సిల్లీపాయింట్‌

హైదరాబాద్‌ పేరుతో పాకిస్తాన్‌లోనూ ఓ నగరం ఉందని వినే ఉంటారు. ఇదే పేరుతో బంగ్లాదేశ్‌లోనూ ఒక గ్రామం ఉంది. ఇలా ప్రపంచంలోని గ్రామాలూ, పట్టణాలన్నింటినీ కలిపితే ప్రపంచవ్యాప్తంగా 84 హైదరాబాద్‌లు ఉన్నాయి మరి!

Published : 19 Feb 2023 00:11 IST

సిల్లీపాయింట్‌

హైదరాబాద్‌ పేరుతో పాకిస్తాన్‌లోనూ ఓ నగరం ఉందని వినే ఉంటారు. ఇదే పేరుతో బంగ్లాదేశ్‌లోనూ ఒక గ్రామం ఉంది. ఇలా ప్రపంచంలోని గ్రామాలూ, పట్టణాలన్నింటినీ కలిపితే ప్రపంచవ్యాప్తంగా 84 హైదరాబాద్‌లు ఉన్నాయి మరి!
* ఇంటర్నెట్టు ఊసేలేని- మామూలు ఫోన్‌ల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందట! స్మార్ట్‌ఫోన్‌ ఉన్న పదిమందిలో ఒక్కరు వీటివైపు వస్తున్నారంటోంది ఓ సర్వే. వీటికోసం ఆన్‌లైన్‌లో వెతికేవాళ్ళ సంఖ్యలో గత ఏడాది మాత్రమే 89 శాతం వృద్ధి
కనిపించిందట.
* లియొనార్డో దవించి, మైకెలేంజిలో, విన్సెంట్‌ వాన్‌ గా... ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు వీళ్ళు! గమ్మత్తేమిటంటే, ఈ ముగ్గురూ ఎడంచేతి వాటం ఉన్నవాళ్ళే!
* ప్రపంచంలో సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్న దేశం రుమేనియా! దాదాపు 96.5 శాతం మంది ఇక్కడ ఇంటి ఓనర్లే. 1991 వరకూ కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఈ దేశానికి... కొత్త ప్రభుత్వం వచ్చాక పాత సర్కారు అధీనంలో ఉన్న స్థలాలన్నింటినీ ప్రజలకి చవగ్గా అమ్మేయడం మొదలుపెట్టింది. ఇప్పుడూ అదే ట్రెండ్‌ కొనసాగుతోంది!
* 1895లో లండన్‌లో కలరా వ్యాధిని అరికట్టడానికే లైఫ్‌బాయ్‌ సోప్‌ని కనిపెట్టారు. ఇండియా, మలేషియా, ఇండోనేషియాలో ఇప్పటికీ వాడుతున్నా, ఆ సోపు పుట్టిన లండన్‌లో మాత్రం 1960ల్లోనే తయారీని ఆపేశారు!
* సహారా ఎడారిలో ఉండే ఇసుక పిల్లి’ (శాండ్‌ క్యాట్‌) మిగతా వాటిల్లా మియావ్‌ అనదు...కుక్కపిల్లల్లా మొరుగుతుంది.
* ప్రపంచంలో మొత్తం వెయ్యికిపైగా అరటి రకాలుంటే అందులో సగం మనం తినగలిగేవి కావు...!
* 1985లో కోకాకోలా విక్రయాలు తగ్గిపోవడంతో- కంపెనీ యాజమాన్యం కాస్త ఎక్కువ తీపితో ‘న్యూ’ కోకాకోలా అని తెచ్చింది. వినియోగదారులు దాన్ని వ్యతిరేకించడంతో ఆరునెలల తర్వాత పాత రుచితోనే మళ్ళీ ‘క్లాసిక్‌’ పేరుతో తీసుకొచ్చింది. ఈసారి సేల్స్‌ బాగా పెరిగాయి.
‘న్యూ కోకాకోలా’ అన్నది పాత కోకాకోలా సేల్స్‌ పెంచుకోవడానికి చేసిన జిమ్మిక్కని తరవాత తెలిసింది.


 

అమెరికాలో చనిపోయినవాళ్ళని ఖననం కాకుండా దహనం చేయడం పెరుగుతోంది. చితాభస్మాన్ని చనిపోయినవాళ్ళ చివరి కోరిక మేరకు వాళ్ళకిష్టమైన ప్రదేశంలో వెదజల్లుతారు. అలా, చాలామంది ‘ప్రపంచంలోనే ఆనందదాయక ప్రదేశంగా’గా పేరుగాంచిన... డిస్నీల్యాండ్‌ థీమ్‌ పార్కులోనే దాన్ని చల్లాలని విల్లు రాస్తున్నారట!


1939లో వాల్డ్‌ డిస్నీవాళ్ళ ‘స్నో వైట్‌ అండ్‌ సెవెన్‌ డ్వార్ఫ్స్‌’ చిత్రానికి ఆస్కార్‌ అవార్డుని అందించారు. కాకపోతే, మామూలుగా ఇచ్చే అవార్డు జ్ఞాపిక బదులుగా...ఓ పెద్ద ప్రతిమ, దానికింద ఏడు చిన్న ప్రతిమల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేసి అందించారు. ఆస్కార్‌ ప్రతిమని ఓ చిత్రం కోసం అలా మార్చడం చాలా అరుదు!


సెప్టెంబర్‌ 16... ప్రపంచ సినిమాదినోత్సవం. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టిప్లెక్స్‌లలో టికెట్టు ఒక్క డాలరే ఉంటుంది.


స్విగ్గీ, జొమాటో ల్లాగే అమెరికాలో ఉబర్‌ ఈట్స్‌, డోర్‌డాష్‌...ఆహారాన్ని అందిస్తాయి. అక్కడి డెలివరీ బాయ్స్‌ ఎక్కువగా కార్లలో వస్తారు!


ఫ్రాన్స్‌ చక్రవర్తి నెపోలియన్‌ తాను చనిపోయాక తన జుట్టుని కత్తిరించి... కుటుంబసభ్యులందరికి తలాకొంత పంచాలని విల్లు రాసిపెట్టాడు. ఫ్రెంచివాళ్ళలో చనిపోయినవాళ్ళ స్మృతిగా జుట్టుని భద్రంగా దాచుకునే ఆచారం అప్పట్లో ఉండేదట మరి!


ఓట్స్‌ పండించే టాప్‌-5 దేశాల్లో అమెరికా ఒకటి. కాకపోతే, 95 శాతం ఓట్స్‌ని అక్కడ పశువుల దాణాగానే ఉపయోగిస్తారు!


ఆపిల్‌ కంపెనీ తమ ఎర్ర రంగు ఫోన్‌ల పైన వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని ఎయిడ్స్‌, కొవిడ్‌ బాధితుల సంక్షేమానికి వినియోగిస్తుంది!


1983 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా స్కోరు... 183. చిత్రమేంటంటే... మన మాజీ వన్డే కెప్టెన్‌లు గంగూలీ, ధోనీ ఇద్దరిదీ... అత్యధిక స్కోరు 183. ఇప్పటిదాకా కోహ్లీ వ్యక్తిగత స్కోరూ అంతే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..