నైవేద్యం సమర్పయామి..!

ఆధ్యాత్మిక క్షేత్రమేదైనా దేవతామూర్తుల దర్శనం అనంతరం ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ప్రసాదాలే. అలాగే, యాదాద్రీశుడి సన్నిధిలో అందించే ప్రసాదాలంటే భక్తులకు ఎంతో ప్రీతి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా...

Updated : 23 Mar 2022 16:47 IST

నైవేద్యం సమర్పయామి..!

ఆధ్యాత్మిక క్షేత్రమేదైనా దేవతామూర్తుల దర్శనం అనంతరం ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ప్రసాదాలే. అలాగే, యాదాద్రీశుడి సన్నిధిలో అందించే ప్రసాదాలంటే భక్తులకు ఎంతో ప్రీతి.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రసాదాల తయారీ సముదాయాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తే... ప్రసాదాల తయారీకి రూ.13 కోట్ల రూపాయలతో ఆధునిక యంత్రాలనూ ఏర్పాటు చేశారు. ఇవి రోజుకు 70 వేలకు పైగా లడ్డూలనూ విడతకు వెయ్యి కిలోల చొప్పున పులిహోరనూ తయారు చేయగలవు. 

నాలుగు రకాల ప్రసాదాలు

యాదాద్రి ఆలయంలో లడ్డూ, పులిహోర, దద్ద్యోజనం, వడ తయారు చేస్తుంటారు. ఇక,  ఆలయంలో రోజూ ఆరు క్వింటాళ్ల పులిహోరను తయారు చేసి విక్రయిస్తే అందులో వంద కేజీల పులిహోరనూ ఆరు కేజీల దద్ద్యోజనాన్నీ భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. 

స్వామి వారికి నైవేద్యాలివీ.. 

యాదాద్రీశుడికి వేకువజామున సుప్రభాతం అనంతరం బిందె తీర్థం నివేదిస్తారు. తరువాత నైవేద్యంగా దద్ద్యోజనం, పులిహోర, తీర్థం(బాలభోగం)... మధ్యాహ్నం పులిహోర, లడ్డూ, వడ, బజ్జీలు, తులసీదళం (మహారాజభోగం)... రాత్రి వేళ పులిహోర, శీతలం (ఆరగింపు) సమర్పిస్తారు. 

అన్నప్రసాద సత్రం

ఇక్కడ మూడు దశాబ్దాలుగా నిత్యాన్నదానం  జరుగుతోంది. సాధారణ రోజుల్లో 200 నుంచి 300 మంది భోంచేస్తారిక్కడ. ఇప్పుడు గండి చెరువు సమీపంలో 2.20 ఎకరాల్లో రెండంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేస్తుండటంతో ఒకేసారి 720 మంది భోజనం చేయొచ్చు.


స్వామికి నివేదించే ప్రసాదాలను ఇంట్లోనూ ఎలా చేసుకోవచ్చంటే...

వడ

కావలసినవి: పొట్టు మినప్పప్పు:  కప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), జీలకర్ర: చెంచా, మిరియాలు:  చెంచా, ఉప్పు: తగినంత, నెయ్యి: వేయించేందుకు.

తయారీ:  పప్పును గట్టి పిండిలా రుబ్బుకోవాలి. జీలకర్ర, మిరియాలు, ఉప్పు కలిపి పొడి చేసి ఈ పిండిలో కలపాలి. కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ ప్లాస్టిక్‌ కవరు మీద పల్చని వడలా చేసుకుని కాగిన నెయ్యిలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.  


లడ్డు

కావలసినవి: సెనగపిండి: కప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌: పావు కప్పు చొప్పున, యాలకులు: నాలుగు, పచ్చకర్పూరం: చిటికెడు, పటికబెల్లం: రెండు చెంచాలు, నెయ్యి: వేయించేందుకు, పాలు: పావుకప్పు, బియ్యప్పిండి: నాలుగు టేబుల్‌స్పూన్లు, చక్కెర: కొద్దిగా,  పాకం కోసం: చక్కెర: కప్పు, నీళ్లు: కప్పు. 

తయారీ: కడాయిలో నీళ్లు, చక్కెర తీసుకుని స్టౌమీద పెట్టి తీగపాకం పట్టుకోవాలి. ఓ గిన్నెలో బియ్యప్పిండి, చక్కెర, పాలు కలుపుకుని సెనగపిండి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గరిటెజారుగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కరిగిన నెయ్యిలో బూందీలా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో జీడిపప్పు,కిస్‌మిస్‌నీ వేయించుకోవాలి. వీటన్నింటినీ పచ్చకర్పూరం, పటికబెల్లం చక్కెరపాకంలో వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి.


దద్ద్యోజనం

కావలసినవి:  అన్నం: కప్పు, చిక్కని పెరుగు: రెండు కప్పులు, పాలు: అర కప్పు, ఉప్పు: తగినంత, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, నెయ్యి: చెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా, మిరియాలు: చెంచా. 

తయారీ: అన్నంలో పాలు, పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకుని అన్నంపైన వేసి కలపాలి.


పులిహోర

కావలసినవి: అన్నం: రెండు కప్పులు, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, పల్లీలు: పావు కప్పు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: అయిదు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, చింతపండు: నిమ్మకాయంత, మెంతులు: పావుచెంచా, ఇంగువ: కొద్దిగా. 

తయారీ: స్టౌమీద కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసి.. ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, మెంతులు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి వేయించి స్టౌ కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంపైన ఇంగువ వేసి బాగా కలపాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..