’ అనిపించాలనుకున్న కన్నతండ్రి పంతం నెగ్గిందా?

‘‘నాన్నా, నాకు కింద పన్ను కదులుతోంది. కాస్త భయమేస్తోంది- ఊడినపుడు నొప్పిగా ఉంటుందేమోనని. ఇవాళో రేపో ఊడిందంటే, రాత్రికి దాన్ని దిండు కింద పెట్టేస్తాను.

Updated : 15 Jan 2023 08:48 IST

‘ఎలాగైనా నువ్వే కరెక్ట్‌ డాడీ’ అనిపించాలనుకున్న కన్నతండ్రి పంతం నెగ్గిందా?

- నిరుపమ రావినూతల

‘‘నాన్నా, నాకు కింద పన్ను కదులుతోంది. కాస్త భయమేస్తోంది- ఊడినపుడు నొప్పిగా ఉంటుందేమోనని. ఇవాళో రేపో ఊడిందంటే, రాత్రికి దాన్ని దిండు కింద పెట్టేస్తాను. అప్పుడు టూత్‌ ఫెయిరీ వచ్చి ఊడిన పన్ను తీసుకుని, బదులుగా నాకు డబ్బులిస్తుంది. ఇంకా నొప్పి కూడా లేకుండా చేస్తుందట. బుద్ధిగా ఉంటే, ఊడిన చోట ఇంకో కొత్త పన్ను మొలిచేలా కూడా చేస్తుందట. ఎదురింటి హరిగాడికి మొన్న 10 రూపీస్‌ ఇచ్చిందంట ఫెయిరీ. నాకెంతిస్తుందో!! వాటితో బోల్డన్ని చాక్లెట్స్‌ కొనుక్కోవాలి. అందులో కొన్ని నీకూ అమ్మకీ ఇస్తాను. అమ్మెప్పుడూ నన్ను ‘గుడ్‌ బాయ్‌’ అంటుంది. గుడ్‌ బాయిస్‌కి ఫెయిరీ ఇంకొంచెం ఎక్కువిస్తుందేమో కదా నాన్నా! వాట్‌ డు యు థింక్‌? ఇంకా మంచిగా ఉంటే బొమ్మలు కూడా ఇస్తుందేమో కదా నాన్నా?’’

ఇలా ఆరేళ్ళ నా కొడుకు ‘విహారి’ ఊహల్లో విహరించేస్తున్నాడు. సార్థక నామధేయుడు! ఈ మధ్యనే స్కూలుకెళ్ళటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉండే తన స్నేహితుల నుండి రోజుకో కొత్త సంగతి తెల్సుకుంటున్నాడు. పాలపళ్ళు మొదటిసారి ఊడేటప్పుడు చిన్న పిల్లలు భయపడకుండా ఉండటానికీ నొప్పిని మరిపించటానికీ ఈమధ్య తల్లిదండ్రులు కనిపెట్టిన ఉపాయమే ఈ టూత్‌ ఫెయిరీ. ఊడిన పళ్ళకి బదులు డబ్బులో, బొమ్మలో, తినుబండారాలో వాళ్ళే పెట్టి, ఒక దేవత ఇవన్నీ ఇచ్చిందని చిన్న పిల్లలను మభ్యపెట్టటం.

ప్రతిరోజూ పళ్ళు తోముకునేటప్పుడు ఆ ఊగే పంటిని చూసుకోవటం, దాన్ని ఇంకాస్త అటూఇటూ కదిలించి చూడటం... ఇవాళో రేపో ఎగురుకుంటూ టూత్‌ ఫెయిరీ మా ఇంటికి వచ్చి వాడిని సత్కరించటమే తరువాయి అన్నట్టు సాగుతున్నాయి వాడి ఆలోచనలు. ఒక శుభోదయాన పన్ను ఊడి, వాడి చేతికి రానే వచ్చింది. వాడికే గనక పాటలు వచ్చుంటే ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే’ అని పాడుకునేవాడేమో. పన్ను ఊడిన చోట కాస్త నొప్పిగా ఉన్నా కూడా, రాబోయే విశిష్ట అతిథి ఫెయిరీనీ, ఆవిడ ఇస్తుందనుకుంటున్న బహుమతుల్నీ తల్చుకుంటూ నొప్పి మర్చిపోయాడు నా సుపుత్రుడు. పట్టరాని సంతోషంతో, మతాబులా వెలుగుతున్న మొహంతో గంతులేస్తూ ఊడిన పంటిని దిండుకింద పెట్టుకుని వచ్చాడు.

పాల పళ్ళు ఊడితే మట్టిలో గొయ్యితీసి కప్పెట్టటమే తెల్సు తప్ప, ఈ ఫెయిరీలూ అవి డబ్బులివ్వటాలూ ఎరగను నేను నా చిన్నతనాన. నేనో ప్రాక్టికల్‌ మనిషిని. ఊహల్లో ఆశపడటాలూ ఫాంటసీలూ నాకు నచ్చవు. మనసూ మట్టిగడ్డా అని కాకుండా ప్రతి విషయాన్నీ తార్కికంగా మెదడుతో ఆలోచించటం చిన్నప్పట్నుంచీ అలవాటు నాకు. చిన్నతనంలో నా స్నేహితులంతా పుస్తకాల్లో ఒక నెమలీక పెట్టి, ప్రతిరోజూ పెన్సిల్‌ పొట్టును దానికి ఆహారం అని పెట్టేవారు. అలా వారం రోజులు చేస్తే, ఆ నెమలీక, పిల్ల నెమలీకలు పెడుతుందని నమ్మేవాళ్ళు. నేనది నమ్మకపోగా, చెప్పినా వినిపించుకోని వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకునేవాడిని. నా మేధాసంపత్తితో సరిపోలేవాళ్ళెవరూ లేకపోవటం వల్ల నాకు పెద్దగా స్నేహితులు కూడా ఉండేవాళ్ళు కాదు చిన్నతనాన. నాకు నేను ప్రాక్టికల్‌గా ఆలోచించే మేధావినని గొప్ప నమ్మకం. అలాంటి నా కడుపున పుట్టిన నా కొడుకు ఇలా స్నేహితులు చెప్పారనీ టూత్‌ ఫెయిరీ వస్తుందనీ డబ్బులిస్తుందనీ చెప్తే నమ్మేసేంత వెర్రిబాగులవాడిగా పెరుగుతున్నాడని అసహనంగా ఉంది. ఇహ ఇలా మెత్తగా ఉంటే కుదరదు. నిజమేదో, కల్పనేదో వాడికి ఇప్పుడే చెప్పాలి. మొక్కగా ఉన్నప్పుడే మార్చాలి.

వాడి ఊహలకి కళ్ళెం వేసే సమయమిదేనని వాడిని పిలిచి ‘‘విహారి కన్నా, టూత్‌ ఫెయిరీ అంటూ ఎవరూ ఉండరు. నేనో, అమ్మో దిండు కింద డబ్బులు పెట్టాలి. అంతేతప్ప, నిజంగా ఫెయిరీ ఎవరూ రారు నీకు డబ్బులు ఇవ్వటానికి’’ ...కాస్త అనునయంగా చెప్పాను.

వాడి భృకుటి ముడిపడింది. అపనమ్మకంగా చూశాడు నా వైపు. ‘‘కాదు నాన్నా, నువ్వు అబద్ధం చెబుతున్నావు. మొన్న హరిగాడికి ఇచ్చిందట. నా ఇంకో ఫ్రెండు పింకీకి 5 రూపీస్‌ ఇచ్చిందట. పింకీ బాగా అల్లరి చెయ్యటం వల్ల తనకి ఫెయిరీ కొంచెం డబ్బులే ఇచ్చిందంట. ఇకనుంచైనా అల్లరి చెయ్యకుండా బుద్ధిగా అమ్మానాన్నల మాట వింటే ఈసారొచ్చినపుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బులిస్తుందట. అలా అని ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి వెళ్ళిందట. వాళ్ళు నాతో చెప్పారు. ఆ డబ్బులతో వాళ్ళు స్కూల్‌ బయట చాక్లెట్లు కొనుక్కుని తినటం నేను చూశాను. ఇలా నా ఫ్రెండ్స్‌ చాలామందికి డబ్బులిచ్చింది టూత్‌ ఫెయిరీ. నాక్కూడా ఇస్తుంది. కావాలంటే చూడు, ఈ రాత్రికి మనింటికి కూడా వస్తుంది’’ నమ్మకంగా చెప్పాడు విహారి.

‘‘వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మానాన్నలే అలా డబ్బు పెట్టి, ఫెయిరీ ఇచ్చిందని చెప్పి ఉంటారు. అంతెందుకు, నీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా నిజంగా ఫెయిరీని చూశారా? ఎవరూ చూసుండరు, కావాలంటే వాళ్ళనే అడుగు’’ రెట్టించాను.

‘‘అలా కాదు నాన్నా, ఆ ఫెయిరీ రాత్రిపూట అందరూ పడుకున్నాక వచ్చి ఊడిన పన్ను తీసుకుని, డబ్బు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడందరూ నిద్రపోతుంటారు కదా... అందుకని ఎవరూ తనని చూడలేరు’’ అమాయకంగా చెప్పాడు.

‘‘ఏం పాపం, పగలంతా అంత ముఖ్యమైన పనులు ఏం వెలగబెడుతుందట మీ ఫెయిరీ? రాత్రిపూట మాత్రమే రావటానికి వీలవుతుందటనా తనకి’’ నా గొంతులో వ్యంగ్యం.

‘‘ఎవరెవరి ఇంటికి వెళ్ళాలో, ఎవరికి ఎలాంటి బహుమతులివ్వాలో చూసుకోవాలి కదా నాన్నా. పింకీ లాంటి కాస్త అల్లరి పిల్లలకైతే బుద్ధిగా ఉండమని ఉత్తరాలు కూడా రాయాలి. ఇలా చాలా పనులుంటాయి కదా తనకి. అందుకే ఆ పనులన్నీ చూసుకుని రాత్రిపూటే వస్తుంది’’ వాడి గొంతులో నమ్మకం.

నా ప్రతి ప్రశ్నకీ వాడి దగ్గర తను బలంగా నమ్మే సమాధానం ఉంది. కల్మషంలేని వాడి నమ్మకాన్ని చూసేకొద్దీ నా అహం దెబ్బతింటోంది. నాలో పట్టుదల హెచ్చింది. వేలెడంత లేడు, నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. పైగా నన్నే అబద్ధం చెప్తున్నానంటాడా? ఎంత పొగరు వీడికి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు అసలు లెక్క చెయ్యడు వీడు నన్ను. వీడి పొగరు అణచాల్సిందే అనుకుని ‘‘సరేరా, ఇవాళ రాత్రి చూద్దాం... నిజంగా ఫెయిరీ నీకు డబ్బులిస్తుందో లేదో అని. ఒకవేళ ఇస్తే, అంతకు రెట్టింపు డబ్బులు కలిపి నీకు నేనిస్తాను. ఏమీ లేకపోతే, టూత్‌ ఫెయిరీ కూడా లేదని నువ్వు ఒప్పుకోవాలి, సరేనా?’’ సవాల్‌ చేశాను.

‘‘చిన్నపిల్లాడితో ఇలాంటి పందాలేంటండీ’’ అంటూ నా భార్య మేఘ అడ్డుపడబోయింది. తనకీ గట్టిగా చెప్పేశాను... నాకు తెలీకుండా వాడి దిండుకింద డబ్బు పెట్టటానికి వీల్లేదని. పట్టుదలొస్తే ఎంత దూరమైనా వెళ్తానని తెలుసు తనకి. తెగేదాకా లాగటమెందుకని మిన్నకుండిపోయింది మేఘ.

మర్నాడు ఉదయం ‘ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి...’ అని సన్నగా పాడుకుంటూ పేపర్‌ తిరగేస్తున్నాను.‘విహారి ఎప్పుడు లేస్తాడా... ఎప్పుడు నా గెలుపు కళ్ళారా వాడి మొహంలో చూస్తానా’ అని ఆత్రుతగా ఉన్నాను.

అడుగులో అడుగేసుకుంటూ, చిన్నబోయిన ముఖంతో వచ్చిన వాడిని చూస్తూనే అర్థం అయింది- వాడనుకునే ఫెయిరీ రాలేదని. ఇప్పుడేమంటావ్‌ అన్నట్టు తనని చూసి సంతోషంగా నవ్వుతూ కళ్ళెగరేశాను.

అంత బాధలోనూ ఒక నిమిషం ఆలోచించి ‘‘రాత్రి చాలామంది పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చుంటుంది నాన్నా. ఈలోపు తెల్లారిపోయుంటుంది. అందుకే నా దగ్గరికి ఇవాళ రాలేకపోయుంటుంది. ఇంకొన్ని రోజులు టైమిద్దాం నాన్నా ఫెయిరీకి. తప్పకుండా వస్తుంది’’ స్థైర్యం కూడగట్టుకుంటూ చెప్పాడు.

నా అహం మళ్ళీ దెబ్బతింది. ఏంటి వీడి గుడ్డి నమ్మకం? విహారి ఎంత బలంగా ఫెయిరీ ఉందని నమ్ముతున్నాడో చూస్తుంటే, అంతకంతా నా పట్టుదల పెరుగుతోంది. కల్పితమైన ఫెయిరీ మీదే వాడికి అంత నమ్మకం ఉంటే, అలాంటివేమీ లేవని తెలిసిన నాకు ఇంకెంత పట్టుదల ఉండాలి? ముద్దుగా, అమాయకంగా ఉన్న విహారి ముఖం చూస్తే పాపం అనిపిస్తున్నా, ఎప్పటికైనా వాడిచేత ‘నాన్నా, నువ్వే కరెక్ట్‌’ అని అనిపించాలని నాలోని అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. నా పంతం వదలాలనిపించలేదు.

ఎన్ని రోజులయినా నేను మాత్రం డబ్బు పెట్టకూడదని గట్టిగా అనేసుకున్నాను. ‘పసివాడు- అందునా కన్నకొడుకు మీద ఈ అర్థంలేని సాధింపులేం’టని మేఘ వారిస్తున్నా, నేను పట్టించుకోలేదు. రోజు తర్వాత రోజు గడుస్తున్నా, ఫెయిరీ అలసిపోయుంటుందనో, ఫెయిరీకి జ్వరం వచ్చుంటుందేమో అనో, లేకపోతే ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కు పోయుంటుందేమో అనో... ఇలా తనకు తోచిన కారణాలేవో వెతుక్కుని సమాధానపడి ఎదురుచూస్తున్నాడు తప్పితే, ఫెయిరీ వస్తుందన్న ఆశ కోల్పోవటం లేదు. ఇన్ని రోజులవుతున్నా ఇంకా రాకపోవటమేంటన్న అనుమానం కానీ, అసలొస్తుందా లేదా అన్న అపనమ్మకంగానీ, ఇన్నాళ్ళుగా తనని ఎదురుచూపులు చూసేలా చేస్తోందన్న కోపంగానీ వాడికి ఫెయిరీ మీద కలగటం లేదు. అదే శాంత వదనం, అదే దృఢమైన కల్తీ లేని నమ్మకం. ఫెయిరీ అన్నది ఒక అభూతకల్పన అన్న నా నిజం, వాడికే అంతుంటే నాకెంతుండాలనే అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. నిజానికీ కల్పనకీ మధ్య జరుగుతున్న ఈ దోబూచులాటకి తెరపడే సమయం- మర్నాడు వినాయక చవితి పండుగ రూపంలో వచ్చింది.

చక్కగా తలస్నానం చేయించుకుని, కొత్త బట్టలు వేసుకుని బుద్ధిగా పూజకు తయారయ్యాడు విహారి. అందరం భక్తిశ్రద్ధలతో పూజ చేసుకుని, నవకాయ పిండివంటలను నైవేద్యంగా నివేదించాం. తర్వాత విహారికి ప్రసాదం పెట్టి, కళ్ళకద్దుకుని తినమని చెప్పాను. వాడికుండే సహజమైన ఉత్సుకతతో ‘‘ప్రసాదం అంటే ఏంటి నాన్నా, కళ్ళకద్దుకుని ఎందుకు తినాలి? రోజూ తినేటప్పుడు ఇలా చెయ్యం కదా, మరిప్పుడెందుకు?’’ అని అడిగాడు.

‘‘మనం ఈరోజు పూజలో దేవుడికోసం చేసిన గారెలూ బూరెలూ పాయసమూ లాంటివన్నీ స్వామి తీసుకుని, నచ్చినన్ని తిని, మిగిలినవి మనల్ని ఆశీర్వదించి మనకోసం ఉంచుతారు. అప్పుడు మనం వాటిని ఆ స్వామి ఇచ్చినట్టుగా అనుకుని తింటామన్నమాట. దాన్నే ప్రసాదం అంటారు. పండగలప్పుడు గుళ్ళో పూజారి తాత ఇచ్చేది కూడా ప్రసాదమే. సాక్షాత్తూ ఆ దేవుడే కొంత ఆరగించి, మన భక్తికి మెచ్చి, మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా భావిస్తాం కాబట్టి కళ్ళకద్దుకుని తింటామన్నమాట. అది మనం ఆ దేవుడికి ఇచ్చే గౌరవం. అర్థమైందా?’’ సాధ్యమైనంత సరళంగా చెప్పటానికి ప్రయత్నించాను.

‘‘మరైతే నాన్నా, మన దేవుడికి కారంగా ఉండేవి నచ్చుతాయా లేకపోతే స్వీట్లు నచ్చుతాయా? చాక్లెట్లు ఇస్తే తింటాడా, అసలు దేవుడు తింటాడని నీకు ఎలా తెలుసు? అలా తింటునప్పుడు నువ్వు చూశావా?’’ అమాయకంగా అడిగాడు.

నాకు ఒక్కసారిగా ఛెళ్ళుమని తగిలిన భావన. నేను దేవుణ్ణి నిజమని నమ్మి ఎలా కొలుస్తున్నానో, వాడికీ టూత్‌ ఫెయిరీ అలాగే కదా! చిన్న కష్టం వస్తేనే, అది గట్టెక్కిస్తాడని ధైర్యం కోసం దేవుణ్ణి తల్చుకుంటాము. మరి విహారికొచ్చిన మొదటి కష్టానికి, ధైర్యం కోసం ఫెయిరీని నమ్ముకున్నాడు. అందులో తప్పేముంది? మన కష్టంలో సాయం చేసినవాడిని దేవుడిలా వచ్చావని నమ్ముతామే... మరి మొదటిసారి పన్ను ఊడిన భయం, నొప్పి, ఊడిన చోట మళ్ళీ ఇంకో పన్ను వస్తుందో లేదో అన్న దిగులు... ఇలాంటివన్నీ ఫెయిరీ మరిపిస్తుందంటే తనని నమ్మటంలో విహారి తప్పేముంది? పైగా ఫెయిరీ తనని మెచ్చాలన్న కోరికతో ప్రతిరోజూ పళ్ళు శుభ్రంగా తోముతున్నాడు. బుద్ధిగా ఉంటున్నాడు. అన్నీ మంచి అలవాట్లేగా. ఇంకొకళ్ళకేమీ ఇబ్బంది కలిగించట్లేదుగా? మరెందుకు, ఏదో దొంగ బాబాని నమ్ముతున్నాడన్నంత రాద్ధాంతం చేశాను నేను? తను ఎంతో బలంగా నమ్మిన టూత్‌ ఫెయిరీని ‘అసలుందా, ఎవరన్నా చూశారా’ అని చులకన చేశాను. మరిప్పుడు విహారి అడిగిన దాంట్లోనూ న్యాయం ఉందికదా! చిన్నవాడు, ఏం చెయ్యలేడని వాడి నమ్మకాన్ని చిన్నబుచ్చాను. అసలు బాల్యమంటేనే ఇలాంటి ఎన్నో అందమైన ఊహలూ, నిజమని నమ్మి ఆనందించే అందమైన కల్పనల సమాహారం కదూ! ‘ప్రాక్టికల్‌... ప్రాక్టికల్‌...’ అనుకుంటూ వాడిని అలాంటివాటన్నిటికీ దూరం చెయ్యబోయాను. విహారి కాస్త పెద్దయితే నిజమేదో, కల్పనేదో వాడే తెలుసుకునేవాడు. మొగ్గ తనంత తానుగా వికసించాలి తప్ప, బలవంతంగా వికసింపజేయటానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అలా సహజంగా కాకుండా, బలవంతంగా వాడి నమ్మకాల్ని తప్పని నిరూపించాలనుకున్నాను. అన్నీ నాకే తెలుసన్న గర్వంతో, అర్థంలేని పంతంతో వాడి సున్నితత్వం మీద దెబ్బకొట్టబోయాను. పసివాడితో నేను పట్టిన పంతం తల్చుకుంటే నామీద నాకే సిగ్గేసింది. ఆ దేవుడే విహారి చేత ఇలా అడిగించి నా కళ్ళు తెరిపించాడనిపించింది. తప్పు చేశానన్న అంతర్మథనం మొదలైంది నాకు.

చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుని ఉంటానో మీరు ఊహించే ఉంటారు. అవును నిజమే, మర్నాడు మావాడి దిండుకింద టూత్‌ ఫెయిరీ వంద రూపాయలతోపాటు, రావటం కాస్త ఆలస్యమైందని ‘సారీ’ చెప్పి, తనెంత మంచి అబ్బాయో చెబుతూ ఒక ఉత్తరం కూడా రాసిపెట్టింది. అది చూసిన మా వాడి సంతోషం గురించి వేరే చెప్పాలా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..