భారత్‌ ఆ పాఠాలు నేర్పింది!

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్‌పాల్‌ బంగా బాధ్యతలు చేపట్టడం భారతీయులకి గర్వకారణం. కేజీ నుంచి పీజీ వరకూ చదువు మొత్తం భారత్‌లోనే పూర్తిచేశారు అజయ్‌.

Updated : 04 Jun 2023 12:47 IST

భారత్‌ ఆ పాఠాలు నేర్పింది!

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్‌పాల్‌ బంగా బాధ్యతలు చేపట్టడం భారతీయులకి గర్వకారణం. కేజీ నుంచి పీజీ వరకూ చదువు మొత్తం భారత్‌లోనే పూర్తిచేశారు అజయ్‌. అందుకే ఆయన్ని ‘మేడిన్‌ ఇండియా సీఈఓ’గా కొనియాడతారు. 63 ఏళ్ల బంగా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు...

వాయిదాలకు చోటులేదు...

తన నాయకత్వ విధానాల గురించి అడిగితే... ‘నెమ్మది, వాయిదా... అనే పదాలకు నా డిక్షనరీలో చోటులేదు. సమస్యను అర్థం చేసుకోవడానికి టైమ్‌ తీసుకోవచ్చు... పరిష్కారం చూపడంలో మాత్రం వెంటనే స్పందించాలి. పనుల్లో సర్దుబాటు విధానం వద్దు. ఏది 100 శాతం కచ్చితమో అదే చేయాలి. కింది, పైస్థాయి అని తేడా లేకుండా అందరి అభిప్రాయాల్నీ తెలుసుకోవాలి. మన నేపథ్యం, వేషధారణ మిగతావారికి భిన్నంగా ఉంటే గర్వంగా ఫీలవ్వాలి. అలా అనుకోకపోతే నేనిక్కడ వరకూ వచ్చేవాణ్ని కాదు’ అని చెబుతారు.


భారతీయ నేపథ్యంవల్లే...

తన విజయాలకు భారతీయ నేపథ్యమే కారణమంటారు. ‘నాన్న బదిలీలతో తరచూ కొత్త ప్రదేశాలకు వెళ్లేవాళ్లం. కొత్తవాళ్లతో కలిసి పోవడానికి చొరవ ఉండాలి. దాంతోపాటు మరికొన్ని అంశాలూ తెలుసుకున్నా. అందుకే ఎక్కడికి వెళ్లినా సులభంగా స్నేహితుల్ని సంపాదించుకుంటా. ఆ పరిస్థితులకు తొందరగా అలవాటు పడతా. చిన్నప్పుడే వైవిధ్యాన్నీ, భిన్నత్వాన్నీ చూశా. అది నాకు మేలు చేసింది’ అని చెప్పే బంగా 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేయాలని భారత్‌లో వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో భాగమవుతుంటారు.


ప్రపంచమే లక్ష్యం...

అజయ్‌ లక్ష్యాలెప్పుడూ ప్రపంచస్థాయిలో ఉండేవి. అందుకే బహుళజాతి సంస్థల్లోనే పనిచేయాలని నిశ్చయించు కున్నారు. ‘నెస్లే’తో కెరియర్‌ ప్రారంభించారు. ఆపైన ‘పెప్సీ కో’, ‘సిటీ బ్యాంకు’, ‘మాస్టర్‌ కార్డ్‌’లలో పనిచేశారు. 2010లో మాస్టర్‌ కార్డ్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాక ఆ సంస్థని ఆర్థిక చెల్లింపుల సేవల నుంచి డేటా, టెక్‌ ఆధారిత సేవల సంస్థగా మార్చి.. మార్కెట్‌ విలువని 13 రెట్లు పెంచారు.


చదువు హైదరాబాద్‌లో...

తండ్రి హర్భజన్‌ సింగ్‌... ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌. పుణెలో పుట్టిన అజయ్‌.. జలంధర్‌, సికింద్రాబాద్‌, దిల్లీ, శిమ్లాలలో చదువుకున్నారు. ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’ పూర్వవిద్యార్థి. దిల్లీ స్టీఫెన్స్‌ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అన్నయ్య, అక్క స్ఫూర్తితో ఎంబీఏ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 1981లో 19 ఏళ్లకే ఐఐఎమ్‌-అహ్మదాబాద్‌లో చేరారు. భార్య రీతూ అక్కడ క్లాస్‌మేట్‌. ‘ఐఐఎమ్‌ నాకు విద్యనీ, కుటుంబాన్నీ, మంచి స్నేహితుల్నీ ఇచ్చిందంటారు అజయ్‌.


ఇష్టమైన హాబీలు

బీచ్‌లో కూర్చుని పుస్తకాలు చదవడం. సంగీతం వినడం ఎంతో ఇష్టం. క్విన్సీ జోన్స్‌, లేడీ గాగా అభిమాని. పొద్దున్నే సిక్కు కీర్తనలు గానం చేస్తారు. ప్రయాణాల్లో జాజ్‌, ఏఆర్‌ రెహమాన్‌, నుస్రత్‌ ఫతే అలీఖాన్‌ పాటలు వింటారు. న్యూయార్క్‌ మెట్స్‌ బేస్‌బాల్‌ జట్టు అభిమాని.


వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌

భార్య రీతూ ఓ విద్యా సంస్థని నడుపుతున్నారు. వీరికి ఇద్దరమ్మాయిలు అదితి, జోజో. ‘వర్క్‌- లైఫ్‌ బ్యాలెన్స్‌ అంటే రెంటికీ సమానంగా సమయం కేటాయించడం కాదు, సమ ప్రాధాన్యం ఇవ్వడం. 20 ఏళ్లపాటు నా కెరియర్‌లో సగం రోజులు ప్రయాణాల్లోనే ఉండేవాణ్ని. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉందంటే ఒక్కరోజుకైనా  సరే విదేశాలనుంచి వచ్చేవాణ్ని’ అంటారు.


అందరికీ అవకాశాలు...

‘ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్ని మెరుగుపర్చుకునేందుకు అర్హులే. వారికి ఆ దిశగా అవకాశాలు కల్పించి, అందరూ మెరుగైన జీవనం సాగించేలా చేయడమే ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా నా లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు సంస్థల్నీ భాగం చేస్తా’ అని చెప్పే బంగా ఆఫ్రికా దేశాలపైన ప్రత్యేక దృష్టి పెడతానంటారు.


పరిశ్రమ పెద్దగా...

2015లో ‘అమెరికా వాణిజ్య నియమావళి రూపకల్పన మండలి’లో సభ్యుడిగా ఉన్నారు. ‘ఆర్థిక అసమానతల్ని తొలగించాల్సిన బాధ్యత ఈతరం మీద ఉంది’ అని చెప్పే బంగా... 2018లో ‘ఇంటర్నేషనల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించారు. దీనిద్వారా వర్ధమాన దేశాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించారు. మాస్టర్‌కార్డ్‌ తరఫున 10 కోట్ల మొక్కలు నాటేలా ప్రతినబూనారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..