ఒడిలో చెల్లితో బడికి!

పదేళ్లంటే అమ్మ చుట్టూ తిరుగుతూ... ఆడుతూ పాడుతూ చిందులేసే వయసు. అలాంటిది మణిపూర్‌లోని తమెంగ్లాంగ్‌ జిల్లాకు చెందిన నాలుగో తరగతి చదువుతున్న మైనింగ్‌సింగ్లూ పమేయి ఏడాది వయసున్న తన చెల్లిని చూసుకుంటుంది.

Published : 15 May 2022 01:35 IST

ఒడిలో చెల్లితో బడికి!

పదేళ్లంటే అమ్మ చుట్టూ తిరుగుతూ... ఆడుతూ పాడుతూ చిందులేసే వయసు. అలాంటిది మణిపూర్‌లోని తమెంగ్లాంగ్‌ జిల్లాకు చెందిన నాలుగో తరగతి చదువుతున్న మైనింగ్‌సింగ్లూ పమేయి ఏడాది వయసున్న తన చెల్లిని చూసుకుంటుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళితేనేే వాళ్ల కుటుంబం గడుస్తుంది. దాంతో చెల్లిని పొట్టకి కట్టుకుని బడికి వెళుతోంది. మొదట్లో టీచర్లు పమేయిని రానివ్వలేదు. కానీ, ఆ పాపకి చదువుపైన ఉన్న ఇష్టం తెలుసుకున్నాక ప్రోత్సహించడం మొదలుపెట్టారు. పమేయి ఏడాది వయసున్న చెల్లిని ఒడిలో పడుకోబెట్టుకుని క్లాస్‌లో కూర్చునేది. ఆ చిన్నారి ఏడ్చినప్పుడు బయట ఆడిస్తూ గోరుముద్దలు తినిపించేది. పాప నిద్రపోయినప్పుడు టీచర్లతో పాఠాలు చెప్పించుకునేది. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మణిపూర్‌ రాష్ట్ర అటవీ శాఖమంత్రి బిశ్వజిత్‌ సింగ్‌ ఈ మధ్య పమేయి చదువు బాధ్యత తీసుకున్నారు. ఐదో తరగతి నుంచీ పీజీ వరకూ చదివించాలని నిర్ణయించుకుని ఇంఫాల్‌లో ఓ బోర్డింగు స్కూల్‌లో అడ్మిషన్‌ ఇప్పించారు. పమేయి చెల్లిని చూసుకుంటూ తల్లి ఇంట్లోనే ఉండేందుకు వారి కుటుంబానికి ఆర్థికంగానూ సాయం చేశారు బిశ్వజిత్‌.


దంతాలను శుభ్రం చేసే రొయ్య!

రొయ్యల్ని తింటాంగానీ... అవి దంతాల్ని శుభ్రం చేయడం ఏంటీ అనుకుంటున్నారా. అయితే తప్పకుండా క్లీనర్‌ ష్రింప్‌ గురించి తెలుసుకుని తీరాల్సిందే. సముద్రాల్లో ఉండే ఈ రొయ్యలు పగడపు దిబ్బల్నే ఆవాసంగా చేసుకుని జీవిస్తుంటాయి. ఇవి ఎక్కువగా పసిఫిక్‌ మహా సముద్రంలో ఉంటాయి. ఈ మధ్య ఓ స్కూబాడైవర్‌  క్లీనర్‌ ష్రింప్‌ గురించి తెలుసుకున్నాడు. వాటిని నేరుగా చూడాలనే ఉద్దేశంతో పసిఫిక్‌ మహాసముద్రంలోకి స్కూబా డైవింగ్‌కి వెళ్లాడు. పగడపు దిబ్బల వద్ద గుంపుగా ఉన్న ఆ రొయ్యల వద్దకు వెళ్లి నోరు తెరిచాడు. వెంటనే ఓ రొయ్య తన కాళ్లతో అతని దంతాల్ని శుభ్రం చేసి వాటి మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాల్ని తినేసింది. దాన్నంతటనీ మరొకరి సాయంతో వీడియో రికార్డు చేశాడతను. అంతేకాదు, ఈ రొయ్యలు సముద్ర జీవుల నోట్లోని దంతాల్నీ శుభ్రం చేసి... పారాసైట్లనీ, చిగుళ్లపై మృతకణాల్నీ తొలగిస్తాయట. రొయ్య, దంతాల్ని శుభ్రం చేసే ఆ వీడియో విపరీతంగా వైరల్‌ అయింది.


మట్టి పాత్రలే ఫ్రిజ్‌

సాధారణంగా ద్రాక్ష పండ్లు రెండుమూడు రోజులు ఉండాలంటే కచ్చితంగా ఫ్రిజ్‌లో పెట్టాల్సిందే. అదే పెద్ద మొత్తంలో పండిన పంటనైతే కోల్డ్‌ స్టోరేజీలో ఉంచుతారు. ద్రాక్ష విరివిగా పండే ఆఫ్ఘనిస్థాన్‌లో మాత్రం ‘కంగిణ’ అనే పురాతన పద్థతిలో నిల్వ చేసి తాజాగా ఉంచుతున్నారు. మట్టి కుండలపై వేసే మూతల ఆకృతిలో బంకమట్టితో రెండు పాత్రల్ని తయారు చేసి వాటి మధ్యలో అరకేజీ పండ్లని ఉంచి చుట్టూ మట్టితో కప్పేస్తారు. ఏ మాత్రం గాలీ వెలుతురూ తగలకుండా ఆ విధంగా నిల్వ చేసే ద్రాక్ష పండ్లు ఆరునెలలపాటు తాజాగా ఉంటాయట. అక్కడ వీధి వ్యాపారులూ ఇలా నిల్వ చేసిన పాత్రల్ని రోడ్ల పక్కన బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు. కొనుక్కునేవారికి అప్పటికప్పుడు ఆ మట్టిపాత్రల్ని పగలగొట్టి ద్రాక్షపండ్లని ఇస్తుంటారు. అలా పురాతన పద్ధతిలో నిల్వ చేసిన పండ్లు చాలా రుచిగా ఉంటాయనీ చెబుతారు ఆఫ్ఘన్‌ ప్రజలు.


కూర్చుని తింటే ఏడు కోట్లు!

కూర్చుని తింటే ఎన్ని ఆస్తులైనా ఇట్టే కరిగిపోతాయని అంటారు పెద్దలు. కానీ, కెనడాకి చెందిన నవోమీ మెక్‌రే మాత్రం ఇంట్లోనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం కూర్చుని తింటూ నెలకి ఏడున్నర కోట్ల దాకా సంపాదిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇరవై ఏడేళ్ల నవోమి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌. ఒకసారి యూట్యూబ్‌లో ఆహార పదార్థాల్ని నమిలినప్పుడు వచ్చే శబ్దాలను వినిపిస్తూ ఒక మహిళ చేసిన వీడియోలను చూసి స్ఫూర్తి పొందింది. దాంతో 2019లో ఉద్యోగం మానేసి ‘హన్నిబీ ఎఎస్‌ఎమ్‌ఆర్‌’ పేరుతో అలాంటి వీడియోల్ని చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏడున్నర కోట్ల మందికిపైనే సబ్‌స్క్రైబర్లు ఉన్న తన ఛానల్‌లో నవోమీ రకరకాల ఆహారపదార్థాల్ని తింటూ వీడియోలు చేస్తుంది. వాటిని ‘అటానమస్‌ సెన్సరీ మెరిడియన్‌ రెస్పాన్స్‌’(ఎఎస్‌ఎమ్‌ఆర్‌) అనే టెక్నాలజీతో రికార్డు చేయడం వల్ల నమిలేటప్పుడు వచ్చే శబ్దాలూ స్పష్టంగా రికార్డు అవుతున్నాయి. అలానే జెల్లీలనూ, క్యాండీలనూ రకరకాల థీమ్‌లతోనూ రంగులతోనూ తయారు చేసుకుని తినడం నవోమీ ప్రత్యేకత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..