Updated : 31 Jul 2022 08:19 IST

ఆ సినిమా చూసి.. ‘ఐ హేట్‌ యూ’ అన్నారు

‘ఓకే బంగారం’తో పరిచయమైన దుల్కర్‌ సల్మాన్‌ ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మమ్ముట్టి వారసుడిగా వెండితెరకు పరిచయమైనా... పలు భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా హీరోగా నిలదొక్కుకున్నాడు. అటు దక్షిణాదిలోనూ ఇటు ఉత్తరాదిలోనూ మెప్పించిన దుల్కర్‌ స్టేజ్‌ ఫియర్‌ నేపథ్యం నుంచి స్టార్‌హీరోగా ఎదిగే వరకూ తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నాడిలా...

నాన్న నటించిన ‘స్వాతికిరణం’ విడుదలైనప్పుడు నాకు ఆరేడేళ్లు ఉంటాయి. ఆ సినిమాలోని పాటల్ని నాకూ, అక్కకీ వినిపిస్తూ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. అప్పుడు ఆయన గొప్పతనం నాకు అర్థమయ్యేది కాదు గానీ, పెద్దయ్యాక శాస్త్రిగారి సాహిత్యానికి అభిమానినయ్యా. అంతేకాదు, ‘సీతారామం’లో ‘కానుంది కల్యాణం...’ ఆయన కలం నుంచే జాలువారడం సంతోషంగా ఉన్నా... అది పంచుకోవడానికి ఆయన లేకపోవడం పెద్ద లోటు. నేను సినీ రంగంలోకి రాకపోయుంటే ఇలాంటి ఎన్నో అనుభూతుల్ని మిస్‌ అయ్యేవాణ్ని. నిజానికి ఇండస్ట్రీలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 

నేను పుట్టి పెరిగింది చెన్నైలో. అప్పట్లో నాన్న ఏడాదిలో పదికిపైనే సినిమాలు చేస్తూ ఇంట్లో కంటే షూటింగుల్లోనే ఎక్కువ ఉండేవారు. అమ్మే అన్నీ చూసుకునేది. విలాసాల జోలికి వెళ్లకుండా ‘మనకి ఈ డబ్బు శాశ్వతం కాదు, నాన్న చేతిలో సినిమాలు ఉన్నంత వరకే అవి ఉంటాయి. లేకపోతే మనకేమీ ఉండవు’ అని చెబుతూ చదువు దిశగా ప్రోత్సహించేది. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. చదువు విషయానికొస్తే అల్లరి బాగా చేసేవాణ్ని. ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదుతో ప్రిన్సిపల్‌ రూమ్‌కి తీసుకెళ్లేవారు. అలానే స్కూల్‌లో నియమాలన్నీ తప్పుతుండటంతో బ్యాడ్‌ స్టూడెంట్‌ అనే ముద్ర పడింది. నాకున్న ఒకే ఒక మంచి లక్షణం పుస్తకాలు చదవడం. క్లాస్‌ పుస్తకాలు కాకుండా హ్యారీపోటర్‌ వంటివి లైబ్రరీ నుంచి తీసుకెళ్లి చదివేవాణ్ని. అమ్మ నా చదువు గురించి ఎక్కువ వర్రీ అయితే, నాన్నేమో మనం ఏ పనిచేసినా- బాగా కష్టపడితేనే అందులో విజయం సాధించగలమని చెబుతుండేవారు. వరుస షూటింగ్‌ల వల్ల నిద్ర లేకపోవడం, ఆరోగ్యం పాడవడం, కుటుంబంతో గడపలేకపోవడం, ఫిట్‌నెస్‌కోసం కఠిన నియమాలు పాటించడం వంటివాటి గురించి చెబుతూనే- సినీ రంగంలో ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకుంటున్నప్పుడు కలిగే ఆనందాన్ని పంచుకునేవారు. ఆ క్షణంలో నేను సరిగా చదవనందుకు గిల్టీగా ఫీలయ్యేవాణ్ని. ఎనిమిదో తరగతి తప్పినప్పుడు అమ్మ ఎంతో బాధపడింది. నా జీవితంలో అదే మొదటిసారి అనుకుంటా అమ్మ అంతలా ఫీలవ్వడం. ఇంకెప్పుడూ తనని బాధపెట్టకూడదని కష్టపడి చదవడం మొదలుపెట్టా. అలా డిగ్రీ పూర్తి చేసిన నేను అమెరికాలోని పర్ద్యూ యూనివర్సిటీలో ఎంబీఏ చదివా. ఆ తరవాత దుబాయ్‌లో కొంత కాలం ఉద్యోగం చేశా. కానీ, నాకు 9-5 ఉద్యోగం బోర్‌ కొట్టేసింది. అప్పుడే- సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అనిపించి ఉద్యోగం మానేసి కేరళ వచ్చా. 

నాన్న వద్దన్నారు

ఉద్యోగం మానేసినందుకూ, సినిమాల్లోకి రావాలనుకున్నందుకూ నాన్న బాధపడ్డారు. సినిమాల్లోకి వద్దంటే వద్దన్నారు. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నటించలేవు. నువ్వు ఇంట్లో సరదాగా కూడా డాన్స్‌ చేయడం నేను చూడలేదు. వారసుడిగా నేను పరిచయం వరకే చేయగలను. నువ్వు సరిగా నటించకపోతే నీ బదులు నేను నటించలేను కదా. నువ్వు సరిగా నటించకపోతే దారుణమైన విమర్శలొస్తాయి. అవి విని తట్టుకోలేను’ అన్నారు. నాన్న మాటలకి ఆలోచనలో పడ్డా. నిజానికి నేను నటనను ఒక ఛాయిస్‌గా ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే హైస్కూల్‌లో ఉన్నప్పుడు నాకు చాలా సిగ్గు. క్లాస్‌లో అల్లరి చేసేవాణ్ని తప్ప స్టేజీ ఎక్కడానికి వణికిపోయేవాణ్ని. పైగా యాక్టర్‌ కొడుకుని... చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి అనుకునేవాణ్ని. కానీ, భయంతో కుదిరేది కాదు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే... నేను ఎక్కడో వెనక ఉండేవాణ్ని. నాన్న భయంలోనూ నిజం లేకపోలేదు. కానీ ఎప్పుడూ ఒకేలా ఉండం. నేనేంటో తెలుసుకోవాలంటే సినిమాల్లోకి రావడమే మంచిదనిపించింది. అందుకే కొన్నాళ్లు ముంబయిలో యాక్టింగ్‌కోర్సు చేసి భయాలనీ, స్టేజీ ఫియర్‌నీ పోగొట్టుకున్నాకే సినిమాల్లోకి వచ్చా. ‘సెకండ్‌ షో’ నా మొదటి సినిమా. మొదట్లో సెట్‌లో ఎక్కువ మంది ఉంటే నటించడానికి ఇబ్బంది పడేవాణ్ని. ఉన్నట్టుండి నెర్వస్‌గా ఫీలై పక్కకు వెళ్లేవాణ్ని. కొన్నిరోజులకి నాన్నకు ఆ విషయం చెబితే... ‘దర్శకుడు యాక్షన్‌- కట్‌ చెబుతారు కదా.. ఈ రెండింటి మధ్య ఈ ప్రపంచంలో నువ్వే బెస్ట్‌ యాక్టర్‌ అనుకో... కట్‌ చెప్పాక వరస్ట్‌ యాక్టర్‌ అనుకో...’ అన్నారు. ఆ మాటల్నే ఇప్పటికీ గుర్తుపెట్టుకుని నటిస్తుంటా. ఆ తరవాత వచ్చిన ‘జనతా హోటల్‌’ మంచి పేరు తీసుకురావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాపైన నాకు నమ్మకం పెరిగింది. ‘ఓకే బంగారం’ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. నా దృష్టిలో మణి సర్‌తో సినిమా అంటే హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లో సీటు కొట్టినట్టే. ఆ సినిమాకోసం ఒకసారి కంటిన్యూస్‌గా 36 గంటలు పనిచేయాల్సి వచ్చింది. నాకూ, నిత్యామేనన్‌కూ రెప్పలు వాలిపోయేవి. మణి సర్‌లో మాత్రం ఎలాంటి అలసటా కనిపించలేదు. కమిట్‌మెంట్‌ అంటే ఏమిటో ఆయన దగ్గరే నేర్చుకున్నా. 

భయపడ్డా...

డబ్బింగ్‌ వల్ల ప్రేక్షకులకు దగ్గరవుతామని నా ఫీలింగ్‌. అందుకే నా సినిమాల్ని ఏ భాషలో విడుదల చేసినా నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటా. పైగా ఫలానా భాషలో సినిమా చేయాలని ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు. నా మాతృభాష మలయాళం. స్కూల్‌లో హిందీ నా సెకండ్‌ లాంగ్వేజ్‌. తమిళం థర్డ్‌ లాంగ్వేజ్‌. అమెరికాలో చదువుకున్న కాలేజీలో తెలుగువారు ముగ్గురూ,  ఒకరిద్దరు మరాఠీ, గుజరాతీ వాళ్లూ ఉన్నారు. దాంతో నాకు పలు భాషలపైన పట్టు వచ్చింది. అయితే ‘మహానటి’ కథతో దర్శకనిర్మాతలు వచ్చినప్పుడు నాకు తెలుగు సరిగా రాదు, సినిమా చేయలేనని చెప్పేశా. అది మంచి పాత్ర. నా బదులు తెలుగు నటులయితే ఆ పాత్రకు న్యాయం చేస్తారని అనుకున్నా. ‘నువ్వు చేయగలవూ, కావాలంటే నీకోసం తెలుగు టీచర్‌ని పెడతాం’ అన్నా ధైర్యం సరిపోలేదు. ఆ సినిమాకి యువ బృందమే పని చేస్తోందన్న ఒక్క కారణంతో ఒప్పుకున్నా. కానీ అందులో వీక్‌పాయింట్‌ అవుతానని చాలా టెన్షన్‌ పడ్డా. ఎలాగైనా ఆ పాత్రకు న్యాయం చేయాలని జెమినీ గణేశన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన అలవాట్లూ, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్‌ స్టైల్, మేనరిజం వంటివి తెలుసుకున్నా. పాత ఫొటోలూ చూశా. షూటింగ్‌ సమయంలో అతి కష్టంమీద సంభాషణలు అర్థం చేసుకుంటూ నటించా. ఎంతో ప్రాక్టీస్‌ చేసి మరీ స్పష్టంగా డబ్బింగ్‌ చెప్పా. అందులో ‘అమ్మాడి’ నాకిష్టమైన పదం. చాలా గుర్తింపూ, ప్రశంసలూ తెచ్చింది. క్లైమాక్స్‌లో ఫోనులో ‘అమ్మాడీ...’ అని పిలిచిన తీరును ఎంతమంది ప్రశంసించారో! కీర్తీ సురేశ్‌ వాళ్ల అమ్మగారైతే ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడారు. కొందరు మహిళా అభిమానులైతే సోషల్‌ మీడియాలో ‘ఐ హేట్‌ యూ’ అని కామెంట్లు పెట్టారు. అందుకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే ఆ పాత్రకి న్యాయం చేయడం వల్లనే కదా నన్ను మనసుకు తీసుకున్నారు ప్రేక్షకులు. జెమినీ గణేశన్‌గా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాక ‘కార్వాన్‌’, ‘ది జోయా ఫ్యాక్టర్‌’తో బాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చాయి. ఇతర భాషల్లో చేస్తూనే మలయాళంలో నటించి, ఆ సినిమాల్ని అన్ని భాషల్లోనూ విడుదల చేయడం అలవాటు చేసుకున్నా. అలా చేసిన ‘కనులు కనులను దోచాయంటే’, ‘పరిణయం’, ‘కురుప్‌’, ‘హే సినామిక’, ‘సెల్యూట్‌’... చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ‘సీతా రామం’ నేరుగా తెలుగులో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం. యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథ నాకు ప్రత్యేకం. తొలి సినిమాలో ఎంత జాగ్రత్తగా, శ్రద్ధగా చేశానో దీనిలోనూ అలానే నటించా. 


నాన్న అస్సలు పొగడరు

షూటింగ్‌ కోసం ఓ పది పదిహేనురోజులు వేరే ఊరు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాక... మా అమ్మ రకరకాల వంటలు చేస్తుంది. తను వండినవీ, పెట్టినవీ ఏం తిన్నా లావు కానని చెబుతుంది. ఆ లాజిక్‌ ఏంటో నాకిప్పటికీ అర్థం కాదు. నేనివన్నీ తింటే ఫిట్‌నెస్‌ పాడైపోతుందంటే ‘చాలా రోజుల తరవాత ఇంటికొచ్చావ్‌. సరిగ్గా తిను’ అని దీనంగా మొహం పెడుతుంది. అమ్మకోసం తప్పదు కదా, తినేస్తుంటా.  

* నాన్న ఎప్పుడూ నన్ను పొగడరు. నాకేమో ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంటుంది. అందుకే నా సినిమాని ఆయనకోసం ఇంట్లో ప్రత్యేకంగా షో వేసి చూపించి ఆయన హావభావాల ద్వారా నచ్చిందో నచ్చలేదో తెలుసుకుంటుంటా. 

* సాధారణంగా హీరోలకు అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్‌ ఉంటారు. ‘మహానటి’ విడుదలయ్యాక అనుకుంటా ఒకబ్బాయి వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు. ఆటోగ్రాఫో, ఫొటోనో అడుగుతాడేమో అనుకున్నా. కాసేపు నన్ను ఆరాధనగా చూసి...‘సార్‌ మిమ్మల్ని ఒకసారి హగ్‌ చేసుకోవచ్చా’ అని అడిగాడు. స్వచ్ఛమైన ఆ ప్రేమకు ఫిదా అయ్యా. ఆ అభిమాని నాకెప్పుడూ ప్రత్యేకమే.

* మన స్టార్‌డమ్‌ నడిచినంత వరకే మనకి బ్రహ్మరథం పడతారు. ఆ తరవాత ప్రకటనలకి కూడా అవకాశమివ్వరు. అందుకే నేను సంపాదించడం మొదలుపెట్టాక స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతున్నా. ఓ హాస్పిటల్‌ కూడా కట్టించా.  

* నిర్మాణ సంస్థను మొదలుపెట్టి కొన్ని సినిమాలు తీశా. నా బ్యానర్‌ పేరు వేఫేరర్‌... బాటసారి అని అర్థం. నాన్న మాత్రం ‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావు’ అంటారు. ఆయనతో కలిసి నటించే సినిమా అలా ఇలా ఉండకూడదు కదా, ఎంత ప్రత్యేకత ఉండాలీ.  

* స్కూల్‌ టైమ్‌ నుంచీ రానా చాలా క్లోజ్‌. నాగచైతన్య మంచి ఫ్రెండ్‌. అఖిల్‌ నా చిన్నతమ్ముడు. రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా నాతో బాగుంటారు. హైదరాబాద్‌లో ఉన్నానని తెలిస్తే ఇంటికి పిలుస్తారు. వాళ్ల ఆతిథ్యాన్ని మరవలేను. 


పెళ్లి దైవ సంకల్పం!

నాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. నా భార్య అమల్‌ సూఫీది చెన్నై. తను తెలిసిన వాళ్ల అమ్మాయి. అమ్మకీ, మా బంధువులకీ తను నచ్చడంతో దుబాయ్‌ నుంచి రాగానే  ఫొటో చూపించి విషయం చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఒకసారి చెన్నై వెళ్లినప్పుడు అనుకోకుండా స్నేహితులతో కలిసి సినిమాకెళ్లా. తీరా చూస్తే నా ముందు సీట్లో అమల్‌ కూర్చుని ఉంది. తనని ఫొటోలో చూడటంతో గుర్తుపట్టా. అంతేకాదు తను స్కూల్‌లో నాకు జూనియర్‌. యాదృచ్ఛికంగా జరిగిన ఆ సంఘటన నాకెందుకో దైవ సంకల్పంగా అనిపించింది. వెంటనే విషయం అమ్మకి చెప్పి తనని ఒకరోజు డేట్‌కి పిలిచా. ఆమెకీ నేనంటే ఇష్టమని చెప్పడంతో 2011లో పెళ్లి చేసుకున్నాం. ఆ తరవాతే నేను సినిమాల్లోకి వచ్చా. మా పాప మరియం అమైరా సల్మాన్‌. తనకిప్పుడు ఆరేళ్లు. ఖాళీగా ఉంటే అమైరాతో కలిసి కార్టూన్‌షోలు చూస్తుంటా. దానికి ఇష్టమైన ‘ది లయన్‌ కింగ్‌’ ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. అంతేకాదు అమైరాకి ఆన్‌లైన్‌లో డ్రెస్‌లు కొంటూ మా అమ్మతో తిట్లు తింటుంటా.  


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని