జీవనచక్రం

సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు! అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూన్న నలభై ఏళ్ళ సత్యాన్ని బ్లడ్‌ క్యాన్సర్‌ భూతం అర్ధాంతరంగా మింగేసింది.

Updated : 13 Aug 2023 02:24 IST

- శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు

సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు! అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూన్న నలభై ఏళ్ళ సత్యాన్ని బ్లడ్‌ క్యాన్సర్‌ భూతం అర్ధాంతరంగా మింగేసింది. సత్యం- అందనంత దూరాలకేగిపోయి, అతనిపై ఆధారపడిన భార్యాబిడ్డలను దిక్కులేనివారిగా మిగిల్చాడు. ఆ కుటుంబాన్ని అనంత శోకసంద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు. కొడుకు పదో తరగతీ కూతురు ఏడవ తరగతీ చదువుకుంటున్నారు. అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువూసంధ్యలు లేని సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్దదిక్కుగా నిలిచిన భర్త ఉన్నపళంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోదించింది. ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి భోరున విలపించింది. ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటుచేసుకుంది... భర్తకి దూరమైన తన చిన్నకోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని! ముందురోజే సత్యానికి జరపాల్సిన పెద్దకర్మ తంతు తూతూమంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిగిపోయింది. దూరభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమతమ ఊర్లకు ప్రయాణమైపోయారు. చనిపోయిన సత్యం... ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సత్యానికి ఇద్దరు అన్నయ్యలూ ఒక అక్కయ్యా ఉన్నారు. అక్క సుభద్ర ఒడిశాలో భర్తతోపాటే ఎటువంటి బాదరబందీలేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు. చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తూ అయిదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టినవారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురి పరిస్థితీ మహా ఇరకాటంగా తయారయ్యింది. తమ్ముడి భార్యాపిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ కచ్చితంగా చెబుతుందని వారికీ బాగా తెలుసు. ఎందుకంటే ‘వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ’ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే. పెద్దకొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్దకర్మ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే- ‘తనవల్ల కాదని గట్టిగా చెప్పెయ్యాలి’ అని కరాఖండీగా నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామం ఆలోచనలూ ఇంచుమించుగా అలానే ఉన్నాయి. తనూ అన్నయ్యలాగే పదివేల రూపాయల సాయాన్ని ఎలాగూ అందించాడు. తరువాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడీ రాల్చేదిలేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకూ ఏకైక తోబుట్టువైన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది... ‘తను ఆడపిల్ల. అంటే మెట్టినింటి పిల్ల. తమ్ముడికి తనేమి సాయం చెయ్యగలదూ..? అయినా కానీ తమ్ముడి పెద్దకర్మకి తన వంతుగా ఐదువేల రూపాయిలు ఇవ్వనే ఇచ్చింది. ఇంతకన్నా తను చేసేదేమీ లేదు’ అని అమ్మకు స్పష్టంగా చెప్పెయ్యాలని మనసులో గట్టిగానే బాస చేసుకుంది. అందరి రకరకాల ఆలోచనలకు కారణం- ముందురోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకీ కూతురుకీ ‘రేపు ఉదయం  అందరమూ కలిసి మాట్లాడుకోవాలనీ, చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కారమార్గం అలోచించాలనీ’ మరీమరీ చెప్పింది.

*        *       *

ఉదయం ఎనిమిది గంటల వేళ. జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశమయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనస్సుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటికే అక్కడకు వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది.
పెద్దకొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ ‘‘చెప్పమ్మా, ఇప్పడేం చేద్దాం..?’’ అంటూ తల్లిని ఆలోచనల్లోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు.
జానకమ్మ- పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదుల్తూ, ‘‘మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురూ ఎలాగో ఒకలాగ జీవితంలో నిలదొక్కుకున్నారు. ఆయన మననుండి దూరమయ్యాక చిన్నోడు ఇంటిపనులకే పూర్తిగా అంకితమైపోయి, తన చదువుని అటకెక్కించేశాడు. ఇప్పడు వాడు మనకి దూరమయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టమొచ్చి పడింది. వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు. తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి’’ అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్దకోడలు కలగజేసుకుంటూ ‘‘అత్తయ్యగారూ, మా బతుకులే అంతంత మాత్రంగా, భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళకోసం మేమేం చేయగలం? కావాలంటే సత్యం కూతుర్ని మాతోపాటు  తీసుకెళతాం. నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది. ఈలోగా తన అన్న అవినాష్‌ నిలదొక్కుకున్నాక, చెల్లెలి పెళ్ళీ గట్రా... వాడే చూసుకుంటాడు’’ మనసులో నలుగుతూన్న తన అభిప్రాయాన్ని నీళ్ళు నములుతూ నెమ్మదిగా బైట పెట్టిందామె, కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ. ‘‘బంగారంలాంటి భవిష్యత్తు ఉన్న కూతురులాంటిదాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు?’’ సూటిగా ప్రశ్నించింది జానకమ్మ. అత్తగారి మాటలకి పెద్దకోడలు కాస్త విసురుగా ‘‘లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతోపాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని. మాకంత స్తోమతలేదు. మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు’’ అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండీగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త, భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు.

జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది. అతను, తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా ‘‘అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి. ఇంకొకరి జీవితాల్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది? అవినాషే తన టెన్త్‌క్లాస్‌ చదువు ఆపేసి, వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో, మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి. కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా’’ తన తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తుచేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం. ‘‘అవునమ్మా... తమ్ముడు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం’’ అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని  చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర. ముగ్గురు పిల్లలూ అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బైటపెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లలలో అంతగా పేరుకుపోయిన స్వార్థచింతనకు ఆమె మనసు మూగబోయింది. జానకమ్మ- తన ముగ్గురి పిల్లలనుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది. కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగుల్చుకుని, ‘‘ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు- జీవితాల్లో స్థిరపడ్డారు. అందుకని నా మాటకు విలువనిచ్చి, ఈ ఇంటిని సత్యం భార్యాబిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేననుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది...’’ అంటూ జానకమ్మ తన మనసులోని మాటని బైటపెట్టి, అర్ధోక్తిగా ఆగిపోయింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది. ‘‘అదెలా కుదురుతుంది... నలుగురికీ సరిసమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి ధారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా?’’ తన గొంతుని పెద్దగా హెచ్చించిందామె. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. అక్కడికి కాస్త దూరంగా వంట గదిలోంచి అంతా గమనిస్తోన్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది. అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వెరపాటుకి గురయింది. ‘ఆత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు’ అనుకుంది. ఆ వాతావరణం సత్యవతి మనసుకెంతో కష్టంగా అన్పించింది. అత్తగారికి తనపట్లా తన పిల్లలపట్లా ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా అయిదుగురు సభ్యులూ జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ, పెద్దకోడలికే మద్దతుగా నిలిచారు. జానకమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపుచుక్క కరువైనట్టుగా నిలువునా నీరుగారిపోయిందామె. స్వార్థం పెచ్చుపెరిగి రక్తసంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోన ఎంతగానో కుమిలిపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటుచేసుకుంది. అప్పుడే- సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేటుల్లో టిఫిన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది. చంద్రశేఖరం, రామం, సుభద్రలకు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి, భారంగా మారిపోయింది. ఆ ఐదుగురూ తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్‌ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు. జానకమ్మ మాత్రం అంతులేని వేదనా భారంతో తన టిఫిన్‌ ప్లేటుని పక్కనపెట్టి దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె తన చిట్టచివరి ఆశగా ‘‘మీలోని స్వార్థాన్ని కాస్త పక్కనపెట్టి సహృదయంతో ఆలోచించకూడదూ..!’’ అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లలవైపూ చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ ‘‘అత్తయ్యా, మీ బాధ్యత మాది. మీకు ఏం కావాలో చెప్పండి. క్షణాల్లో చేసిపెడతాం. మీకిక్కడ కష్టంగా ఉంటే మాతోపాటే మా ఇంటికి వచ్చెయ్యండి’’ అంది అత్తగారిపట్ల తన గౌరవాన్నీ అభిమానాన్నీ చాటుకుంటున్నట్టుగా. జానకమ్మ, కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు వదుల్తూ ‘‘ఏమీ అనుకోవద్దమ్మా... ఏభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఊపిరి ఇక్కడే పోవాలి’’ అంది భారంగా. అప్పుడే వంట గదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి, చిన్నగా గొంతు విప్పింది. సత్యవతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కన్పిస్తోంది. ‘‘అత్తయ్యగారూ, నాకోసంగానీ నా పిల్లల కోసంగానీ మీరంతగా దిగులుపడొద్దు. నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను. పిల్లల గురించి ఆయన కన్న కలలను తప్పక నెరవేర్చుతాను. నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రం కోరుకోవడంలేదు. నాకు ఈ ఇల్లు వద్దు. ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలూ ఆప్యాయతలూ మాత్రం చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకుని నేనూ నా పిల్లలూ బతకాలనుకోవడం లేదు. నా ఒంట్లో బలం ఉంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలవా నేనూ నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి?! ఈ ఇల్లు మనందరిదీ. నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందజేయండి చాలు’’ అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతీ మాటలోనూ ప్రస్ఫుటిస్తూ. సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిల్చుండిపోయారు. ‘తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు. కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు. ఆ అండ చూసుకుని ఇలా మాట్లాడుతోంది’ అనుకున్నారు ఈసడింపుగా. ‘నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు..?’ అని ఎవరూ ప్రశ్నించదలచుకోలేదు. ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురమవుతుందనే అది తమకు సంబంధంలేని అంశంగా భావించి, వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారమైపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. తుఫాను వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటుచేసుకుంది. చేయిదాటి పోతుందనుకున్న ఆస్తి కాస్తా పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావిడిగా తమతమ ఊర్లకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్ళాల్చిన రైళ్ళు గంటో అరగంటో అటూయిటుగా ఉండటంతో ప్రతిసారీ అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు. ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం, మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే
దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు సత్యం లేడు కాబట్టి, వేరే ఆటో ఏదైనా మాట్లాడుకు రమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం. సరిగ్గా అప్పుడే- సత్యవతి ‘‘అక్కర్లేదు బావగారూ, నేనున్నాగా...’’ అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఒంటిమీద ఖాకీ చొక్కాతో కొత్తగా కనిపిస్తోందామె. ఆ ఖాకీ చొక్కాలో ఆమె అత్మాభిమానానికీ ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలా ఉంది. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారిముందు నిలబడింది సత్యవతి. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ‘‘నేనూ నా కుటుంబమూ ఎవరికీ భారం కాకూడదనే నా భర్త స్థానాన్నీ బాధ్యతనీ తీసుకోక తప్పడంలేదు. ఇక బయల్దేరదామా..?’’ అంటూ, అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరకు వెళ్ళి, ‘‘అత్తయ్యా, నన్ను ఆశీర్వదించండి’’ అంటూ ఆమె కాళ్ళకు నమస్కరించింది సత్యవతి. జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు సుడులు తిరిగాయి. ‘‘చల్లగా ఉండు తల్లీ, విజయోస్తు!’’ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కోడల్ని పైకిలేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. జానకమ్మ కళ్ళల్లో నీళ్ళు ఆమె చెంపలపై ధారలు కడుతున్నాయి. అవి ఆనందభాష్పాలో, కన్నీటిసుడులో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దయిపోతోంది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్‌ ఈరోజు
సత్యవతి బతుకుని ముందుకు నడిపిస్తోంది. అత్తగారి ఆశీస్సులతో వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. కుటుంబసభ్యులందరూ ఆమెను అనుసరించి, జాగ్రత్తగా సర్దుకుని ఆటోలో కూర్చున్నారు. సత్యవతి చెక్కుచెదరని ఆత్మసంకల్పంతో స్టార్ట్‌ చేసి, ఆటో హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతోంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబసభ్యులంతా డ్రైవింగ్‌ చేస్తోన్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు. ఇవేవీ పట్టని సత్యవతి, తన ఆటోని గమ్యం వైపుగా  పరుగులు తీయిస్తోంది. అందరితోపాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ. ఆమె బయల్దేరింది- వారందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తరిద్దామని! ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా, భీతీ లేనేలేవు. సత్యవతి- తన నరనరానా మొండి ధైర్యాన్ని నింపుకుని చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతోంది. జానకమ్మ కంటికి తన చిన్నకోడలు ‘సత్యవతి’ కనిపించడం లేదు... ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తోన్న కన్నకొడుకు ‘సత్యమే’ ఆమె కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..