Published : 01 Oct 2022 23:52 IST

ఈ రోబో పెద్దవాళ్ల కోసం!

యసు పెరిగేకొద్దీ పెద్దవాళ్లలో కండరాల మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో తూలు వచ్చి నడుస్తూ నడుస్తూ పడిపోతారు. అందుకే సింగపూర్‌కు చెందిన నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు మొబైల్‌ రొబొటిక్‌ బ్యాలెన్స్‌ అసిస్టెంట్‌ను రూపొందించారు. దీన్నే మిస్టర్‌ బా అంటున్నారు. ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ల వెనకాలే తిరుగుతూ వాళ్ల ప్రతి కదలికనీ గమనిస్తుంటుంది. బ్యాటరీతో నడిచే ఈ రోబోకి ఓ లెదరు బెల్టు లాంటిది ఉంటుంది. ఈ బెల్టుని నడుం చుట్టూ పెట్టుకుంటే చాలు, అది వాళ్ల వెనకాలే వస్తూ ఉంటుంది. ఎక్కడైనా పడిపోతున్నారు అనుకోగానే- దానికి ఉన్న సీటు పైకి లేచి అందులో వాళ్లు కూర్చునేలా చేస్తుంది. కాస్త తేరుకున్నాక ఆ సీటు మళ్లీ ముడుచుకుని, వాళ్లని పైకి లేచేలా చేస్తుంది. కెమెరా ఇతరత్రా సెన్సర్లతో నడిచే ఈ రోబో, రీహాబిలిటేషన్‌ సెంటర్లకీ ఉపయోగపడుతుంది అంటున్నారు. మెదడు, వెన్నెముక గాయాలతోనూ పక్షవాతంతోనూ బాధపడుతోన్న వాళ్లకు ఈ రోబోను తోడుగా ఉంచినప్పుడు- వాళ్ల ఆరోగ్యం కాస్త మెరుగై నడిచేలా చేయగలిగిందట. కాబట్టి త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది సదరు బృందం.


వ్యాయామంతో జ్ఞాపకశక్తి!

డాది పొడవునా వ్యాయామం చేసేవాళ్లలో శారీరకంగానే కాదు, మెదడు ఆరోగ్యం కూడా బాగున్నట్లు  కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. డిప్రెషన్‌, మతిమరుపు తగ్గడంతోబాటు జ్ఞాపకశక్తి పెరిగినట్లూ గుర్తించారు. ఇందుకోసం డాట్‌మౌత్‌ కాలేజ్‌కు చెందిన నిపుణులు ఫిట్‌ బిట్‌ వాడేవాళ్లను ఏడాదిపాటు నిశితంగా గమనించారట. అందులో వాళ్లు ఎంత సమయం వ్యాయామం చేస్తున్నారూ, గుండె వేగం ఎలా మారుతోందీ, ఎన్ని అడుగులు వేస్తున్నారూ... వంటివన్నీ నోట్‌ చేశారట. ఆ తరవాత వాళ్లను రకరకాల ప్రశ్నలు అడుగుతూ జ్ఞాపకశక్తిని పరీక్షించారట. అందులో వాళ్లు చేసే వ్యాయామానికీ మెదడు ఆరోగ్యానికీ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. శారీరకంగా చురుకుగా ఉన్నవాళ్లలోనే జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. చిత్రంగా ఎక్కువ వేగంతో వ్యాయామం చేసేవాళ్లలో ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటే, నెమ్మదిగా అయినా ఎక్కువసేపు వ్యాయామం చేసినవాళ్లలో ఆందోళన, డిప్రెషన్‌... వంటివి కూడా తక్కువగా ఉన్నట్లు తేలిందట. ముఖ్యంగా నడవడం వల్ల జ్ఞాపకశక్తి బాగా మెరుగైందనేది సదరు పరిశోధకుల ఉవాచ.


వంగ రంగు టొమాటో!

దాదాపు ఓ దశాబ్దంపాటు చేసిన పరిశోధనల అనంతరం- వంగ రంగు టొమాటోల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయని ఒప్పుకుంటూ అమెరికా వ్యవసాయ విభాగం దానికి అనుమతి ఇచ్చింది. జన్యుమార్పు చేసిన ఈ వంగరంగు టొమాటోలో ఇతర రకాల్లోకన్నా పది రెట్లు ఎక్కువ ఆంతోసైనిన్లు ఉన్నాయట. సాధారణంగా ఈ రకమైన ఆంతోసైనిన్లు బ్లూబెర్రీలూ ఎరుపు రంగు క్యాబేజీల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి హృద్రోగాలనీ మధుమేహాన్నీ తగ్గిస్తాయనేది తెలిసిందే. అయితే కొన్ని రకాల టొమాటోల్లో తొక్క సహజంగానే వంకాయ రంగులో ఉంటుంది. కానీ వాటిల్లో ఆంతోసైనిన్ల శాతం తక్కువ. అందుకే స్నాప్‌ డ్రాగన్‌ అనే మొక్క నుంచి రెండు జన్యువులను, వంగ రంగు టొమాటోలు కాసే మొక్కకి ఇంజెక్టు చేసినప్పుడు- అందులోని ఆంతోసైనిన్ల శాతం పెరగడంతో నిండైన వంగ రంగు టొమాటో కాసిందట. ఇలా పండించిన టొమాటోల్ని ఎలుకలకు ఆహారంగా ఇచ్చినప్పుడు అవి మామూలుకన్నా ఎక్కువకాలం జీవించాయి. అయినప్పటికీ జన్యుమార్పు పంటలమీద ఉన్న అనుమానాలతో వీటిని పండించడానికి ఇంతవరకూ ప్రభుత్వం అనుమతించలేదు. అయితే ఇలా పండించిన టొమాటో రసాన్ని క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా క్యాన్సర్‌ రోగులకీ హృద్రోగులకీ కొన్నేళ్లపాటు ఇచ్చారట. దాంతో మొదటిసారిగా అమెరికాలో దీన్ని పండించడానికి ఆమోదం లభించిందనీ త్వరలోనే ఇంగ్లాండ్‌లో కూడా ఒప్పుకోవచ్చనీ పరిశోధకులు భావిస్తున్నారు. 


పసివాళ్లు ఏడుస్తుంటే...

డుస్తున్న పిల్లల్ని ఎత్తుకుని కాస్త అటూ ఇటూ తిప్పితే ఠక్కున ఏడుపు ఆపుతారు. అదే అలవాటుగా మారిన గడుసు పిల్లలైతే కూర్చోగానే మళ్లీ బేర్‌మంటారు. దాంతో అమ్మానాన్నలు లేచి మళ్లీ తిప్పాల్సిందే. అంతేకాదు, ఓ పట్టాన నిద్రపోవడానికి సతాయించే పిల్లల్ని పెద్దవాళ్లు భుజాన వేసుకుని జోకొట్టడం చూస్తుంటాం. దాంతో వాళ్లు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఇలా చేయడం మంచి పద్ధతేనని రికెన్‌ సెంటర్‌ ఫర్‌ బ్రెయిన్‌ సైన్స్‌కు చెందిన ఆధునిక పరిశోధకులూ చెబుతున్నారు. ఏడుస్తున్న పిల్లల్ని ఎత్తుకుని ఐదు నిమిషాలపాటు నడిస్తే వాళ్లు త్వరగా నిద్రపోతారట. ఇందుకోసం వీళ్లు 21 మంది పసివాళ్లను వీడియో కెమెరాలూ ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ ద్వారా పరిశీలించి మరీ చెబుతున్నారట. ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడూ ఎత్తుకుని కూర్చున్నప్పుడూ భుజంమీద పడుకోబెట్టుకుని నడిచినప్పుడూ పసివాళ్ల గుండె వేగాన్ని లెక్కించారట. కదలని ఉయ్యాలకన్నా కదిలే ఉయ్యాల మంచంలో ఉన్నప్పుడు వాళ్ల గుండె వేగం ముప్ఫై సెకన్లలోనే తగ్గి త్వరగా నిద్రలోకి జారుకున్నారట. అలాగే ఐదు నిమిషాలపాటు ఎత్తుకుని నడిచి, ఆ తరవాత మరో ఐదు నిమిషాలపాటు వాళ్లను ఒడిలో పెట్టుకుని కూర్చున్నప్పుడు మరింత త్వరగా నిద్రపోయారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని