హక్కు

ఫోన్లో మాట్లాడుతూనే బావురుమంది జయతి.

Published : 22 Jul 2023 23:53 IST

సింహప్రసాద్‌

ఫోన్లో మాట్లాడుతూనే బావురుమంది జయతి.

‘‘ఏమైంది?’’ ఆదుర్దాపడ్డాడు ఆమె భర్త రాజారావు.

‘‘మా నాన్న రెండు కిడ్నీలూ పాడయ్యాయి టండీ..!’’ మరింతగా ఏడవసాగింది.

కించిత్తు రిలీఫ్‌గా ఫీలయ్యాడు రాజారావు. ‘‘ఓస్‌... ఆ మాత్రానికే ఇన్ని ఏడుపులా! నేనింకా ఇంకేదో అయ్యిందేమో అని భయపడ్డాను.’’

‘‘ఇక అంతా అయిపోయినట్టేకదండీ. మనవల మనవరాళ్ళ అచ్చటా ముచ్చటా చూడకుండానే..!’’

మళ్ళీ ఏడుపు అందుకునేసరికి కస్సుమన్నాడు. ‘‘నువ్వు కాస్త కుళాయి కట్టెయ్‌. కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు. డయాలసిస్‌తో చాన్నాళ్ళు లాగించేయొచ్చు.’’

ఆమె కన్నీటిలో ఇంద్రధనుస్సు మెరిసింది. ‘‘నిజమా! అయినా, ఒక సిగరెట్టూ కాల్చరు, మందూ ముట్టరు. అరవైరెండు నిండకుండానే ఇలా అవడం ఏమిటండీ.

మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసుగా. మా కాళ్ళు కందకుండా, మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు. చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదు.’’

‘‘ఎలాంటివారికైనా ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి.’’

‘‘నేను అర్జంటుగా మా నాన్నని చూడాలి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు కాస్త ఇంటినీ పిల్లల్నీ చూసుకోండి.’’

‘‘రిజర్వేషన్‌ లేకుండా ఎలా వెళ్తావ్‌?’’

‘‘ఫరవాలేదు. ఏదో బస్సులో ఎలాగోలా వెళ్తాను. ఆరు గంటల ప్రయాణమేగా!’’ అయిష్టంగానే అంగీకరించాడు.

జయతిని బస్‌ స్టేషన్‌లో డ్రాప్‌ చేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు రాజారావు. పిల్లలు ఉదయమే స్కూలుకు వెళ్ళిపోయారు.

ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి. తిన్నగా ఆసుపత్రి కెళ్ళింది. బెడ్‌ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి బావురుమంది. కూతురి తల నిమిరి, కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం.

జయతి అన్న విక్రం, వదిన నాగమణి ముందుకొచ్చి ఆమెను ఓదార్చారు.

‘‘ఇప్పటికిప్పుడేం ప్రమాదం లేదులే జయతీ’’ నాగమణి చెప్పింది.

‘‘కిడ్నీ మార్పిడులు ఎక్కువగానే చేస్తున్నారుగా. మనం పయ్రత్నిద్దాం అన్నయ్యా.’’

ఇబ్బందిగా కదిలాడతడు. ‘‘డాక్టర్ని అడిగాం. ఇదివరకటిలా ఇప్పుడు ఎవరి దగ్గరబడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు. జీవన్‌దాన్‌లో రిజిస్టర్‌ చేయించుకుంటే బ్రెయిన్‌డెడ్‌ కేసువారో, యాక్సిడెంట్లో తీవంగ్రా గాయపడినవారో కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి సూటైన వారికి వరుస నంబరు ప్రకారం ఇస్తారట. చాలా టైమ్‌ పడుతుందిలే’’ చప్పరించేశాడు.

‘‘చూస్తూ చూస్తూ నాన్న చెయ్యి ఎలా వదిలెయ్యగలం. ఇంకేదైనా దారి ఉందేమో కనుక్కుందాం పద అన్నయ్యా’’ కళ్ళు తుడుచుకుంటూ లేచింది జయతి.

‘‘రక్త సంబంధీకులు ఒక కిడ్నీ డొనేట్‌ చేయొచ్చు. కానీ మనకెలా కుదుర్తుంది చెప్పు...’’

సోమసుందరం కల్పించుకున్నాడు. ‘‘ఇప్పుడలాంటివేం పెట్టుకోకండ్రా. మీరు హ్యాపీగా నిండు నూరేళ్ళు బతకాలి.

నా గురించేం ఆలోచించొద్దు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆ తృప్తిచాలు.’’

‘‘అయినా మీ అన్నయ్యకు కుదరదులేమ్మా. ఆయన సంపాదనే నాకూ పిల్లలకూ ఆధారం. మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి’’ అంది నాగమణి. అంతటితో ఆగకుండా మరో మాటా అంది ‘‘నీకెలాగూ ఉద్యోగం లేదు గనుక, నీ పిల్లలు హైస్కూలు చదువుకొచ్చారు గనుక నువ్వేమైనా దానం చేయగలవేమో ఆలోచించుకో.’’

‘‘నాది సూటవుతుందంటే తప్పకుండా ఇస్తాను వదినా. నాకు బతుకిచ్చిందీ, ఆ బతుకు బాగుండాలని అహరహం తపించిందీ నాన్నే. అమ్మపోయాక తనే అమ్మ కూడా అయి పెంచి పెద్ద చేశారు. చక్కని సంబంధం చూసి పెళ్ళి చేశారు. దేవుడి దయవల్ల నాకే లోటూ లేదు.’’

కఁయ్‌మన్నాడామె తండ్రి. ‘‘ఇంక ఆపు. అలాంటి పిచ్చి పనేం చెయ్యకు. ఇవాళ రేపు గాలీ నీరూ వాతావరణమూ అన్నీ కలుషితమై పోయాయి. కల్తీలూ ఎక్కువయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది. ఒక కిడ్నీ నాకిచ్చేస్తే రేపు నీకు అవసరమైతే ఏం చేస్తావు? అలాంటి వెధవ ఆలోచనలు కట్టిపెట్టు. నువ్వెప్పుడూ నవ్వుతూ నిండు ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలి తల్లీ’’ కూతురి చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరాడు.

‘‘నాకేం కాదు నాన్నా. దుక్కలా ఉన్నాను’’ నవ్వింది జయతి.

‘‘మరైతే డాక్టర్ని కన్సల్ట్‌ చేద్దామా’’ విక్రం అడిగాడు.

‘‘నువ్వాగరా. జయతి పెళ్ళయిన పిల్లరా. అల్లుడిగారి అభిప్రాయం తెలుసుకోకుండా తనెలా నిర్ణయించుకోగలదు? అయినా మీరంతా ఇవాళ్టి నా గురించే ఆలోచిస్తున్నారుగానీ రేపటి మీ గురించి ఆలోచించటం లేదు. కిడ్నీ మార్పిడి వల్ల ఓ మూడు నాలుగేళ్ళు నా ఆయుష్షు పెంచగలరేమో. కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కాంప్లికేషన్లు వస్తే జీవితాంతం బాధపడాలి. చేజేతులా సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది. ఇంక ఆ ఆలోచన మనస్సులోకి రానివ్వనని మాటియ్యి తల్లీ’’ చేయి చాచాడు సోమసుందరం.

‘‘మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మమ్మల్నింతటి వాళ్ళని చేశారు. అలాంటి మీకోసం ఈ చిన్నసాయం చేయలేమా’’ బేలగా అడిగింది.

కొడుకూ కోడలూ లేకుండా చూసి కూతురికి ఎంతో హితబోధ చేశాడు. అంతా మౌనంగా విని, ‘‘నాకో చిన్న అవకాశం ఇవ్వు నాన్నా’’ ప్రాధేయపడింది జయతి.

‘‘ముందుగా అల్లుడుగారితో మాట్లాడు. అతడి మాట తీసుకోకుండా వీళ్ళెవరితోనూ ఎలాంటి డిస్కషనూ పెట్టుకోవద్దు.’’

‘‘సరే, మీరింతగా చెబుతున్నారు గనుక ఆయన్ని ఒప్పించి వెంట తీసుకొస్తాను చూడు.’’

ఇంటికి తిరిగొచ్చింది. పరిస్థితి భర్తకు వివరించింది జయతి.

మామగారి పరిస్థితికి విచారం వ్యక్తపరిచాడు రాజారావు.

‘‘నాన్నకు కావాల్సింది సానుభూతి కాదు, కార్యాచరణ. నేను నా కిడ్నీని నాన్నకు ఇస్తాను.’’

కస్సుమని లేచాడు. ‘‘ఇదేం చిన్నపిల్లల ఆట కాదు, బతుకుతో పందెం. బుడబుడలాడుతూ దానం చేసేస్తే అయిపోదు. జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా..!’’ ఆ పైమాటలు మింగేశాడు.

ఆమె బెదర్లేదు. ‘‘నా ఆయుష్షు గట్టిదిలెండి. మీరంతా అండగా ఉండగా యమభటులు నా దరిదాపులకు రారుగానీ, మీరు ఒప్పుకోండి చాలు.’’

‘‘ఛస్తే ఒప్పుకోను. ఆ తర్వాత నువ్వు రోగిష్ఠిగా మారితే నేను లైఫ్‌లాంగ్‌ సేవలు చేస్తూ కూర్చోలేను.’’

నిర్ఘాంతపోయింది. దెబ్బతిన్నట్టు చూసింది. కొండంత నమ్మకం పేకమేడలా కూలిపోతోంటే కళ్ళు గంగాగోదావరులయ్యాయి. సేదదీరడానికి చాలా సమయమే పట్టింది.

పిల్లలకు అన్నం వడ్డించి పక్కనే విషాదమూర్తిలా కూర్చుండిపోయింది.

‘‘కిడ్నీ దానం అంటే ఏమిటి మమ్మీ’’ అడిగాడు కొడుకు.

‘‘మనిషికి ఒకటిపోయినా ఇంకోటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్య అవయవాలూ రెండేసి చొప్పున ఇచ్చాడు- కళ్ళూ కాళ్ళూ చేతులూ అలాగే కిడ్నీలూనూ. దురదృష్టవశాత్తూ తాతకి రెండు కిడ్నీలూ పాడైపోయాయి. వారం వారం ఆసుపత్రి కెళ్ళి డయాలసిస్‌ చేయించుకుంటే తప్ప బతకడు. అందుకని శాశ్వత పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తానన్నాను. నాకేదో అయిపోతుందని మీ డాడీ భయపడుతున్నారు.’’

‘‘ఒక్కటిచ్చేస్తే ఒకటే మిగుల్తుంది కదా... దానితో బతగ్గలమా?’’

‘‘నిక్షేపంలా బతకొచ్చు. రెండోది స్పేర్‌పార్ట్‌ అన్నమాట. రేపు నాకలాంటి అవసరం వస్తే మీరు నాకిస్తారా ఇవ్వరా?’’

‘‘తప్పకుండా ఇస్తాం’’ అన్నారు కోరస్‌గా. ఆ పసివాళ్ళ పాలబుగ్గలు నిమిరి మురిసిపోయింది.

‘‘మీరే మా భాగ్యమూ భవిష్యత్తూ. అలాగే నేను మా నాన్నకీ కదా! ‘బాలవాక్కు బ్రహ్మవాక్కు’ అన్నారు. మీ వాక్కుని నేను పాటిస్తాను’’ ఒక నిశ్చయానికొస్తూ అంది.

*           *          *

‘‘నేను కిడ్నీ ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను’’ మంచం ఎక్కుతూ అంది.

భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు. నెత్తి మీద బాంబు పడ్డా అంతలా ప్రతిస్పందించేవాడు కాదు. ఎన్నడూ ఎదురుచెప్పని, కనీసం గట్టిగా మాట్లాడి ఎరుగని జయతి గొంతు అమాంతం ధిక్కార స్వరంగా మారింది. ఇదెలా సాధ్యమైంది?

‘‘ఆ తర్వాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్టు లేదు.’’

‘‘డాక్టర్‌ వివరించారు.’’

‘‘అయినా తెగిస్తున్నావంటే నువ్వు నువ్వేనా అనిపిస్తోంది.’’

‘‘ఇప్పుడు నేనీ ఇంటిఇల్లాలిని కాదు... ఆ ఇంటి కూతుర్ని!’’

‘‘వెధవ్వాగుడు కట్టిపెట్టి నోర్మూసుకుని ఓ పక్కన పడి ఉండు’’ హెచ్చరించాడు.

ఆమె మరి రెట్టించలేదు. మౌనంగా అటు తిరిగి పడుకుంది. అతడి ఇగో సంతృప్తిపడింది.

మర్నాడు పిల్లల్ని స్కూలుకి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రాజారావు భృకుటి ముడివడింది. కళ్ళు చిట్లించి చూశాడు.

ఆ వెంటనే సూట్‌కేసుతో వచ్చింది. తన కళ్ళని విశ్వసించలేకపోయాడు.

‘‘వెళ్తున్నాను’’ గడప దాటబోతూ చెప్పింది.

‘‘నన్నూ నా మాటనూ ధిక్కరించి వెళ్తున్నావు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నువ్వు కిడ్నీ దానం చెయ్యడం నాకిష్టం లేదు. నన్ను కాదని వెళ్తే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టక్కర్లేదు’’ నిష్కర్షగా చెప్పాడు.

అతడివంక తిరస్కారంగా చూసి విసవిసా బయటికి నడిచింది జయతి.

భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది. అల్లుణ్ణి దేవుడని పొగిడేశాడు సోమసుందరం.

‘‘మామయ్య గారికి మీ అన్నయ్యకంటే నువ్వే ఎక్కువ ఇష్టం, ఎక్కువ నమ్మకం. వాటిని బాగానే నిలబెట్టుకున్నావు’’ మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి.

డాక్టర్ని కలిశారు. అన్ని రకాల పరీక్షలూ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఆమె వివాహిత గనుక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తీసుకు రమ్మన్నారు.

విస్తుబోయింది జయతి. ‘‘మళ్ళీ అదెందుకు? దాతని నేను. మీ ఎదురుగా ఉన్నాను.

మీ రూల్స్‌ అన్నింటికీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాను. మధ్యలో మావారి అంగీకారం ఎందుకు?’’ గట్టిగానే అడిగింది.

‘‘అది రూలు. ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళలేం. లేనిపోని లీగల్‌ కాంప్లికేషన్స్‌ మాకు అనవసరం.’’

డీలా పడింది. ‘‘ఇదెక్కడి విడ్డూరం. నా శరీరంలో ఓ చిన్ని అవయవాన్ని నేను దానమివ్వడానికి మా ఆయన్నుంచి అనుమతి పత్రం తీసుకురమ్మనడం అన్యాయం కాదూ?!’’

వాదనకు దిగింది గానీ వాళ్ళు ‘సారీ’ అనేశారు.

ఉక్రోషంతో ఊగిపోయింది.

‘పెళ్ళి ఆడవారి స్వతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా! ఆడదాని మీద సర్వాధికారాల్నీ కట్టుకున్న వాడికి ఇంతగా దఖలు పరుస్తుందా!’ ఉడికిపోయింది.

అన్నగార్ని తీసుకెళ్ళి అతడికి తెలిసిన ప్లీడర్ని కలిసింది.

‘‘చూడమ్మా, నీ భర్త నిన్ను పెళ్ళి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలూ అతడికి సంక్రమిస్తాయి. అవి చట్టపరిధిలో ఉన్నంతవరకూ ఎవరూ ప్రశ్నించలేరు. నీ చర్య వల్ల నీ భర్త సుఖసౌఖ్యాలకూ నీ పిల్లల క్షేమాభివృద్ధులకూ ఎటువంటి భంగం కలుగకూడదు. అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకీ నీ భర్త అనుమతి కావాలి. అవయవదానం చట్టంలోని ‘రూల్‌ నంబరు 22’ ఏం చెబుతోందంటే- దాత వివాహిత అయినట్లయితే ఎన్నోరకాల ప్రికాషన్లూ జాగత్తలూ తీసుకోవాలి. అందుకనే ఆసుపత్రి వారు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు. అనుసరించడం తప్ప మనమేమీ చెయ్యలేం.’’

‘‘ఈ శరీరం నాది. ఇందులోని భాగాలన్నీ నావి. నాకీ శరీరాన్ని ఇచ్చిన అమ్మానాన్నల కోసం, నా శరీరంలోని ఓ స్పేర్‌ పార్టుని నా ఇష్టానుసారం దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది? నా మెడలో పసుపుతాడు కట్టిన భాగ్యానికి నా బతుకు మీదా నా శరీరం మీదా ఆ శరీరంలోని సమస్త అవయవాల మీదా నా భర్తకు గుత్తాధిపత్యం ఇచ్చెయ్యడం అన్యాయం, అక్రమం.’’
‘‘నువ్వలా ఆవేశపడటం సబబే కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనమేం చెయ్యలేం.’’

దెబ్బతిన్నట్టు చూసింది. ‘‘ఒకవేళ నేనుగాక మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే, అప్పుడు మా వదిన నుంచీ ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా?’’

‘‘అవసరం లేదు.’’

‘‘మగవారికో రూలు ఆడవారికో రూలు! ఎందుకీ వివక్ష? చట్టం దృష్టిలోనూ ఆడవారికంటే మగవారు ఎక్కువ సమానులా? వారి శరీరావయవాల మీద మగవారికి ఉన్న హక్కు, మా అవయవాల మీద మాకెందుకు లేదు?’’

‘‘సారీ. ఇది కోర్టు తేల్చాల్సిన సమస్య!’’

‘‘అయితే కోర్టుకే వెళ్తాను.’’

‘‘కేసు ఎవరి మీద వేస్తావు? అనుమతివ్వని నీ భర్త మీదా... నిబంధనని అమలుచేస్తున్న ఆసుపత్రి మీదా... చట్టం చేసిన ప్రభుత్వం మీదా..? అర్థంలేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు. తండ్రి గతం- భర్త భవిష్యత్తు. నువ్వు తండ్రికన్నా భర్తపట్లే ఎక్కువ విశ్వాసంగా ఉండాలి.’’

‘‘ఇది విశ్వాసాల విషయం కాదు- బాధ్యతల సంగతి. హక్కుల సమస్య! అదేదో కోర్టులోనే తేల్చుకుంటాను. నా తరఫున కేసు వేయండి’’ ఆవేశంతో ఊగిపోయింది జయతి.

శుష్కహాసం చేశాడాయన. ‘‘ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసుని... సారీ, నేను టేకప్‌ చేయను. ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో. ఇలాంటి కేసులో ఏ ప్లీడరైనా వకాల్తా తీసుకుంటాడనుకోను!’’ హతాశురాలైంది. నిస్సహాయంగా వెనుదిరిగారు.

‘‘ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సాయపడాలనుకున్నావు. కానీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా, నేనైనా సర్దుకుపోక తప్పదు. తల వంచుకుని నలిగిన దారి వెంట సాగిపోవటమే అందరికీ శ్రేయస్కరం’’ అన్నాడు సోమసుందరం.

‘‘ఎవరో ఒకరు ముందు నడవనిదే కొత్తదారులు ఏర్పడవని మీరే చెప్పారుగా నాన్నా!’’

దెబ్బతిన్నట్టు చూశారు. ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు. ’’అన్నిటికీ అది వర్తించదు. ఇల్లాలికి అసలే కాదు.’’

‘‘ఎందుక్కాదు? ఎందుకా వివక్ష?’’

‘‘ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి.’’

‘‘ఎప్పుడూ తల దించుకోవద్దు. అన్యాయాలకు తల ఊపొద్దు. తల వంచుకోవాల్సిన పనులు చేయొద్దు. నిటారుగా నిలబడు. తల ఎత్తుకుని నిలబడు- అని నూరిపోసిన మీరు ఇప్పుడు పిరికిపాలు పోస్తున్నారేంటి నాన్నా.’’

వేదన, గర్వం మిళితమైన చూపులతో చూశాడు. ఆ చూపులమాటు నుంచి తొంగిచూస్తోన్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది.

‘‘నాకిప్పుడు పుత్రికోత్సాహం కలుగుతోందమ్మా. ఈ జన్మకీ ఆనందం చాలు.’’

‘‘ఇంటికెళ్ళి ఎలాగైనా మీ అల్లుడిగారి సంతకం పెట్టించుకొస్తాను నాన్నా’’ మొండి ధైర్యంతో అంది జయతి.

‘‘నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు, సంతోషం. నీ తాపతయ్రంగానీ నేను ఎన్నాళ్ళో బతకనమ్మా. ఈ ముసలాడి గురించి మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదు. అల్లుడుగారు కోపం తెచ్చుకునే పనేదీ చెయ్యనని నాకు మాటియ్యి...’’

‘నేను బాధతో సుళ్ళు తిరిగినా లెక్కలేదు కానీ అయనకు మాత్రం కోపం రాకూడదు. చాలా బావుంది నాన్నా’ మధనపడుతూ మౌనంగా ఉండిపోయింది. అలాగని కనుచూపుమేరలో మరో దిక్కూ దరీ కన్పించట్లేదు.

తిరిగొచ్చిన జయతిని చూసి నవ్వాడు రాజారావు. ‘‘ఇలా గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తావని నాకు ముందే తెలుసు. ఇప్పుడైనా ఈ సమాజంలోనూ చట్టం దృష్టిలోనూ ఆడదాని స్థానం ఏమిటో తెలుసుకో. ఊరికే ఎగిరితే ఆకాశం అందదు.’’

నిరుత్తరాలయ్యింది. బేలగా కన్నీటితో చూసింది. అనుమతి పత్రాన్ని బ్యాగులోంచి తీయలేకపోయింది.

కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు. చూపులతోనే ప్రశ్నించారు.

కూతురి భుజం మీద చెయ్యేసి వేదనగా అంది ‘‘మనకు మన శరీరం మీదేకాదు, లోలోపలి అంగాల మీదా హక్కూ అధికారమూ లేవు. మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్‌ సిటిజన్స్‌మి. అన్నివిధాలా వీకర్‌ సెక్షన్‌మి. అక్షరాలా బానిసలం.’’

ఆ మర్నాడు అవే మాటల్ని మిత్రురాలికి చెప్పి వాపోయింది జయతి. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది.

‘‘నిజంగా ఇది దారుణమే. దీన్ని ఎదిరించాల్సిందే. నువ్వెళ్ళి శారదాంబగార్ని కలువు. ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది.’’

‘‘తీర్పు ఎలా వస్తుందన్నది తర్వాతి సంగతి. యుద్ధానికి వెళ్ళకుండానే ఓటమి అంగీకరించను. ఇవాళే వెళ్ళి కలుస్తాను.’’

జయతి చెప్పిందంతా శారదాంబ శ్రద్ధగా విన్నారు.

‘‘నీ వాదనలో పస ఉంది, పాయింటు ఉంది. పిడికిలి బిగిద్దాం.’’

కేసు గెలిచినంత సంబరపడిపోయింది.

విషయం తెలిసి- ‘‘మొగుడి అధికారాన్ని కోర్టులో సవాలు చేస్తున్నావన్నమాట. సరే కానియ్‌. కోర్టు శంఖంలో పోశాకే తెలివి తెచ్చుకుందువుగాని’’ కసిగా అన్నాడు రాజారావు.

‘‘చాలా తొందరపడ్డావమ్మా. ఇంకోటీ ఇంకోటీ అయితే నీ సాహసాన్ని నేనూ అభినందిద్దును. కానీ, నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకెక్కడం సమర్థించలేను. అల్లుడుగారు కారాలూ మిరియాలూ నూరుతున్నారేమో.

నీ తరఫున నేను క్షమాపణ కోరతాను, ఫోన్‌ అతడికియ్యమ్మా...’’ విషాదోద్విగ్నుడై అన్నాడు సోమసుందరం.

‘‘అవసరం లేదు నాన్నా. ఈయన్ని ప్రతివాదిగా చేర్చలేదు. కోర్టు కీడ్చటమూ లేదు. భయపడకండి. ఆసుపత్రి వర్గాలని ప్రతివాదులుగా చేర్చాం. వారే కదా అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది. కోర్టు ఏం చెబుతుందో వేచి చూద్దాం. నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందనీ ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందనీ చాలా నమ్మకంగా ఉంది. అదే జరిగితే మనకే కాదు, మున్ముందు ఎందరో మహిళలకు వెలుగుబాట వేసినట్టు అవుతుంది.’’

‘‘నా చిన్నారి జయతి ఎంత ఎదిగిపోయిందీ!’’ పరమానంద పడిపోయింది జయతి. కానీ, ఆ మర్నాటి నుంచే రాజారావు కక్ష కట్టినట్టుగా వ్యవహరించసాగాడు.

ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టు భావిస్తూ ముభావంగా ఉంటున్నాడు.

బంధుమిత్రుల్లో పరువు తీసేశావని వ్యంగ్య బాణాలు విసురుతున్నాడు. తన పోరాటం ఆసుపత్రివారి మీదేననీ తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణ నిబంధనననీ ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయం మార్చుకోలేదు.

అది నిరుత్సాహ పరుస్తున్నా వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది. వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకు వెళ్తోంది, వస్తోంది జయతి.

ఏడాదికిపైగా కేసు నడిచింది. వాదోపవాదాలు ముగిశాక ఒక రోజున కోర్టు తీర్పు ఇచ్చింది.

‘‘ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనడం అర్థరహితం. ఆమె వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్‌ చేయగల సుపీరియర్‌ లేక సూపర్‌వైజింగ్‌ అధికారం అతడికి ఉందనేది చట్టం గుర్తించదు. అలాంటి నియమాన్ని నిర్దేశించడమంటే ఆసుపత్రివారు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడమే. అలా చేయడం వల్ల
ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది. ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ అండ్‌ టిష్యూస్‌ (రూల్స్‌ 2014లోని- రూల్‌ 18) ‘స్పౌజ్‌’ అనుమతి తీసుకుని తీరాలని నిర్దేశించలేదు. (రూల్‌ 22) దాత పెళ్ళయిన మహిళ అయినట్టయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే చెప్పింది. అంచేత వాది జయతి తన కిడ్నీల్లో ఒక దాన్ని అనారోగ్యంతో బాధపడుతోన్న తన తండ్రికి, ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు భేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణపత్రం అవసరంలేదని స్పష్టం చేస్తున్నాం...’’

తీర్పు విని జయతి కన్నీళ్ళు ధారలు కడుతుంటే, బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది. అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది.

అభినందించబోయిన శారదాంబా, ఇతర మహిళా అడ్వకేట్లూ విస్తుబోయి చూశారు.

‘‘మొత్తానికి నా ఈ శరీరం అచ్చంగా నాదేననీ, ఈ శరీరం మీదా ఈ శరీరం లోపలి అవయవాల మీదా హక్కు ముమ్మాటికీ నాదేననీ నిరూపించుకోడానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడమ్‌... మా నాన్న అమూల్య ప్రాణాలు! నాన్న... నాన్న... నిన్ననే చనిపోయారు!’’ బరస్టయింది జయతి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..